Monday, 13 July 2015

                      సైకిల్   వీరులు.

                                                      Tag line..మన మీదేనర్రోయ్...

రోజూ  ఉదయం  మళ్ళీ  సాయంత్రం స్కూళ్ళు వదలగానే మా కాలనీ  లో  సైకిల్  శొభా  యాత్ర  జరుగుతూ  ఉంటుంది . ఈ  యాత్ర  చేసేవాళ్ళంతా  ఐదేళ్ళ నుండి  పదకొండు  లోపు వయసు పిల్లలు .మొత్తం టీం  మెంబర్లు  డజను పైనే.   ఇంట్లో  పెద్దలు  ముసుగులు  తన్ని  పడుకుంటే  పిల్లలు  వీధిలో  సైకిల్  యాత్ర  సందడి . పుష్కరాలకి  స్కూళ్ళు   శెలవలు  ఇచ్చేసిన  మూలాన  ఈ  సైకిల్  యాత్ర టీం కి  టైమూ  దిబ్బా  ఉండటం  లేదు  . పిల్లల  తల్లులు  ఇంటి  వరండా నుండి , బాల్కనీ  సిట్  అవుట్  నుండి  'ఎండల్లో  ఆడకండిరా ' అని  పిలుస్తూ  ఉంటె 'ఒక్క నిమిషం అమ్మా ! ' అని తుర్రున  పారి పోతూ  ఉంటారు . 
... 
సదరు  సైకిల్  శోభా యాత్ర  లీడర్  మా వర్ష . డిప్యూటీ లీడర్  వర్ష  తమ్ముడు రుషి . వర్ష కి  పదేళ్ళు  నిండాయి .బుర్ర నిండా రకరకాల  ఇన్నోవేటివ్ ఇడియాలు  వర్షకి .   రుషి కి ఏడు  సంవత్సరాలు . రుషి  మెదడు నిండా  కూడా  బోల్డు ఇడియాలు  ఉన్నాయి .  కాని వాళ్ళ  అక్క  పెద్దరికం  చూపించి  కొట్టి పారేస్తుంది . 
... 
 రుషి  కి  పాపం  పెద్ద చిక్కు  వచ్చి పడింది . ఈ  సైకిల్  బృందంలో  ఆడపిల్లల దే  మెజారిటీ.  రుషి  వయసు  మగ పిల్లలు  ముగ్గురిని  మించి ఉండరు. మొదట్లో  కొంత యిబ్బంది  పడినా  తర్వాత  సర్దుకు పోయాడు . పెద్ద  మగాడినని  పోజులు కొట్టడానికి  వాళ్ళ  అమ్మని  కాకా  పట్టి  జీన్ పంట్లాలు  కోనేసుకొని  సైకిల్  తెగ  స్పీడ్ గా తొక్కేస్తున్నాడు . 
... 
ఈ  సైకిల్  శోభా యాత్ర  అంతగా మా కాలనీ లో   ఆదరణ పొందటానికి  పరోక్ష కారణం  వర్ష ,రుషి  వాళ్ళ  నాన్న రామకృష్ణ . రామకృష్ణ  అమెరికాలో  కొద్ది సంవత్సరాలు  నివశించి  స్వదేశం  వచ్చేసిన   తర్వాత  అక్కడి  అలవాటు  ప్రకారం  కాలుష్యరహిత    వాహనం  మీద  ప్రయాణం చేయాలనే  సదుద్దేశంతో  గేర్లు  ఉన్న  సైకిల్  కొనుక్కొన్నాడు. షార్ట్స్ (పొట్టి లాగులు ) సాండో  బనియన్  వేసుకొని  కండల వీరుడులా  ఓ  నాలుగు  రోజులు  కాలనీ లో  గేరు సైకిల్ మీద  తిరిగేసరకి  జనం  వింతగా  చూడటంతో  సైకిల్  మూల  పడేసాడు . అప్పటి నుంచి  రుషి  నాకూ  సైకిల్  తొక్కాలని  ఎందుకో  అనిపిస్తోందని  పేచీ  పెడుతూ ఉంటే  పొట్టి సైకిల్ కొన్నాడు . కొన్నాళ్ళు  ఈ  పొట్టి  సైకిల్  వంతుల వారీ  గా  వర్ష ,రుషీ  వాడుకున్నారు . ఈలోగా  వర్ష ఫ్రెండ్స్ అందరికీ  వాళ్ళ  నాన్నలు  సైకిళ్ళు  అమర్చారు . దాంతో  వర్ష  నాకూ  ప్రత్యేకంగా  సైకిల్  కావాలని  వాళ్ళ  అమ్మ  దగ్గర  పేచీ పెట్టి  నాన్న చేత  ఒక రోజు  బజారు వెళ్లి  కొని తెచ్చేసుకుంది.  రుషి  వంతులు  తప్పాయని తెగ సంబరపడ్డాడు . 

పిల్లలు ఇద్దరూ  ఎవరి  సైకిల్ వాళ్ళు  హాయిగా తొక్కు కుంటున్నారు . ఇలా ఓ రెండు నెలలు తగాదాలు లేకుండా  గడిచాయి . పొట్టి సైకిల్ మీద ప్రావీణ్యం  గడించిన రుషి  దృష్టి  వర్ష  సైకిల్  మీద పడింది. వర్ష దృష్టి వాళ్ళ నాన్న మూలాన పడేసిన  గేరు  సైకిల్ మీద పడింది  . సైకిళ్ళు మారాయి . ఇప్పుడు రుషి  గేరు  సైకిల్  మీద కూడా ప్రావీణ్యం  సంపాయించేసి వాళ్ళ అక్క కి  తెలియకుండా  స్వైర  విహారం  చేస్తున్నాడు . పిల్లల  సైకిల్  ప్రగతి మేడ మీద బాల్కనీ నుండి   రోజూ  గమనిస్తున్న  సంధ్య  మహా  ముచ్చట పడింది .  
                           ... 
ఒక రోజు రామకృష్ణ  డైనింగ్ టేబుల్  దగ్గర  కూర్చొని లాప్ టాప్  లో ఆఫీసు  పని  చేసుకుంటూ  ఉంటే  సంధ్య  వచ్చి భర్త వెనకాల నిలబడింది . రామకృష్ణ  తన పనిలో  తాను  ఉన్నాడు . సంధ్య  రామకృష్ణ  వీపు  గోకి  సుతారంగా  నిమిరింది . 
 నాకేం దురద లేదు  సంధ్యా ' అన్నాడు  రామకృష్ణ  ఎగా దిగా చూశి  . 
' ఇలా  వీపు గోకి  నిమిరితే  మొగుడు  గారు  భార్య  కోరిన  కోరికలు అన్నీ తీరుస్తారుట ' అంది సంధ్య . 
విషయం  ఇంటరెస్టింగ్  గా  ఉందని  లాప్ టాప్  పక్కన  పెట్టి ' ఏ  పురాణం  లో చెప్పారు అలా ' అడిగాడు  రామకృష్ణ . 
'పురాణంలో  కాదు . మా సునీత చెప్పింది . తను ఏవైనా కొనుక్కోవాలంటే  సతీష్  వీపు గోకి  నిమిరితే  వెంటనే  కోరిక తీరుస్తాడుట 'అని వంటింట్లోకి  వెళ్లి  గ్యాస్  పొయ్యి మీద ఉన్న కందికట్టు  లో తాలింపు పెట్టి  వచ్చింది . 
కందికట్టు  తాలింపు  ఘాటు కి రామకృష్ణ  గదిలోకి వెళిపోయాడు . 

పట్టు విడవని  విక్రమార్కుడిలా ఆ  మరునాడు కూడా  గోకుడు  కార్యక్రమం  జరుగుతూ  ఉండగా  సత్సంఘ్  ప్రార్ధనలు  ముగించుకొని  గది లోంచి బయటకు వచ్చిన  రామకృష్ణ  అమ్మగారు ' ఏమిటి రా ! బుజ్జీ ! సంధ్య అలా బరుకుతోంది .  గజ్జి గాని  అంటించుకొని వచ్చావా ! ' అన్నారు . 
రామకృష్ణ  సంధ్య వైపు  కొర  కొరా  చూసాడు .      
సంధ్య  మరుగుతున్న పెసర కట్టు లో  కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు  వేయాలన్న నెపం తో కిచెన్ లో దూరి పోయింది .

నెక్స్ట్  డే . 
'ఈ  రోజు శనగకట్టు చేస్తున్నా ' అంది సంధ్య  రామకృష్ణతో . 
అంతకు ముందు  ఇలాటి  కట్టు  పేరు వినని  రామకృష్ణ  దీనం గా  చూసాడు సంధ్య వైపు . 
'చాలా  బావుంటుంది ' అంది సంధ్య ధీమాగా . అని  
గోకుడు  షో  మొదలుపెడదామనుకోనేటప్పటికి  అప్రమత్తుడైన  రామకృష్ణ  గోడకి జారగిలి  పడ్డాడు.  సంధ్యకి  వీపు నిమిరే అవకాశం  దక్కలేదు. 

మర్నాడు . నెక్స్ట్ టు నెక్స్ట్  డే .
'అది కాదండీ ' అంటూ  రామకృష్ణ  గది లోకి  వచ్చింది  సంధ్య . 
ఏమిటన్నట్లు ? చూశాడు  రామకృష్ణ . 
'నాకూ  సైకిల్ కొనండి . తొక్కుతాను ' అంది సంధ్య . 
'యిలా  సైకిల్  తొక్కితే  బావుండదేమోనే ' అన్నాడు రామకృష్ణ  నైటీ  లో ఉన్న సంధ్య కేసి చూశి . 
అరచేత్తో  నుదురు బాదుకొని ' ట్రెడ్ మిల్  సైకిల్.డాక్టర్అమ్మ  చెప్పింది  ' అంది  సంధ్య . 
'బొద్దుగా  ఉన్నావ్ ! చిక్కిపోతావేమోనే ' అని బెంగ పడ్డాడు  రామకృష్ణ . 
'చక్కనమ్మ  చిక్కినా అందమే ' అంటూ ' ఈ రోజు మినప కట్టు  కాస్తాను ' అని  ఠీవిగా ప్రకటించి  కిచెన్ లోకి వెళిపోయింది  సంధ్య . 

సాయింత్రం . రామకృష్ణ  పాతిక వేల రూపాయలు ఖర్చు పెట్టి అదునాతన  ట్రెడ్  మిల్  సైకిల్  తెచ్చి  క్రింద  గెస్ట్ పోర్షన్  లో  ఆవిష్కరించాడు.  సంధ్య  'బుజ్జి ముండ ' బావుంది  అని మురిసిపోయింది . వెంటనే  ఓ పావు గంట సేపు తొక్కి  చెమటలు కారుతూ  వచ్చి 'రెండు వందల  కాలరీలు  బర్న్  చేశాను అత్తా ' అంది సీత తో . 
'రోజూ చెయ్యి ' అంది సీత  మేనకోడలితో .  
ఇప్పుడు  మా ఇంటిలో  ఆరు సైకిళ్ళు  ఉన్నాయి . రెండు పిల్లల  సైకిళ్ళు , ఒక గేరు సైకిల్ ,మోటార్ సైకిళ్ళు రెండు ,ట్రెడ్ మిల్  సైకిల్  ఒకటి . 

... 

వర్ష ,రుషి  సైకిల్  జోరు  నిర్విరామం గా 
సాగుతోంది . 
అడపా  తడపా  సంధ్య  ట్రెడ్ మిల్ సైకిల్ తొక్కుతోంది. 
ఇంతకీ ... 
చక్కనమ్మ చిక్కలేదు . 

..................................................  

         

  

No comments: