Tuesday, 6 January 2015




శ్రీ వేంకటాచల వైభవం . 

                    షష్టమ భాగం -06
జరిగిన కధ :పాశర్లపూడి లంకలో పూర్వార్జితం  భూమిని  సర్కారు వారు భూసేకరణ చేయటంతో పరిహారం  అందుకొన్న వేంకటాచలం దంపతులు కాశీ యాత్రకు బయలుదేరుతారు . దారిలో  పిఠాపురం సంస్థానం లోని కోన ప్రాంతంలోని సముద్రతీర గ్రామంలో  మజిలీ చేస్తారు . వేంకటాచలం గారి  వేద విద్వత్తుకు  ఎంతగానో  ప్రభావితులు అయిన   పిఠాపురం  మహారాజా వారు  వేల ఎకరాల భూమిని  ఈనాం , జిరాయితీ  పట్టాలు గా  వ్రాశి  బహుకరిస్తారు. వేంకటాచలం గారు  మజిలీ చేశిన  గ్రామమే  వంటిమామిడి . ఆ గ్రామం లో స్థిరపడిన  వేంకటాచలం గారికి  భగవంతుని సూచన మేరకు  శ్రీ రాజరాజేశ్వరీ విశ్వేశ్వర స్వామి వారల  విగ్రహ రూపాలు  లభ్యమవుతాయి . ఇసుక మేటల  క్రింద  బయటపడిన శివాలయాన్ని జీర్ణోద్ధరణ  కావిస్తారు . జీర్ణోద్ధరణ కాబడిన  ఆలయంలో నిత్య దీప ,ధూప ,నైవేద్యాలు  1854 వ సంవత్సరంనుండి  ప్రారంభిస్తారు వేంకటాచలం . 
వంటిమామిడి అగ్రహారంలో మాఘమాసంలో జరిగే  శ్రీ రాజరాజేశ్వరీ విశ్వేశ్వరస్వామి వారల కళ్యాణ ఉత్సవాలు ఆడంబరంగా ప్రారంభమవుతాయి . మొదటి రోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన  వైభవంగా ముగుస్తుంది . తెల్లవారితే  కల్యాణం . .... ఇక చదవండి . 


వంటిమామిడి  అగ్రహారం . తెల్లవారితే  శ్రీ రాజరాజేశ్వరీ విశ్వేశ్వరస్వామి వారల కళ్యాణ మహోత్సవం .ముందుగా  గ్రామంలో   ఉత్సవమూర్తుల  ఊరేగింపు .  యర్రమిల్లి  ప్రకాశరావుగారి  కుమారుడు  విశ్వేశ్వరరావు  వచ్చి "ఊరేగింపు  ప్రారంభం అయింది . దేవుడు  వస్తున్నాడు  పెదనాన్నగారూ !" అన్నాడు . " ఊరేగింపు  చూద్దామర్రా ! " అన్నాడు  చంద్రుడుగారి అబ్బాయి  శ్రోతలందరితో .


అందరూ  లేచి బయటకు  వచ్చారు . ఊరేగింపుకు  ముందు  తోటపెద్దుల్ని (ఆంబోతులు) నందీశ్వరునిలా  అలంకరించి  తప్పెట్లతో  తీసుకొని  వెడుతున్నారు  ప్రజలు . అవి  గంభీరంగా  అడుగులు  వేస్తూ  వెడుతున్నాయి . వాటి  వెనక  గ్రామ ప్రజల  మేళతాళాలు , విన్యాసాలు .  
 నంది వాహనం  మీద  పల్లకీ . పల్లకీలో  అలంకరించిన  ఉత్సవమూర్తులు .
తాటిఆకుల పాలెం  బుల్లిఅబ్బాయి  తన  బృందంతో   పల్లకీ  వెనకాల జనరేటర్  తీసుకొని  వస్తున్నాడు . పల్లకీలో  విద్యుత్ కాంతులు . 
చాకలి  సూర్రావు  బృందం  పల్లకీ  మోస్తున్నారు . మంగలి  ఫైడయ్య  బృందం  డోలు  వాయిస్తున్నారు . తాతబ్బాయి  సన్నాయి   బృందం  పల్లకీ  ఎదరగా  నిల్చొని  మంగళ వాయిద్యాలు  పలికిస్తున్నారు  శ్రావ్యంగా . గోపాలం  ప్రతీ  ఇంటి  దగ్గర  పల్లకీ  నిలుపుచేసి  ఉత్సవమూర్తులకి  భక్తులు  ఇచ్చిన  కానుకలు  స్వీకరించి  పాదుకలు  ఇస్తున్నాడు . దారి అంతా  విద్యుత్ దీపాల  అలంకరణ . ఆ వెలుగులో  ఉత్సవమూర్తుల  దర్శనం  అనిర్వచనీయంగా  ఉంది . అలా  సాగింది  గ్రామమంతా 
ఊరేగింపు .  
 కల్యాణం తిలకించేందుకు  పై  ఊర్ల  నుండి  వచ్చిన  బంధుమిత్రులు,  జనం,  శివాలయం చేరుకున్నారు.   ఆలయ మంటపంలో  బల్ల  వేశి  బల్ల మీద అలంకరించిన  సింహాసనంలో   ఉత్సవమూర్తులను  శోభాయమానంగా  అలంకరించి  ఉంచాడు  పూజారి  గోపాలం . కల్యాణం  చేయించటానికి  తణుకు నుండి  వచ్చిన  బ్రహ్మశ్రీ  సుందరరామం గారు  సంబారాలన్నీ  సరి చూసుకుంటున్నారు . కల్యాణం  తంతు  మొదలయ్యింది . వేదమంత్రాలతో  కల్యాణం  జరుగుతోంది . సన్నాయి మేళం  తాతబ్బాయి  బ్రహ్మ గారు  సూచన  చేసినప్పుడల్లా  సన్నాయి  పలికిస్తున్నాడు . సహచరులు  మృదంగం , మద్దెల    వాయిస్తున్నారు . 
ఒకవైపు  కళ్యాణ  మంత్రాలు  మరో వైపు  సన్నాయి  మేళతాళాలు . వీటితో  గుడి  ప్రాంగణం  మారుమ్రోగిపోతోంది . గర్భగుడిలో  స్వామివారు ,అమ్మవారు  అలంకృతులై  ఉన్నారు .  శుభఘడియలు  దగ్గర పడ్డాయి . " మాంగల్యం తంతునా ....." పూర్తి  అయింది . తలంబ్రాల  వేడుక మొదలయ్యింది . బ్రహ్మ గారు , పూజారి గోపాలం  ఈ  వేడుక  నిర్విహిస్తున్నారు . ఉత్సవమూర్తుల  మీద  పడుతున్న  తలంబ్రాలు  విద్యుత్  కాంతులలో  ముత్యాల వాన  కురుస్తున్నట్లుగా  ఉంది . స్వామివారు "చూశావా  దేవీ ! నా  వైభవం "  అని  గర్వంగా  చూశినట్లుగా ఉంది . అమ్మవారు  ఆ  చూపుకి  సిగ్గులమొగ్గ  అయి  మెడలో  తాళిబొట్టు  సవరించుకున్నట్లుగా  ఉంది  దృశ్యం . కన్నుల పండగగా ,కమనీయంగా  కళ్యాణ  ఘట్టం  ముగిసింది  . మంత్రంపుష్పం  అయిన  తర్వాత  తీర్థ ప్రసాదాలు  తీసుకొని  ఇంటి  దారి  పట్టారు  భక్తులు  అందరూ . 
                                                              ....  
 కళ్యాణ  ఉత్సవం  మూడవ రోజు . స్వామివారికి  మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం ,లక్షపత్రి బిల్వార్చన . అందరూ  సమయానికి  రావాలని  ముందురోజే  చెప్పాడు గోపాలం . ధ్యానమ్ , సంకల్పం ,మహాన్యాసం , అయిన తర్వాత  ఏకాదశ రుద్రాభిషేకం  మొదలయింది . వేద పండితులు  రుద్ర  నమకమ్  పారాయణ చేస్తూ ఉండగా  గర్భగుడిలో  స్వామి వారికి  అభిషేకాలు  జరుగుతున్నాయి . 
ఓం  నమో  భగవతే రుద్రాయ ! 
నమస్తే  రుద్ర  మన్యవ  ఉతోత  ఇషవే  నమః 
నమస్తే  అస్తు  ధన్వనే  బాహుభ్యాముత  తే  నమః 
యా  త  ఇషుశ్శివతమా  శివం  బభూవ  తే  ....... 
వేదమంత్రాలు  శివాలయం  అంతటా  ప్రతిధ్వనిస్తున్నాయి . ఏకాదశ  రుద్రాభిషేకం  ముగిసిన  తర్వాత  లక్షపత్రి  బిల్వార్చన  పూర్తి  అయేసరికి  సాయింత్రం  నాలుగు  గంటలు  దాటిపోయింది . మంత్రపుష్పం తర్వాత  భక్తులందరికీ  తీర్థ ప్రసాదాలు ఇచ్చారు . తాతబ్బాయి  బృందం  మృదంగం  పై  పరమశివునికి  అత్యంత  ప్రీతికరమైన  లయ విన్యాసం  అద్భుతంగా  వినిపించారు . బిల్వార్చన  తర్వాత  పరమశివుని  అలంకరించాడు  గోపాలం  . 
మంటపంలో  ఉన్న కళ్యాణ మూర్తులను తెచ్చి  గర్భగుడి  లో  అమర్చాడు . బిల్వపత్రితో  అలంకరింపబడిన  శ్రీవిశ్వేశ్వరస్వామి  మనోహరంగా  కన్పిస్తున్నాడు . గర్భగుడి  అంతటా  మారేడు  దళ  పరిమళం . చాలా  ఆహ్లాదంగా  ఉంది  సుగంధ  ద్రవ్య  పత్రి  పరిమళాలతో  పరిసరం .  
                                                           ... 
శివాలయం  నుండి  వచ్చిన తర్వాత  అందరూ  సమావేశం  అయ్యారు  చంద్రుడు గారి ఇంట్లో .  మరల  చెప్పడం  మొదలుపెట్టాడు  చంద్రుడు గారి  అబ్బాయి . 
                                                           ... 
తర్వాత  కాలంలో  వేంకటాచలం  దంపతులకు  సంతాన  భాగ్యం  కలిగింది . అయదుగురు   కుమారులు  ఒక  కుమార్తె . కుమారులు  1. సీతారామస్వామి 2. కనకాచలం  3. వేంకట కృష్ణమ్మ  4 . రామచంద్రుడు  5. లక్ష్మీనరసింహం కుమార్తె  సావిత్రమ్మ .  సోదరులలో  జ్యేష్టులైన  సీతారామస్వామి గారు  తండ్రి గారి  వద్ద  వేదశాస్త్ర  పురాణాలు  అభ్యసించి  ధర్మశాస్త్ర వేత్తలుగా  పేరు  గడించారు . వీరి  బాటలోనే  ద్వితీయులైన  కనకాచలం గారు కూడా  సదాచార  సంపన్నులై  అన్నగారిని  అనుసరించే వారు .  వేంకట కృష్ణమ్మ గారు  దాన ధర్మాలు  చేస్తూ  జీవితాన్ని  సఫలం  చేసుకున్నారు .  ఇక  రామచంద్రుడు గారు  కర్షక చక్రవర్తి . వీరు   కుటుంబానికి  చెందిన  వేల  ఎకరములను  సేద్యము  చేయిస్తూ  పర్యవేక్షణ  చేసే వారు. ఆఖరి  కుమారులైన  లక్ష్మీ నరసింహం గారు  బ్రాహ్మణ కుటుంబాలకు  చెందిన బ్రహ్మచారులకు గాయత్రి ఉపదేశించేవారు . కుమార్తె  సావిత్రమ్మను వంటిమామిడికి  ఆరు మైళ్ళు  ఉత్తరంగా  ఉన్న  హంసవరం  గ్రామ  కాపురస్తులు జొన్నలగడ్డ  జోగిరాజు  గారికి  ఇచ్చి  వివాహం  జరిపించారు . 
కుమారులు  చేతికి  అంది  వచ్చిన తర్వాత  వేంకటాచలం  గారు  వారికి  భాద్యతలు  అప్పజెప్పి  విశ్రాంతి  తీసుకున్నారు . ఉమ్మడి  కుటుంబం . అన్నదమ్ములు  అందరూ  కలిసి  బహు  ధర్మ కార్యాలు  చేశారు . అప్పట్లో  కోన ప్రాంతమంతా  దట్టని  అడివి . చుట్టుపక్కల  పల్లెలకి  సరిఅయిన  దారి  ఉండేది  కాదు . బాటసారుల  అవసరార్థం  వీరు ఎన్నో  సత్రములు , చెరువులు  నిర్మించారు . బావులు  తవ్వించారు . ఆ  రోజుల్లో  వంటిమామిడి  అంటే  యర్రమిల్లి  వారి  స్వగృహమనీ  , హంసవరం  అంటే  జొన్నలగడ్డ  వారి  స్వగృహమనీ  ప్రచారంలో  ఉండేది . వీరి  కీర్తి ,  ప్రాభవం ,  పలుకుబడి  పరిసర  గ్రామాల్లో  కూడా  చెప్పుకొనేవారు . వంటిమామిడి లోని  యర్రమిల్లి వారు  ,  హంసవరం లోని  జొన్నలగడ్డ వారు ,  తొండంగి  వంగూరి వారు, తుని  వడ్డాది వారు  పిఠాపురం  సంస్థానం (జమిందారీ ) లోని  నియోగి  ప్రముఖులు.  
                                                            ... 
1854 వ  సంవత్సరం నుండీ  యర్రమిల్లి  వేంకటాచలం  గారు  ఆలయ  వ్యవస్థాపక  ధర్మకర్త గా  వ్యవహరించారు . ఆయన  తర్వాత  యర్రమిల్లి  కుటుంబ  సభ్యులలో  జీవించిఉన్న  పెద్దలు  అయినవారు  వంశపారంపర  ధర్మకర్తగా  వ్యవహరించి  సంప్రదాయ  ఒరవడిని  సాగించారు .  1854  సంవత్సరము  నుండి  శ్రీ రాజరాజేశ్వరీ విశ్వేశ్వరస్వామి  వారి  ఆలయంలో  నిత్య దీప ,ధూప, నైవేద్య పూజలు, ప్రతి సంవత్సరం  మాఘమాసంలో  స్వామి వారి కల్యాణం , వసంత నవ రాత్రులు  ,శారద నవ రాత్రుల  కుంకుమ పూజలు , కార్తీక మాసంలో అభిషేకములు , మహా శివరాత్రి తదితర  పండగలలో  ఉత్సవములూ  నిరాటంకముగా  జరుగుతున్నాయి . పూర్వం  విశేష  పండుగల  సమయంలో  పురాణ పండితులు  సోదరులు  అయిన  యర్రమిల్లి బాలకృష్ణమూర్తిగారు ,వాసుదేవుడుగారు  మరియు  మల్లపరాజుగారు  పురాణ ప్రవచనాలు  చెప్పేవారు . ఈ  ప్రవచనాలు  ప్రజలని  విశేషంగా  ఆకర్షించేవి . 
                                                           ... 
ఆలయ అభివృద్ధి  మూడవ తరం వంశీయుల  కాలంలో (1942-1944 ) జరిగింది . ఆ తరానికి  చెందిన  యర్రమిల్లి సుబ్బారాయుడు గారు  మిక్కిలి  శ్రమకోర్చి  ఆలయ  మంటపం ,ఆలయ శిఖరం ,తూర్పున ముఖద్వారం  నిర్మించారు . ద్రవ్య  లోటు  వలన  తూర్పున  గాలి గోపురం  నిర్మించుట  జరగలేదు . ఇప్పటికీ  అలాగే ఉంది . ఆ రోజుల్లోనే  గర్భగుడి  ఇరువైపులా  ఉప ఆలయాలు  నిర్మించబడ్డాయి . ఉత్తరం వైపు  నిర్మింపబడ్డ  ఉప ఆలయంలో  శ్రీచక్రం పైన  అమ్మవారిని  ప్రతిష్ట  చేయాలన్న  పెద్దల  కోరిక  ఫలించలేదు .  ధ్వజస్తంభం 1965 వ  సంవత్సరములో  మా తండ్రి గారు  యర్రమిల్లి రామచంద్రరావు (చంద్రుడు)గారి ఆధ్వర్యంలో  యర్రమిల్లి ప్రకాశరావు గారి   పర్యవేక్షణ లో  పునః ప్రతిష్ట  కావించబడింది . ఆ  సమయం లోనే  ఆలయ ప్రహారీ   నిర్మాణం  జరిగింది . దక్షిణం గా ఉన్న  ఉప ఆలయంలో  యర్రమిల్లి వారి ఆడపడుచు (సూర్యకాంతమ్మ -మూడవ తరం ) భర్త  మాగాపు రామచంద్రరావు గారు  మరియు  వారి  కుటుంబ సభ్యులు చే  1972 వ సంవత్సరంలో  సుబ్రహ్మణ్య   ప్రతిష్ట  జరిగినది . 1854 వ సంవత్సరం నుండి  2002 వ సంవత్సరం వరకు  యర్రమిల్లి  వంశస్తులు  వంశపారంపర  ధర్మకర్త గా  వ్యవహరించడం  జరిగింది . ఆ తర్వాత  ఆలయ  నిర్వహణ  ప్రభుత్వం వారి  ఎండోమెంట్ శాఖ  ఆధీనంలోకి  వెళిపోయింది . 
(ఇంకా ఉంది . తరువాయి త్వరలో ప్రచురణ అయ్యే చివరి భాగం లో చదవండి .)
______________________________________________________________________________________________________







4 comments:

ahambrahmos said...

జగత్‍పతీ
నువ్వు వ్రాస్తున్న యీ "శ్రీ వెంకటాచల వైభవం" చదువుతుంటే నాకు యింకో అద్భుతమైన సీరియల్ రచన గుర్తుకి వచ్చింది - అదే "స్వాతి" లో పీవీఆర్‍కే ప్రసాద్ గారు రచించిన తిరుమలేశుడి కధనాలు. నియ్యోగులందరికీ ఒక్కొక్క దేవాలయం చూసుకోమని భగవంతుడేప్పుడో చెప్పినట్టు ధర్మకర్తలుగా వారు ఆ దేవాలయాలని నడిపిన తీరూ ప్రజలకు హితంగా జరిపించిన కళ్యాణాలూ, దైనందిన పూజలూ, ప్రసాదాలూ, అన్నదానాలూ ఊరి ప్రజలని ఆకట్టుకునేవి. యెర్రమిల్లి వంశస్థులకే కాకుండా ప్రతి ఆదర్శ కుటుంబానికీ, "Future Generations"కీ మన సాంప్రదాయాలూ, మన పూర్వీకుల "Memoirs" అందిస్తున్న నీ రచనలు అమోఘం. కర్మ సిధ్ధాంతాలంటే పరమాత్మకి సేవలందించడమే కాకుండా జనప్రియమైన సేవలందించటం మనకున్న పిడికెడు బియ్యమైనా యింకొకరితో షేర్ చేసుకోవడంలో వుండే ఆనందాన్నికూడా నువ్వు నీ రచనలలో విశదీకరిస్తున్నావు. నిజంగా "Hats-Off-to-Jagatpati".

Unknown said...

Very interesting

Unknown said...

It is really interesting to know the history of an ancient temple through a legal heir of its founder. Simply superb.

rajuys said...

Jagatpatigaru, we are obliged to you for sparing the time to pen this inspiring story.