శ్రీ వేంకటాచల వైభవం .
చతుర్థ భాగం -04
జరిగిన కధ : వంటిమామిడి అగ్రహారంకి చెందిన యర్రమిల్లి వంశస్తుల మూల పురుషులు వేంకటాచలం గారి స్వస్థలం కోనసీమ ప్రాంతంలోని పాశర్లపూడి లంక . మాఘమాసంలో వంటిమామిడిలో జరిగే దేవుని కళ్యాణానికి వచ్చిన బంధు మిత్రులకు వెంకటాచలంగారి గురించీ, శివాలయ చరిత్ర గురించీ వారి కోరిక మేరకు చెప్పడం మొదలెడతాడు చంద్రుడుగారి అబ్బాయి. వేంకటాచలంగారు ఇంట్లో క్రతువు కార్యక్రమం ముగించి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వారికి చెందిన భూమి సర్కారు వారు గోదావరి మీద ఆనకట్ట నిర్మాణానికి అవసరమై స్వాధీన పరచుకున్నట్లుగా తాఖీదు అందుతుంది .
వంటిమామిడి అగ్రహారంలో శివాలయంలోని దేవుని కళ్యాణ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి . మొదటిరోజు అమ్మవారి కి లక్ష కుంకుమార్చన దిగ్విజయంగా ముగుస్తుంది .
ఆ తర్వాత ........ ఇక చదవండి .
పరిహారం క్రింద సర్కారు వారు ఇచ్చిన సొమ్ములు కేసి నిర్వికారంగా చూశారు వేంకటాచలం . శ్రీ వేంకటాచలం దంపతులకి చాలా రోజుల నుండీ కాశీ క్షేత్రం వెళ్లి శ్రీ అన్నపూర్ణా విశ్వేశ్వర స్వామి వారల దర్శనం చేసుకుందామన్న కోరిక ఉండేది . అయితే అది ఇంతవరకూ సాధ్యపడలేదు . పాశర్లపూడి లంకలో సెంటు భూమి కూడా మిగల్చకుండా సర్కారు వారు తీసుకున్నారు . అప్పటికి వేంకటాచలం దంపతులకు సంతానం కలగ లేదు.
ఇక్కడ ఉండి చేసేదేముంది? ఇప్పుడు చేతిలో రొక్కం ఉంది . కాశీ యాత్రకు సుముహూర్తం నిర్ణయించుకొని దాయాదుల నుండి శెలవు తీసుకొని బయలు దేరారు దంపతులు . ఆ రోజుల్లో కాశీ యాత్ర అంటే మాటలు కాదు . ఎంతో శ్రమతో కూడిన కాలినడక ప్రయాణం . తీరం వెంబడి బాట .
పాశర్లపూడిలో మొదలైన యాత్ర మజిలీలు చేసుకుంటూ గోదావరి జిల్లా కోనప్రాంతం లో
సముద్రతీర గ్రామం చేరుకుంది . డస్సి పోయిన వేంకటాచలం దంపతులు ఆ గ్రామం మొగలో మజిలీ చేద్దామని ఆగటం జరిగింది . గ్రామ కంఠం మొగలో ఒక్కటే ఒక్క మామిడి వృక్షం . మామిడిచెట్టు కొమ్మలు విశాలంగా విస్తరించి చల్లటి నీడ పరుస్తున్నాయి . దరి దాపుల్లో తాడి చెట్లు మినహా ఏ విధమైన జాతి వృక్షాలు లేవు . సముద్రతీరం అవటం వల్ల చుట్టూ ఎత్తయిన ఇసుక దిబ్బలు . తెల్లటి ఇసుక రేణువులు ఎండలో వజ్రపు తునకల్లా తళుక్కుమంటున్నాయి . జలనిధి నుండి తీరానికి కొట్టుకొని వచ్చిన అబ్రకం చిప్పలు మెరుపు తీగల్లా మెరుస్తున్నాయి సూర్య కిరణాలు పడి .
"ఇక్కడే మన మజిలీ బస " అని ధర్మపత్నికి సూచించి మామిడిచెట్టు నీడలో కూడా తీసుకుని వచ్చిన సరంజామా అంతా సర్దుకున్నారు వేంకటాచలం . ఎన్నాళ్ళు ఇక్కడ మన మజిలీ అన్నట్లు ప్రశ్నార్ధకంగా చూసింది భార్య . "మండలం రోజులు" అని జవాబిచ్చారు వేంకటాచలం . ఆ ప్రాంతమంతా పిఠాపురం మహారాజా వారి సంస్థానమునకు చెందినది . పిఠాపురం మహారాజా వారు చక్కటి పరిపాలనా దక్షత గల ప్రభువు . సంస్థానంలోని ప్రజల పట్ల ధర్మనిబద్ధతతో పరిపాలన చేసేవారు . వేద పురాణాల యందు మిక్కిలి ఆసక్తి . మహారాజా వారు తన ఏలుబడిలో ఎట్టి అక్రమము గాని, అన్యాయము గాని సహించేవారు కాదు . లెక్కలేనన్ని ధర్మకార్యాలు చేశారు . అట్టి ప్రభువు పాలనలో ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండేది . ప్రజలు హాయిగా జీవిస్తూ ఉండేవారు .
గ్రీష్మఋతువు . సూర్యభగవానుడు ఉదయాన్నే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు . ప్రాతఃకాలముననే ఈశాన్య దిశగా ఉన్న చెర్వు లోని నిర్మల జలములొ స్నానమాచరించి నిత్య పూజా కార్యక్రమానికి సిద్ధమయ్యారు వేంకటాచలం గారు . ఆయన భార్య మడి వంట ప్రారంభించటానికి ఉద్యుక్తురాలు అయింది . నిత్య పూజా కార్యక్రమం లో నిమగ్నం అయిపోయారు వేంకటాచలం . ఆయన దృష్టి ,ధ్యాస దేవతార్చన మీద తప్ప పరిసరాల మీద లేదు . వంట చేసుకుంటున్న వెంకటాచలం గారి భార్య దబ్బున ఫై నుండి ఏదో క్రింద పడిన శబ్దానికి వెనక్కి తిరిగి చూసింది . నేల మీద బంగారు రంగులో అతి పెద్ద మామిడిపండు . ఆమె అంత పెద్ద మామిడిపండు మునుపెన్నడూ చూశిఉండలేదు . "ఏమండీ ! చూశారా ! ఎంత పెద్ద మామిడిపండో ! " అంది భర్తను ఉద్దేశించి . ధ్యానంలో ఉన్న వేంకటాచలం గారు " ముక్కలు చేశి భోజనంలో వడ్డించు ." అన్నారు . వెంకటాచలం గారి పూజ ధ్యానం ముగిసేసరికి అపరాహ్నం దాటింది . భోజనాల వేళ అయింది . భోజనాలు చేశారు దంపతులిద్దరూ . ఇదంతా దూరంగా ఇసుక దిబ్బ మీద కూర్చొని చుట్ట కాల్చుకుంటున్న బొట్టా పోలీసు కంట పడింది . బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న వేంకటాచలం గారిని అడగటానికి ధైర్యం చాల లేదు . దివాను గారు వచ్చినప్పుడు విషయం చెబుదాంలే అని ఊరుకున్నాడు . నాలుగు రోజులు పోయాక పిఠాపురం రాజా వారి దివాను గారు సంస్థానంలోని క్షేత్ర పరిశీలనకు రావటం జరిగింది . దివాను గారిని దూరం నుండి చూశిన బొట్టా పోలీసు " దండాలు బాబయ్యా " అన్నాడు . తప్పు జరిగిపోయింది బాబయ్యా అన్నాడు మళ్ళీ వెంటనే . అది విన్న దివాను గారు కంగారు పడ్డారు . ఏమి జరిగింది అన్నారు దివాను . మన గ్రామ కంఠం మొగలో ఉన్న మామిడిచెట్టు చాలా విశేషమైనది కదూ ! బాబయ్యా అన్నాడు బొట్టా పోలీసు .
అవును అన్నారు దివాను . దానికి ఏడాదికి రెండే పళ్ళు కాస్తాయి కదా అయ్యా ! . అవును. దానికి కాపలాదారుడిగా నన్ను నియమించారు కదా బాబయ్యా ! . అవును . వాటిని కావిట్లో గంపల కెత్తుకొని రాజా వారి దివాణం లో నేను అప్పచెప్పాలి కదా బాబయ్యా ! . అవును . విషయం చెప్పరా! నసకక అన్నారు దివాను గారు విసుగెత్తి . తప్పు జరిగిపోయింది బాబయ్యా ! అన్నాడు మళ్ళీ బొట్టా పోలీసు . ఆ చెట్టు క్రింద జపం చేసుకుంటున్న బ్రాహ్మల్ని చూశారు కదా . వారు ఆరగించేసారండి అని అసలు విషయం చెప్పాడు బొట్టా పోలీసు దివాను గారికి . బొట్టా పోలీసు చెప్పిన విషయం మొదట దివాను గారికి అర్థం కాలేదు . అర్థం అయిన తర్వాత దివాను గారి గుండెలు జారి పోయాయి . రాజా వారికి ఆ మామిడి పండ్లంటే ప్రీతి . రాజా వారు పండ్ల గురించి అడిగితే ఏమి సమాధానం చెప్పాలి? అని ఆందోళనలో పడిపోయారు దివాను గారు. విషయం అడిగి తెలుసుకుందామని వేంకటాచలం గారిని ప్రశ్నించారు దివాను గారు .
"కాశీ యాత్రకు వెళుతూ దారిలో మజిలీ చేసిన బ్రాహ్మడు భుజించాడని చెప్పండి రాజా వారితో " అని గంభీరంగా జవాబిచ్చారు వేంకటాచలం . ఆయన తేజస్సు ఆజానుబాహువు లాంటి విగ్రహం చూసిన దివాను గారికి మరింత వివరం అడగటానికి ధైర్యం చాలలేదు.
దివానుగారు అనుకున్నంతా అయింది . మామిడిపండ్లు దివాణం ఇంకా ఎందుకు చేరలేదని రాజా వారు అడిగారు దివాను గారిని . జరిగిన విషయం చెప్పగానే "ఎంత పొగరు ! ఆ బ్రాహ్మణునికి . నేనే స్వయంగా ప్రశ్నిస్తాను . సవారీకి పల్లకీ సిద్ధం చేయండి " అని అజ్ఞాపించారు రాజా వారు . మర్నాడు ఉదయం దివాను గారితో కలిశి గమ్యస్థానం చేరుకున్నారు రాజా వారు . అక్కడి దృశ్యం చూసిన రాజా వారి నోట మాట రాలేదు . ఇదీ ఆ దృశ్యం .
మామిడిచెట్టు క్రింద తూర్పు అభిముఖంగా ఆశీనులయి ఉన్నారు వేంకటాచలం గారు . భార్య ఆయన వామ హస్తం వైపున ధ్యాన ముద్రలో కూర్చొని ఉంది . వెంకటాచలం గారి కంఠం నుండి గంభీరంగా ....
"రుద్రం ,నమకం ,చమకం" వేద మంత్రాలు అనర్గళంగా ఉచ్చరించబడుతున్నాయి . సాక్షాత్తూ పరమశివుడే పారాయణం చేస్తున్నట్లు అనుభూతి . చుట్టుప్రక్కల పొలాల్లో ఆలమందలు వేంకటాచలం గారి దరి చేరి మోరలు పైకి ఎత్తి ఆకాశం వైపు చూస్తున్నాయి . పక్షులు కిలకిలారావాలు మాని నిశ్చలంగా చెట్ల మీద నిలబడిపోయాయి . గాలి స్థంభించిపోయింది . సముద్రపు హోరు ఆగిపోయింది . వేంకటాచలం గారి నోటివెంట వెలువడుతున్న వేదమంత్రాలు నలుదిక్కులా వెళ్లి ప్రతిధ్వనిస్తున్నాయి . ప్రకృతి నిలిచిపోయింది . అలా ఎంత కాలం గడిచిపోయిందో తెలియలేదు . కాస్సేపటికి వేద మంత్రోచ్చారణ ముగిసింది . ప్రకృతి గాడిలో పడిపోయింది .
ఈ దృశ్యం చూశిన రాజా వారు తన్మయత్వంతో పల్లకీ దిగి వేంకటాచలం గారి వద్దకు వచ్చి ...
"మహానుభావులు .
వేద బ్రహ్మ .
దైవ స్వరూపులు " అని కొనియాడుతూ గౌరవంగా అభివందనలు తెలిపారు . వేంకటాచలం గారితో కాస్సేపు ముచ్చటించిన రాజా వారికి వేంకటాచలం గారి కాశీ యాత్ర విషయం తెలిసింది . మీ వంటి వేద పండితులు కాలి నడకన కాశీ యాత్ర ఏమిటి ? మిమ్మల్ని పల్లకీ లో పంపించి కాశీ క్షేత్ర దర్శనం చేయిస్తాను అన్నారు రాజా వారు . రెండు రోజుల్లో మా దివాణం లో సంస్థానం తరపున వేదపరిషత్తు జరగబోతోంది . తమరు ఆ సభకు ముఖ్య అతిథిగా వ్యవహరించి జయప్రదం చేయమని అర్థిస్తున్నాను . నా అభ్యర్ధన కాదనకండి అన్నారు రాజా వారు వేంకటాచలం గారితో . రాజా వారి కోరిక అంగీకరించేందుకు వేంకటాచలం గారు సుముఖంగా లేరు. కాశీ యాత్ర జాప్యం అవుతుంది అన్న భావనతో . భార్య వైపు చూసారు "ఏమంటావు " అన్నట్లుగా . ఆవిడ "అంగీకరించండి " అన్నట్లుగా కళ్ళతో సూచించింది . " సరే " అన్నారు వేంకటాచలం . రాజా వారు సంతోషించి "పంతులుగారిని కూడా ఉండి పల్లకీ లో పిఠాపురం తీసుకొని రండి " అని దివాను గారికి ఆజ్ఞ జారీ చేసి తిరుగు ప్రయాణమయ్యారు .
...
పోలీసు సుబ్బారావు గారి శ్రీను :అందుకా ! మన ఊరి పేరు వంటిమామిడి చిన్నాన్నా ! " అన్నాడు మధ్యలో కలుగచేసుకొని . "అవునురా ! " అని జవాబిచ్చాడు చంద్రుడు గారి అబ్బాయి .
...
(ఇంకా ఉంది . పంచమ భాగం కోసం వచ్చే వేచి చూడండి .)
x
1 comment:
Like the style of storytelling very much-you have quite captured our interest and we are eager to know where all this leads to.
Post a Comment