Sunday, 22 February 2015


    

నేల రాలిన పారిజాతం . 

                                         కధానిక . (04)
గత వారం : నస్రీన్ బ్యూటీ పార్లర్  కి  ఫేసిఅల్  కోసం వచ్చిన పారిజాతం పని ముగించుకొని బయటకి వస్తూ ఉండగా పడవ లాంటి కారుని  పార్కింగ్ చేశి దిగుతున్న  గెరటబాబు  కంట పడుతుంది . ఇదేమీ గమనించని పారిజాతం స్నేహితురాలు షబ్నం తో కలిశి  ఆటో ఎక్కి వెళుతుంది . ఒక ఆదివారం షబ్నం  జగన్నాధం ఇంటికి వస్తుంది . గత వారం తరువాయి . ఇక చదవండి ... 
షబ్నం మౌనం నన్ను కొంత కంగారు పెట్టిన మాట నిజమే . 
అప్పుడే వంటిట్లో పనులు చక్కపెట్టుకొని ఫెళ  ఫెళ  లాడుతున్న గంజి పెట్టిన వంగపండు రంగు ఇస్త్రీ చీర కట్టుకొని వచ్చిన శేషమ్మ 'ఏమమ్మా ! అంతా  బావున్నారా 'అంటూ షబ్నంని  పలకరించింది .
 'బావున్నాం  ఆంటీ 'బదులుఇచ్చింది  షబ్నం . 
'పారిజాతం  రాలేదా  నీతో ' శేషమ్మ అడిగింది . 
'లేదు ఆంటీ ' ముక్తసరిగా జవాబిచ్చింది  షబ్నం  . 
'నువ్వు, అంకుల్  మాట్లాడుకుంటూ ఉండండి . నేను  ఈ లోగా పేరంటానికి వెళ్లి ఇట్టే  వచ్చేస్తా ' అని శేషమ్మ దగ్గరలో ఉన్న బంధువుల ఇంటికి పేరంటానికి వెళ్ళింది . 

'ఏంటి తల్లీ ! ఏమైనా  సమస్యా ?వచ్చిన దగ్గరనించి అదోలా ఉన్నావ్ ! ' అన్నా షబ్నంతో . 
'మీకు ఓ సంగతి  చెప్పాలి అంకుల్ . ఎలా మొదలెట్టాలో తెలియటంలేదు'
'సున్నితమైన సమస్యా ! పారిజాతం గురించా ' అన్నా.  
అవును అన్నట్లు తన విశాలమైన  కళ్ళతో చెప్పింది షబ్నం .సమస్య గంభీరమైనదే  అనిపించింది నాకు షబ్నం  తీరు  గమనించాక . 
 'చెప్పమ్మా 'అన్నాను .
 షబ్నం చెప్పిన వివరాలు  విన్న తర్వాత నా మెదడు  కొంతసేపు మొద్దుబారిపోయింది .  
                                             ...  
                                    
ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాలం (Internet ) ఉపయోగించే  దేశాలలో మనం చాలా ముందు ఉన్నాం అని స్టాటిస్స్టిక్స్ . అందులో సోషల్  నెట్వర్క్(Network) సైట్లలో(Site) మన  యువత శాతం నమోదు చాలా  ఎక్కువ . దాదాపు ఎనభై శాతం యువత  రోజులో ఎక్కువ సమయం నెట్ లో  ఈ సైట్లు చూస్తూ కాలం గడుపుతూ ఉన్నారని ఒక అంచనా . ఇందులో పెద్దలూ , యువత ,పిల్లలూ ఎవ్వరికీ మినహాయింపు   లేదు.    ఫేసుబుక్ లో ఫోటోలు ,వ్యాఖ్యలు ,వ్యాసాలు  పోస్ట్ చేసి వాటికి  హితులు , సన్నిహితులు ,స్నేహితుల స్పందన ,లైకు లు  చూసి పొందే ఆనందం  వేరు  . పారిజాతానికి    ఫేసుబుక్ లో ఎకౌంటు ఉంది  . 
...  

పర్వతాలు   నస్రీన్ బ్యూటీపార్లర్  లో రిసెప్షన్ డెస్క్ అసిస్టెంట్ . మెయిన్  రిసెప్షనిస్ట్  జాస్మిన్  సెలవు పెట్టినప్పుడో  లేక  మేడం  ఆమెను  పిలిచినప్పుడో డెస్క్ పని  చూసుకొనే భాద్యత  పర్వతాలు ది . 
పర్వతాలు  పేరుకే  పర్వతాలు గాని  సన్నగా  రివటలా ఉంటాడు .డేగ కళ్ళు . ముప్పై అయిదు ఏళ్ళు ఈ మధ్యనే  నిండాయి .చదువు  అంతంత మాత్రమే.  పర్వతాలుకి  ఓ  బలహీనత ఉంది . అది మందు . ఎవరైనా ఇంత  మందు పోయిస్తే  పీకల దాకా తాగేసి  అమెరికా  ప్రెసిడెంట్  ఒబామా  దగ్గరనుండి  చివరికి  బ్యూటీ పార్లర్ కి  రోజూ వచ్చే అమ్మాయిల వరకు  అనర్గళంగా వాగేస్తాడు . మత్తు  దిగేక ఏమీ  గుర్తుండదు పర్వతాలుకి .  ఒకసారి మందు నిషాలో   పర్వతాలు  పారిజాతం పట్ల  అసభ్యంగా  ప్రవర్తించబోతే  విషయం  నస్రీన్ కి  తెలిసి కాస్త గట్టిగానే  మందలించింది . అప్పటినుంచి   పర్వతాలు  గుర్రు గా ఉన్నాడు పారిజాతం మీద . 
... 
బ్యూటీ పార్లర్  నుండి  వస్తూ ఉన్న పారిజాతాన్ని చూసిన గెరటబాబు  బుర్ర  పాదరసంలా  పనిచేసింది . పర్వతాలు  మెదిలాడు అతని  మదిలో .   లంచ్ టైం లో పర్వతాలుని  ఆఫీసులోని  తన  గదికి  పిలిపించాడు గెరటబాబు .  గదిలో మందు  సరంజామా  చూసిన  పర్వతాలు  కళ్ళు మెరిసాయి . మూడు  పెగ్గుల మందు పడిన  తర్వాత  మాటలమీదా, శరీరం మీదా    నియంత్రణ  కోల్పోయాడు  పర్వతాలు .  ఏదేదో  మాట్లాడుతున్నాడు  అడ్డూ  అదుపూ లేకుండా . నిషా లో ఉన్న పర్వతాలు వద్ద నుండి పారిజాతం  సమాచారం పూర్తిగా  సేకరించాడు గెరటబాబు. ఫేసుబుక్ లో నమోదు అయి  వయసులో ఉన్న అమ్మాయిలని ఆకర్షించేలా తన ప్రొఫైల్  పెట్టుకొని  ఫ్రెండ్   రిక్వెస్ట్ పెట్టాడు  గెరటబాబు   పారిజాతానికి . మొదట్లో  రిక్వెస్ట్ కి  స్పందించలేదు  పారిజాతం . అదే పనిగా మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్లు  రావటంతో గెరటబాబు ప్రొఫైల్  చూసి ఆకర్షితురాలు అయి  ఫ్రెండ్ అయ్యింది పారిజాతం ఫేసుబుక్  లో . అలా మొదలైన పరిచయం చాలా సన్నిహితంగా  కలిసి మెలిసి తిరిగే  స్థాయి కి చేరుకుంది  అతి కొద్ది రోజులలోనే . అలాగని పారిజాతం హద్దులు ఏనాడూ  దాటలేదు .
... 
నెక్లెస్ రోడ్ . ఐమాక్స్ థియేటర్  .
 గెరటబాబు  పారిజాతం కోసం గంట ముందు నుంచి నిరీక్షిస్తున్నాడు .    ఆ రోజు సినిమా ప్రోగ్రాం ప్లాన్ చేశాడు  గెరటబాబు . అలాగే !అంది  పారిజాతం . కాస్సేపటికి గెరటబాబు నిరీక్షణ ఫలించింది .  తొందరగా అడుగులు  వేస్తూ వస్తున్న పారిజాతం  కనిపించింది . ఇద్దరూ థియేటర్ లోకి  ప్రవేశించేసరికి  సినిమా మొదలయ్యింది . విరామం  తర్వాత  సినిమా  ప్రారంభమయ్యాక   కొద్ది నిమిషాలకి  చనువుగా  ప్రవర్తించబోయాడు  గెరటబాబు పారిజాతంతో . గెరటబాబు  చేతులు  ఆమె శరీరాన్ని ఎక్కడెక్కడో తాకుతున్నాయి . శరీరం మీద తేళ్ళూ  ,జెర్రిలూ  పాకుతున్నట్లు  అనిపించింది  పారిజాతానికి . విసురుగా  అతని  చేతులని  విదల్చి సర్రున  లేచి థియేటర్  వెలుపలికి  వచ్చేసింది  .  గెరటబాబు  ఇది ఊహించలేదు . అతని  అహం దెబ్బతింది  పారిజాతం చర్యకి . అయితే  అది  బయటకు కనిపించనీయకుండా  పారిజాతాన్ని అనుసరించాడు  గెరటబాబు . ఎన్ని క్షమాపణలు  చెప్పినా  పారిజాతం  వినిపించుకోలేదు . ఆటో ఎక్కి రివ్వున  వెళిపోయింది  గెరటబాబుని గొంగళిపురుగు ని  చూసినట్లు  జుగుప్సగా   చూస్తూ . 
... 
ఈ సంఘటన జరిగాక పారిజాతాన్ని కలుసుకోవటానికి గెరటబాబు చేసిన  ప్రయత్నాలు  ఫలించలేదు .  పారిజాతంకి    ఫొన్  చేస్తే  పలకటం  లేదు .  
... 
విశ్వనాధం  ఫోనుచేసి' తీరుబడిలేక  నిన్ను ఈ మధ్యన కలవడం  పడలేదు  అని  పారిజాతం  చెప్పింది' అన్నాడు .
 'అది సరే గాని పుష్కరాల సమయంలో మన సమావేశ సందర్భంగా  అవిడి  నుండి  పాలకోవాలు ,ఆత్రేయపురం  పూతరేకులు, తాపేశ్వరం మడత కాజాలు పురమాయించాను . నువ్వూ ,షౌకత్అలీ తప్పకుండా రావాలి . నిరాశ  పరచకు . ' అన్నాడు విశ్వనాధం  చివరగా  ఫోను  సంభాషణ  ముగిస్తూ . 

నా ఆలోచనలు పారిజాతం చుట్టూ ముసురుకున్నాయి . 

శేషమ్మ వచ్చి 'చాలా  రాత్రి అయింది . నిద్రపోరా ఏమిటి ?'అని లైటు  స్విచ్ ఆఫ్ చేసింది . 
(మిగతా తరువాయి భాగంలో )  




  




                     

No comments: