వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వ
కార్యేషు సర్వదా .
....
నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్రయ మానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః
...
కాలం మింగేసిన బాల్యం .
(01)
Aanya with her beautiful Mother. |
Theme Art illustrations in this blog serial are by Aanya. She is six years old. A very talented child , lives in Fremont, California, United States of America. Aanya is one of the many grand daughters I have in this life.Her parents are Meenakshi Satyavolu and Kaushik Gopalan,both highly talented.
ఒక కవి గారు అన్నట్లు ...
"కావాలనుకొన్న బాల్యం కాలం మింగేసింది
వద్దనుకొన్న ముదిమి మీద పడిపోతోంది
ఈ మధ్య కాలంలో జీవితమంతా
అస్తవ్యస్తం ."
ఇక చదవండి .
The Beginning:
ముందుగా నా మూలాలు (Roots) గురించి ప్రస్తావించడం అవసరం గనుక వాటిని తెలియచేస్తున్నాను .
మాది తూర్పు గోదావరి జిల్లా వంటిమామిడి అగ్రహారం . మా పూర్వీకులు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం గోదావరీ తీరం పాశర్లపూడి లంక నుండి దైవ నిర్దేశం వల్ల వంటిమామిడి గ్రామానికి వలస వచ్చి స్థిర పడటం జరిగింది .
అలా వంటిమామిడిలో స్థిర పడిన మా వంశ మూల పురుషులు యర్రమిల్లి వేంకటాచలం గారు. వేంకటాచలం గారు వేద పండితులు . శివారాధకులు . వేదాల్లో చెప్పబడినది ప్రామాణికంగా తీసుకొని ,సనాతన ధర్మాన్నిపాటించి బ్రాహ్మణ్య విధులను సర్వ కాల పరిస్థితులలోనూ నిర్వర్తించి జీవించిన మహానుభావుడు . ఆరు వేల నియోగి . వేంకటాచలం గారు తాను నమ్మిన జీవన సూత్రాన్నే తన సంతానానికి నేర్పారు . వెంకటాచలం గారి కాలంలో వంటిమామిడి బ్రాహ్మణ అగ్రహారం బ్రహ్మి ముహూర్తంలో వేద మంత్రాలు , వేద ఘోష తో మార్మోగి పోయేదని పెద్దలు నా చిన్నప్పుడు చెప్పుకొనేవారు .
...
వేంకటాచలం గారి నాల్గవ కుమారుడు
నా ప్రపితామహ (ముత్తాత) రామచంద్రుడుగారు . రామచంద్రుడుగారి భార్య కామేశ్వరమ్మ (ముత్తబామ్మ ). వీరికి పదిమంది సంతానం . ఏడుగురు కుమారులు. ముగ్గురు కుమార్తెలు(సుందరమ్మ , శరభమ్మ ,సూరమ్మ ) . కుమార్తెలు ముగ్గిరికీ వివాహం జరిపించి తనకు తండ్రిగారి నుండి అనువంశీకం గా సంక్రమించిన రెండు వేల ఎకరాల పై చిలుకు స్థిరాస్తిని కుమారులకు , మరియు స్త్రీ ధనంగా తన వాటాగా మినహాయించు కున్న భూమిని వివాహితులైన కుమార్తెలకు తన జీవిత కాలంలో అనగా 1911 వ సంవత్సరంలో పంచిపెట్టారు రామచంద్రుడు గారు .
అదే కాలంలో ఎకరా విస్తీర్ణం గల స్తలంలో నిర్మించుకున్న పెద్ద మండువా ఇల్లు కూడా రామచంద్రుడు గారు పంచారు . ఆ పంపకాల ప్రకారం ఆ పెంకుటిల్లు రామచంద్రుడుగారి ఏడుగురు కుమారులలో నలుగురికి ( సర్వశ్రీ వెంకటాచలం , జగత్పతి , సూర్యనారాయణ మూర్తి మరియు నరసింహం గార్లకు) సంక్రమించింది . మిగతా కుమారులకు వారు కోరిన విధంగా ఇళ్లు నిర్మించి యిచ్చారు .ఆ విధంగా రెండవ కుమారుడైన జగన్నాధ రావు గారికి వంటిమామిడిలోనూ , ఆఖరి కుమారుడైన మంగయ్యగారికి పాయకరావు పేటలోనూ గృహములు నిర్మించబడ్డాయి . తన భాద్యతలు తీర్చుకున్న రామచంద్రుడు గారు విశ్రాంతి తీసుకున్నారు .
...
రామచంద్రుడుగారి మూడవ కుమారుడు జగత్పతి గారు . నా పితామహులు . పెంకుటిల్లు లోని మండువా వాటా మా పితామహులైన జగత్పతి గారికి వాటా పంపకాల్లో దక్కింది . ఈ మండువా ఇల్లే నా బాల్యం లోని జ్ఞాపకాలని అమూల్యంగా భద్రపరచి అనుక్షణం గుర్తు చేస్తూ ఉంటుంది .
...
జగత్పతి గారి భార్య లక్ష్మినరసమ్మ మా బామ్మ . వీరి మొదటి సంతానం కామేశ్వరమ్మ . రాజమండ్రీ వాస్తవ్యులు ఓలేటి జమిందారు వారి కోడలు . అయితే ఆమె వివాహం అయిన కొద్ది కాలంలోనే పురిటిలో మరణించింది . ఈవిడ భర్తతో కలిశి ఉన్న ఫోటో మొన్న మొన్నటి వరకు మా నాన్న గదిలో గోడకు తగిలించి ఉండేది . జగత్పతి లక్ష్మీనరసమ్మ దంపతులకు తర్వాత కలిగిన సంతానం సుబ్బారావు గారు. మా పెదనాన్న . ఈయన్ని సుబ్బులూ అని పిలిచేవారు .
...
ఆ తర్వాత పదహారు సంవత్సరాలకి జగత్పతి లక్ష్మీనరసమ్మ దంపతుల జీవితంలో అద్భుతం జరిగింది . వారికి ద్వితీయ పుత్రుడు చంద్రుడు గారు ఉదయించారు . అలా ఉదయించిన చంద్రుడు గారే మా నాన్న .
...
(అయి పోలేదు .. ఇది ప్రారంభం మాత్రమే . ఇంకా బోల్డు ఉంది .)
..................................................
మనిషి జీవితంలో బాల్యం అపూర్వమైన ఘట్టం . తెలియకుండా గడిచి పోతుంది అందమైన ,కల్లా కపటం ,చింతా చీకూ ఎరగని అమాయక బాల్యం .
'నా బాల్యం నాకిచ్చేయి ! ' అని ప్రతి రోజు ఉదయం ఆ సర్వేశ్వరుని ప్రార్దిస్తూనే ఉన్నాను .
అంత మధురమైనది నా బాల్యం .
దాన్ని అంత అందంగా తీర్చి దిద్దిన ఎందఱో మహానుభావుల గురించి ముందు ముందు చెప్తాను .
ప్రారంభం (The Beginning) ఎలా ఉందో తెలియ చేస్తే కధా గమనాన్ని మెరుగు పరచుకొనే వెసులుబాటు నాకు ఉంటుందని తప్పకుండా స్పందించమని మనవి చేసుకుంటూ ......
చంద్రుడు గారి అబ్బాయి .
..................................................
1 comment:
చక్కటి quotation తో ప్రారంభమైన మీ beginning ఎన్నెన్నో ఆసక్తికర మలుపులు తిరుగుతూ మేమంతా ఎదురు చూసేలా చేస్తుంది అనడానికి ఏమాత్రం సందేహం లేదండి. 👍👍
Post a Comment