Wednesday, 18 February 2015









నేల రాలిన పారిజాతం .    కధానిక                                   (03) 
గత  వారం :జగన్నాధం , షౌకత్ అలీ ,విశ్వనాధం  ముగ్గురూ  మంచి  మిత్రులు . విశ్వనాధం  కూతురు పారిజాతం  యాద్రిచ్చికంగా  హైదరాబాద్ లో  బజారులో తారసపడుతుంది జగన్నాధంకి.   సాయంత్రం  షౌకత్ అలీ  అమ్మాయి షబ్నం తో  కలిసి  జగన్నాధం  ఇంటికి  వస్తుంది పారిజాతం . వారి  ద్వారా  చాలా కాలం తర్వాత  షౌకత్ అలీ , విశ్వనాధం  కుటుంబ విశేషాలు  తెలుస్తాయి . షౌకత్ అలీ హైదరాబాద్ లోనే  స్థిరపడటంతో అలీని  పలకరిస్తాడు  జగన్నాధం ఫోనులో . విశ్వనాధం  రాజమండ్రి లో స్థిరపడతాడు ఉద్యోగ విరమణ తర్వాత . ఒకరోజు  ఉదయాన్నే  ఫోను మ్రోగితే ' మీకే ఫోను '  అని  ఇస్తుంది  విశ్వనాధంకి  భార్య రత్నం . ..... ........... గత వారం తరవాయి .... ఇక చదవండి .  
ఫోను అందుకొన్న విశ్వనాధం 'ఎవరూ 'అన్నాడు . 
'నేనురా.  జగన్నాధం  మాట్లాడుతున్నా హైదరాబాద్ నుండి  '
విశ్వనాధం  ఆనందానికి అవధులు  లేవు  ఆ  మాట వినగానే . 
'ఈ మధ్యన పారిజాతం  కనపడి  నీ వివరం ఇచ్చింది ' 
'అలాగా! గత వారం  ఇక్కడికి రాలేదు. పని ఒత్తిడి వల్ల  కుదరలేదనుకున్నాం . నేనూ ,రత్నం '.
'అది సరే ! నువ్వూ , శేషమ్మ  కులాసాయేనా ! ఆరోగ్యాలు బావున్నాయా ! అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు విశ్వనాధం . మా  కుశలం ,వివరం  చెప్పాను .   
' ఒంటరిగా   హైదరాబాద్ లో ఎలా ఉంటావమ్మా ! ఆ ఉద్యోగమేదో ఇక్కడే చూసుకోరాదూ ! అని మేమిద్దరం  ఎంత చెప్పినా వినలేదు మా మాట పారిజాతం . నువ్వు  హైదరాబాద్ లో  ఉంటున్నావని తెలిసి మనసు చాల తేలిక అయింది .'  అన్నాడు విశ్వనాధం . 
'నిశ్చింత గా ఉండు ' అన్నా . 
'ఓ ఆరు నెలలలో  గోదావరి  పుష్కరాలు . ఆ సందర్భంలో  మనమంతా రాజమండ్రి లో   కలుసుకుంటే  బావుంటుంది . అప్పటి రోజులు నెమరు వేసుకోవచ్చు .షౌకత్ అలీ  కి  నా  మాటగా  చెప్పి ప్రోగ్రాం  ఖాయం  చెయ్యి .'అన్నాడు విశ్వనాధం . 
'అలాగే ' అన్నా . ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుకున్న తర్వాత  మా ఫోను సంభాషణ ముగిసింది . 
                                                                     ... 
కాలం పరుగులు  పెడుతోంది . ఈ మధ్యలో షౌకత్అలీ ,నేను రెండు మూడు సార్లు  కలుసుకున్నాం . పారిజాతం ,షబ్నం  వీలు అయినప్పుడల్లా వచ్చి  కలుస్తున్నారు . అదే మాట ఆ మధ్యన విశ్వనాధం తో ఫోను లో మాట్లాడినపుడు చెబితే  ఎంతో  సంతోషించాడు . 
                                                                      ... 
బంజారా హిల్స్ . రోడ్  నెం . 2.
 నస్రీన్  బ్యూటీ పార్లర్  నుండి  ఫేసిఅల్  చేయించుకొని  బయటకు వచ్చింది పారిజాతం .   అప్పుడే  పడవ   లాంటి  కారు  వచ్చి పార్కింగ్ ఏరియా లో ఆగింది . కారు పార్క్  చేసి  దిగిన  గెరటబాబు  అందంగా నడిచి వస్తున్న  పారిజాతాన్ని చూశాడు . అమ్మాయి  చాలా  బాగుంది అనుకొన్నాడు మనసులో . ఇదేమీ గమనించని పారిజాతం అసింటా  తన  కోసం షాపింగ్ ముగించుకొని ఎదురు చూస్తున్న స్నేహితురాలు షబ్నంని  కలుసుకొంది . ఇద్దరూ ఆటో లో గచ్చిబౌలి  వెళిపోయారు . ఆటో కనుమరుగు  అయ్యేంతవరకూ గెరటబాబు చూపు  మరల్చలేదు . 
                                                               ... 
ఆ రాత్రి  గెరటబాబు కి నిద్ర పట్టలేదు . గెరటబాబు వృత్తి  హైదరాబాద్ లో  రియల్  ఎస్టేట్  వ్యాపారం . యువకుడు  . రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసి వచ్చి  బాగానే సంపాయించాడు గెరటబాబు  . ఇంకా వివాహం చేసుకోలేదు . అందమైనది   ఏది  కనిపించినా తన స్వంతం చేసుకోవాలన్న మనస్తత్వం  గెరటబాబుది . అనుకున్నది  సాధించడానికి  దేనికైనా  వెనుకాడడు గెరటబాబు  . ధనవంతుడు కావటంతో మిత్రులు కూడా ఎక్కువే . నస్రీన్  బ్యూటీ పార్లర్ ఉన్న  షాపింగ్ కాంప్లెక్స్  రెండవ అంతస్తు లో  గెరటబాబు  రియల్ ఎస్టేట్ ఆఫీసు . 
                                                                ... 
ఒకరోజు  పారిజాతం  ఇంటికి వచ్చినపుడు  వివాహం ప్రసక్తి వచ్చింది  మా  మాటలలో . 'ఏం తల్లీ ! ఉద్యోగంలో స్థిరపడ్డావు కదా! పెళ్లి  మాట ఏమి చేసావ్ ? నీ మనసులో  ఎవరైన  యోగ్యుడు  ఉంటే చెబితే  మీ నాన్న చెవిన వేస్తాను ' అన్నా. 
'పెళ్లి విషయం ఇంకా ఆలోచించలేదు మేస్టారూ !'అంది పారిజాతం.  అందరు సగటు ఆడపిల్లల లాగానే . ఇంతలో శేషమ్మ వచ్చి చేరింది మాతో 'ఏమిటీ 'అంటూ  ఇద్దరికీ చెరో టీ  కప్  అందిస్తూ . 
'అదే ! పెళ్లి ఎప్పుడూ ! అని అడిగితే  ఇప్పుడే కాదంటోంది పారిజాతం ' అని జవాబిచ్చా శేషమ్మ  ప్రశ్నకు . 
'ఆ ముచ్చట కూడా అయిపోతే  మీ అమ్మా , నాన్నల  భాద్యతలు  తీరినట్లే ' అంది శేషమ్మ పారిజాతంతో .  
ఎప్పటి లాగే  సన్నగా  నవ్వేసి  'వస్తా మేస్టారూ 'అని శెలవు  తీసుకుంది పారిజాతం . 
అలా  వెళ్ళిన  పారిజాతం ఆ తర్వాత చాలా రోజులు నన్ను కలవలేదు .ఫోను చేస్తే మొబైల్ పలకటంలేదు .  విశ్వనాధంకి ఫోను చేసి కనుక్కుంటే 'పని ఒత్తిడి వల్ల  కామోసు 'అన్నాడు .
                                                              ... 
ఆదివారం . న్యూస్ పేపర్లు  చదివి  ప్రక్కన  టేబుల్  మీద పెడుతూ ఉండగా  షబ్నం  లోపలికి  వచ్చింది గేటు  తీసుకుంటూ . 
'నమస్తే 'అంకుల్ ' అంది షబ్నం  వచ్చీ రాగానే . 
'సబ్ కుచ్ ఠీక్ హై ' అడిగా షబ్నంని . 
'జీ 'అంకుల్ . 
'పారిజాతం  ఈ మధ్యన కనపడలేదేమిటి  తల్లీ 'అని అడిగా షబ్నంని. 
షబ్నం  మౌనంగా  ఉండిపోయింది . 
                                                       (ఇంకా ఉంది. )









 

No comments: