Javvai Musings.
మనం మనం బరంపురం.
Series ( 02)
***********************************
*
బరంపురం స్టేషన్ నుంచి బయటకు వచ్చి నాలుగు అడుగులు వేస్తే ఎదర ఉన్నవ వారి బంగళా. బ్రిటిష్ వారి హయాం లో ఉన్నవ రామలింగం గారు కాంట్రాక్టర్ గా ప్ర సిద్ధులు. ఆయన కి రావు బహదూర్ బిరుదు ప్రదానం చేశారు. తన నివాసం కోసం అప్పట్లో రావు బహదూర్ గారు నిర్మించు కున్న విలాస వంత మైన నిర్మాణం ఈ బంగళా. పూర్తిగా రాతి కట్టడం. అటువంటి రాతి తో కట్టబడిన భవంతి బరంపురం లో నాకు తెలిసి బహుశా అది ఒక్కటే. రామలింగంగారు అప్పటి మద్రాసు ప్రసిడెన్సీ లో ఉన్న చాలా నగరాల్లో చాలా భవనాలు కాంట్రాక్టర్ గా నిర్మాణం చేశారు. కాకినాడ లోని మునిసిపల్ కార్యాలయం వాటిలో ఒకటి . కాకినాడ పట్టణం కార్పొరేషన్ గా మారినా ఇప్పటి కీ కార్పొరేషన్ ఆఫీస్ అందు లోనే పని చేస్తోంది . ఉన్నవ వారి బంగళా గేట్ పక్కన ఇరువైపులా W.V.V. Ramalingam ,Contractor అని పేరు పాలరాతి పలక మీద ఒకవైపు తెలుగు లోను ఇంకొక వైపు ఇంగ్లీష్ లోను వ్రాసి ఉండేది. ఆ బంగాళా లో నాకు తెలిసి రామలింగం గారి కుమారులు సింహం గారు , శంకరం గారు నివసిస్తూ ఉండేవారు.
సింహంగారు ముందు భాగంలోనూ , శంకరం గారు వెనుక భాగం లోనూ ఉండేవారు . సింహం గారు మల్లెపూవు లాంటి తెల్లని దుస్తులు ధరించేవారు. డబ్బపండు లాంటి శరీర ఛాయ. కంటి మెడ జుబ్బా, లుంగీ ఆయన ఆహార్యం. గంభీరమైన ఆకారం. సింహంగారి కుమారుడు నాగు ( నాగేశ్వరరావు ) నా సహ విద్యార్థి మరియు మిత్రుడు.ఇకపోతే శంకరం గారు, అన్నగారికి పూర్తిగా విరుద్ధం . శంంకరం గారిని శంకరం పంతులు అని పిలిచేవారు . కలుపుగోరు మనస్తత్వం. భోళా మనిషి. ఖద్దరు చొక్కా ,పంచె ఆయన ఆహార్యం. స్టేషన్ లో ప్రతి రోజూ పాస్సెంజర్ , మెయిల్ / ఎక్స్ప్రెస్ రైళ్లు వచ్చే టైముకి ఆయన తప్పక హాజరు కావలసిందే .అందరినీ పలకరిస్తూ దర్శనమిచ్చేవారు. ఆ రోజుల్లో బరంపురం మీంచి వెళ్లే రైలు మార్గాన్ని BNR Railway అనేవారు. Bengal Nagpur Railways. శంకరం పంతులు గారికి BNR ఉద్యోగస్తులు అందరూ పరిచితులు. శంకరం పంతులు గారి కుమారుడు తంబి ( నరసింహరావు ) నా క్లాస్ మేట్.
స్టేషన్ దిగి బాబులు అన్న ఇంటికి వెళుతున్నప్పుడు బంగాళా కేసి చూశా. బంగళా లేదు . దాని ఆనవాళ్లు లేవు. ఆ స్థానంలో ఒక హోటల్ ఉంది ఇప్పుడు. ఉన్నవ వారి బంగళా కాల గర్భంలో కలిసిపోయింది.
తాత సత్యం గారి ఇంట్లో తరిణి అని పని మనిషి ఉండేది . తాతగారు గాంధేయవాది. కాంగ్రెస్ కార్యకర్త. పండిట్ జవహర లాల్ నెహ్రూ అంటే అభిమానం . ఆ అభిమానం కొద్దీ ఆయన నాకు జవహర్ అని పేరు పెట్టారు. అది జవ్వారు గా మారింది. తరిణికి ఇది నచ్చక ఆ పేరుని “ జవ్వాయి “ గా మార్చేసింది. జవ్వాయి నాకు తరిణి పెట్టిన పేరు. రాజప్పకి “ రాజా “ అని పేరు పెట్టినది కూడా తరిణే .మేమిద్దరమూ అంటే చాలా ప్రేమగా చూసేది తరిణి. నేను మా ఊరు వంటిమామిడి అగ్రహారం వేసవి సెలవుల్లో వెళ్ళినప్పుడు అక్కడ నన్ను అందరూ “ జవ్వాయి….తువ్వాయి “ అని ఆట పట్టించేవారు .తాతగారు , అమ్మమ్మ, అమ్మ యశోదమ్మ, బాబులు అన్న , వీళ్ళందరికీ “ జవ్వారు “అనే పిలవడం అలవాటు. తతిమ్మా అందరూ నన్ను తరిణి పెట్టిన పేరు “జవ్వాయి “ అనే పిలవడం అలవాటు.
.మా తరిణి మొగుడు అప్పారావు. జట్కాబండి నడిపేవాడు. ఆ రోజుల్లో ఊర్లో ఎక్కడికైనా ప్రయాణం చేయవలసి వస్తే జట్కాబండి మీదే. ఇంకా సైకిలు రిక్షాలు అప్పటికి బరంపురం లో రాలేదు. అప్పరావు మమ్మల్ని జట్కాబండి ఎక్కించుకొని గుర్రం పరుగెడుతూ ఉంటే బండి చక్రంలో ఆనీ ఆననట్లుగా ఛర్నాకోల్ కర్ర పెడితే “ టక్ .. టక... టక….టక్ మని శబ్దం వచ్చేది. ఆ శబ్దానికి గుఱ్ఱం మరింత హుషారుగా పరుగులు పెట్టేది. క్షణాల్లో గమ్యం చేరుకొనేది.
అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన “ ట్రంకు పెట్టి మర్డర్ “ కేసు లో నిందితులు ఉపయోగించుకున్నది అప్పారావు జట్కాబండీ యే. అప్పారావుకి ఏ సంబంధం లేకున్నా కేసు లో ఇరుక్కోవలసింది.
ఇంటి ఎదర ఒడిశా రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గా పని చేసిన విశ్వనాధ్ దాస్ గారి ఇల్లు.తర్వాత ఉత్తరాది రాష్ట్రానికి గవర్నర్ గా కూడా పని చేశారు వారు. ఆయన ఇంటి పక్కనే మలుపులో “భబానీ “ అని ఒక టీ కొట్టు ఉండేది . మధ్యాన్నం మూడు నాలుగు గంటల వేళ పకోడీ , బఠానీ లతో “ గుగ్నీ“ అనే కమ్మని మసాలా తో కూర చేసేవాడు. ఆ కమ్మని మసాలా కూర వాసన చాలా దూరం వ్యాపించేది. నేను , రాజప్ప , గున్ను, నాని ఆ గుగునీ కూర మస్తుగా లాగించేసే వాళ్ళం . చిన్న విస్తారాకు దొప్పలో వేడి వేడి గా ఆవిర్లు వచ్చేటట్లు ఇచ్చేవాడు భబానీ.ఆవురు ఆవురు మని మూతి కాలుతున్నా తినేసేవాళ్ళం. అప్పట్లో భబానీ బఠానీ మసాలా కూర అంటే అంత ఇష్టం. ఇప్పుడు అక్కడ పాన్ సిగరెట్లు కొట్లు వెలిశాయి.
మా ఇంట్లోే బాల గ్యాంగ్ తో ఆటలాడుకున్న బాల స్నేహితులంతా పక్క పక్కనే. మాకు ఒకవైపు పెండ్యాల వారి సీత ఇల్లు , ఇంకోవైపు ఎర్రబాబు గారి జానీ, దేవి, సుందర్ వాళ్ళ ఇల్లు. . వాళ్లపక్కన నాభి వారి మణి, సుబ్బారావు వాళ్ళుండే ఇల్లు. వారింటికి కాస్త ఎదురుగా బూర్ల టిక్కడు ( ప్రకాశరావు ) ఇల్లు , వాళ్ళ ఇల్లు దాటి ఇంకొంచం ముందుకు వెళితే సుందరేశన్ మాస్టారు రంగన్ వాళ్ళ ఇల్లు , వారి పక్కన యడవల్లి వారు.అన్నట్టు మార్చి పోయా. పెండ్యాల సీత వాళ్ళ ఇంటి మలుపు తిరిగి హాస్పిటల్ కేసి వెడుతూ ఉంటే చివుకుల సీత వాళ్ళుండే గృహం. ఇందాక సుందరేశన్ గారి రంగన్ ఇంటికి దారి చెప్పా కదా . ఆ దారిలోనే చర్చ్ ఎదురుగా చిన్న భవనంలో పోస్టు ఆఫీస్ ఉండేది.
అన్నట్లు ఇందాక ఎంతవరకూ నడిచాం. యడవల్లి వారి ఇంటి వరకు కదూ….ఇది దాటగానే బారకాసు కూడలి. బరంపురం లో అత్యంత ప్రాధాన్యమైన కూడలి.
బారకాసు గురించి తర్వాత Musings లో చెబుతా. ఈ లోగా భబానీ హోటల్ గుగ్నీ రుచి గుర్తుకు తెచ్చుకొని లొట్టలు వేయండి.
క్రిందన ఫోటో నేటి బారకాసు కూడలి.
******
No comments:
Post a Comment