Wednesday, 7 January 2015



శ్రీ వేంకటాచల వైభవం . 

            చివరి భాగం -07
జరిగిన కధ :వంటిమామిడి  అగ్రహారంలో  ప్రతి  ఏడాదీ మాఘమాసంలో  జరిగే  శ్రీ రాజరాజేశ్వరీ విశ్వేశ్వరస్వామి  వారల కళ్యాణ ఉత్సవాలు  తిలకించటానికి  దూర ప్రాంతాలనుండి  బంధుమిత్రులు  వంటిమామిడి చేరుకుంటారు . చంద్రుడు గారు ,   వారి భార్య యశోదమ్మ  కాలం చేసినా  ఎప్పటిలాగే  చంద్రుడు గారి  గృహమే అతిథుల  బస , సమావేశ మందిరమూ . బంధుమిత్రుల కోరిక మేరకు  వంశ  మూల పురుషులు వేంకటాచలం గారి గురించీ ,శివాలయ చరిత్ర గురించీ  వారికి  చెబుతాడు చంద్రుడు గారి అబ్బాయి . శ్రీ రాజరాజేశ్వరీ విశ్వేశ్వరస్వామి వారల కళ్యాణ ఉత్సవాలు  ఘనంగా జరుగుతాయి . ..  ఇక చదవండి . 

అతి  ప్రాచీనమైన   శివాలయం  ప్రకృతి  ఒడిదుడుకులకు  కాలవైపరీత్యాలకు  శిధిలమయ్యే  ప్రమాదం  గుర్తించిన  యర్రమిల్లి  ఐదవ  తరం  కుటుంబ సభ్యులు  ఆలయ  జీర్ణోద్దారణ  కార్యక్రమం  చేపట్టదలిచారు . దీనికి  ఆద్యులు  యర్రమిల్లి సూర్యనారాయణ మూర్తి (మూడవ తరం) గారి మనవడు యర్రమిల్లి త్రినాధ్ . త్రినాధ్ గారి ఆధ్వర్యంలో , బంధుమిత్రుల  ఆర్ధిక ,సహాయ , సహకారములతో , ఆగమశాస్త్ర పండితుల సలహా, సూచనలతో ఆలయ జీర్ణోద్ధారణ పనులు  2008 సంవత్సరంలో ప్రారంభమై  2009 వ సంవత్సరంలో  పన్నెండు లక్షల రూపాయల  వ్యయంతో  పూర్తి  చేయుట  జరిగింది . ఈ  సమయంలో నిర్మాణ పనులలో   స్థానికంగా  నివాసముంటున్న యర్రమిల్లి ప్రకాశరావు గారి  పర్యవేక్షణ , దీక్ష  ఎంతో  శ్లాఘనీయమైనవి  అని చెప్పుకోక  తప్పదు . కాలరీత్యా  అమ్మవారి విగ్రహంలోనూ మరియూ  వినాయకుడూ ,నందీశ్వరుని  శిలా ప్రతిమలలో  కొన్ని దోషాలు  ఏర్పడినందు వల్ల  వాటి  స్థానే  నూతన  శిలా విగ్రహ ప్రతిష్ట  జరిగింది . పూర్వం  పెద్దలు  ఆశించిన విధంగా  ఉత్తరం వైపున నిర్మించబడ్డ  ఉప ఆలయంలో  అమ్మవారి  నూతన  శిలావిగ్రహం  ప్రతిష్టించబడింది . వినాయకుని   నూతన విగ్రహం  అంతరాలయం  ముందు భాగంలో  ఏర్పాటు కాబడింది . నందీశ్వరుడిని   ధ్వజస్థంబం  ముందు  ప్రతిష్ట  చేయడం జరిగింది .  150 సంవత్సరాలకు  పైగా పూజలందుకొన్న  అమ్మవారు ,విఘ్నేశ్వరుడు  మరియు  నందీశ్వరుని  శిలావిగ్రహాలు  శాస్త్రోక్తంగా , ఆగమశాస్త్ర  పండితులచే  వేదమంత్రాల ఘోషతో  సాగరంలో నిమజ్జనం చేయబడినవి . 

ఈ నూతన శిలా విగ్రహాల  ప్రతిష్ట  ఉత్సవానికి  , జీర్ణోద్ధరణ  తర్వాత  ఆలయ  ప్రారభోత్సవానికీ   కొన్ని  ఆటంకాల  వల్ల  నేను  హాజరు  కావటం  కుదరలేదు . "అందుకా!  మొన్న  మాగాపు కామేశ్వరి  కల్యాణం బ్యాచీ  వేరూ ! ప్రతిష్ట  బ్యాచీ  వీరూ ! అన్నది  " అంది  చిన కృష్ణమూర్తి గారి   మహాలక్ష్మి   . 
శివాలయం  జీర్ణోద్ధరణ ,  ఉప ఆలయంలో  అమ్మవారి  నూతన  విగ్రహ  ప్రతిష్ట  జరిగి  సంవత్సర  కాలం  దాటిపోయింది .  ఉన్నట్లుగా  సముద్రతీరంలో  అలజడి. తీరంలో  ఉన్న  మత్స్యకారులకి  ఒడ్డున  నిమజ్జనం  కాబడిన  అమ్మవారి  విగ్రహం  కనపడింది . వారు  విగ్రహాన్ని   సాగర  గర్భంలో  కలిపివేశారు . మరో  రెండు రోజులకి  విగ్రహం తిరిగి  ప్రత్యక్షమైంది  ఒడ్డున . ఈ  సారి కూడా  మత్స్యకారులు  విగ్రహాన్ని నిమజ్జనం  చేసారు . మరో  వారం రోజులకు  అమ్మవారి విగ్రహం  సాగర తీరంలో మరల  ప్రత్యక్షం . ఈసారి  ఓడవాళ్ళు  భయపడిపోయారు . వారిలో  ఒకరు  విగ్రహాన్ని సముద్రం  ఒడ్డునే  నిలబెట్టి  పూజలు చేసారు . ఈ  వార్త  వంటిమామిడిలో  చిన్న గుడి  అని  పిలువబడే  శ్రీ అన్నపూర్ణా విశ్వేశ్వరస్వామి  దేవాలయాన్ని  స్వంతంగా  నిర్మించి  , నిర్వహణ  చేస్తూ , దేవతార్చనతో  కాలం  గడుపుతున్న  యర్రమిల్లి అనంతరావు కి  (ఐదవ  తరం )  చేరింది . అనంతరావు  దైవభక్తుడు . అమ్మవారిని  సదాచార  సంప్రదాయ  పద్ధతి  ప్రకారం  తీసుకొని వచ్చి తన గుడిలో  శ్రీచక్ర  ఆకారంలో  ఉపఆలయం  నిర్మించి  పునఃప్రతిష్ట  చేసాడు . ఈ  సంఘటన  2011 వ సంవత్సరంలో  జరిగినది .  మరుసటి సంవత్సరం అమ్మవారిలానే  నిమజ్జనం  చేయబడిన  నందీశ్వరుడు  సాగరం నుంచి  ఒడ్డుకు వచ్చేసాడు . అలా  తిరిగి వచ్చేసిన  నందీశ్వరుని  కూడా  అనంతరావు  తన గుడిలో పునఃప్రతిష్ట  చేయటం జరిగింది . 
సుమారు  150 సంవత్సరాలకు  పూర్వం  సాగర గర్భం  నుండి వచ్చి పూజలందుకొన్న  అమ్మవారు  సాగరంలో  కలిసిపోయి  యర్రమిల్లి వారిని  వదిలి  ఉండలేక  తిరిగి వచ్చేసింది .  అలాగే  నందీశ్వరుడు కూడా . ఇది  నమ్మలేని  నిజం. 
"ఇదండర్రా  ! మన  మూలపురుషుడు  వేంకటాచలం గారి  చరిత్ర  మన  శివాలయం  ఘనత . యర్రమిల్లి  వంశంలో  నాది  ఐదవ  తరం . మీది  ఆరవ తరం . ఇటువంటి  సద్వంశం  లో  జన్మించటం  పూర్వ  జన్మ  సుకృతం ." అని  ముగించాడు  చంద్రుడు గారి అబ్బాయి . 
" చాలా  థాంక్స్  ! పెదనాన్నా ! . తెలియని  విషయాలు  చాలా  తెలిసాయి . నీ  ద్వారా . ఇంతటి  ఘనమైన  చరిత్ర  వుందని  మా  తరం  వారికి  ఎవరికీ  తెలియదు.  ఈ  వంశంలో  జన్మించినందుకు  చాలా  గర్వం గా  ఉంది .  " అన్నాడు  పవన్  . 
మిగతా  శ్రోతలందరిదీ   అదే  భావం. 
యర్రమిల్లి  ప్రకాశరావు వచ్చి" అన్నయ్యా ! నారాయణ సేవ మొదలెట్టేసాం . భోజనానికి  రండర్రా ! " అని పిలిచాడు . "ఈరాత్రికి   తీర్థం ,  రథోత్సవం. రేపు  సముద్రం లో చక్రస్నానం  " అని ప్రకటించాడు  ప్రకాశరావు . 

                                                                                       సమాప్తం . 

 చివరాఖరిగా ..  చంద్రుడుగారి  అబ్బాయి  మాట . 
 వేదశాస్త్రాలు , వేదమంత్రాలు  గురించి  నాకు తెలిసినది  అతి  స్వల్పం. ఇంకా  చెప్పాలంటే  అసలు  ఏమీ  తెలీదు . ఈ  రచనలో  ఉదహరించిన  మంత్రాలలో  ఏమైనా  తప్పులు  ఉంటే  అది  నా  పరిమిత  పరిజ్ఞానం (లేక  అజ్ఞానం  అందామా )  తప్ప  మరియొకటి  కాదు . వాటిని  క్షమించమని  సర్వేశ్వరుని  మనస్ప్పూర్తిగా  ప్రార్ధిస్తున్నాను . 
వేంకటాచలం గారి  గురించి,   శివాలయ పూర్వ చరిత్ర  గురించీ,  చెప్పబడ్డ  విషయాలు  చాలా మట్టుకు  నా  ముందుతరం  పెద్దలు  చెప్పగా  నే  విన్నవీ , కొంత  పాశర్లపూడి  లంక  స్వయముగా  వెళ్లి  అక్కడ  ఇప్పటకీ  నివసిస్తున్న  యర్రమిల్లి  వారి నుండి  తెలుసుకొన్నవీ  , మరికొంత  జొన్నలగడ్డ వారి  వంశ  చరిత్ర  నుండి  సేకరించనవీనూ . వాటి  ఆధారంగా  ఈ  రచన  రూప కల్పన  చేయబడినది .  ఇక  దేవుని  కళ్యాణ  ఉత్సవాల  సంగతి . ఇవి  ప్రతి  సంవత్సరమూ  మేము  పొందే    అనిర్వచనీయమైన  అనుభవం . అనుభూతి . 
పాశర్లపూడి  లంక యర్రమిల్లి వంశ  ఆద్య  పురుషులు  యర్రమిల్లి రాయలు వారు . 
ఈ  రచన  చదివినవారికీ , చదివినవారి  నుండి  విన్నవారికీ శ్రీ రాజరాజేశ్వరీ విశ్వేశ్వరస్వామి వారల  కృపా  కటాక్ష  వీక్షణ  ప్రాప్తిరస్థు . 
                                                                      సర్వ మంగళాని భవంతు . 
                                                                      సర్వే జనా సుఖినో భవంతు 
ఆహ్వానం : రాబోయే  మాఘమాసంలో  అనగా  2015  జనవరి నెల 30 వ తారీఖు  నుండి  ఫిబ్రవరి 3 వ తారీఖు  వరకు  వంటిమామిడి లో  జరిగే  శ్రీ రాజరాజేశ్వరీ విశ్వేశ్వరస్వామి  వారల  కళ్యాణ  ఉత్సవాలకు  మీరందరూ  ఆహ్వానితులే .    
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------             



                  

4 comments:

Unknown said...


వేంకటాచల. వైభవం మూడో భాగము నుంచి బాగుంది .చాగంటి వారి ప్రవచనాలు గుర్తుకు వస్తున్నై .

Unknown said...

చాలా బాగుంది. ప్రతీ వంశంవారు, కుటుంబంవారు తమతమ వంశస్థుల చరిత్ర తెలుసుకొని కనీసం లిఖితం చేస్తే తమ క్రింది తరాలవారికి ఎంతో మేలుచేసినవారవుతారు. పోడూరి గోపాల రావు.

rajuys said...

Thank you Jagatpatigaru.

Unknown said...

Annayya, Your attempt to spread Yerramilli vamsa charitra is simply superb.Had you not made this attempt we would have been in dark. Thanks for sharing. Look forward to hearing much more from you. Thanks again.
Y Venkata Chalam 5th Generation.