Friday, 13 April 2018

Javvai Musings (3 )


Javvai Musings.


మనం మనం బరంపురం.


SERIES(3)




 బారకాసు కూడలి వరకూ వచ్చాం..కదా... ఒకసారి మళ్లీ మేమున్న ఎర్రబాబు గారి ఇంటికి వెళ్ళి వచ్చేద్దాం. కొన్ని జ్ఞాపకాలు  మంచు కురిసిన రాత్రి   రాలిన పారిజాత పువ్వుల్లా  అక్కడ నేల మీద  ఉండిపోయాయి .  నేల రాలిన ఆ పారిజాతాల్ని  ఏరుకొని బారకాసుకి వద్దాం.

పూర్వం రోజుల్లో ప్రతి కుటుంబానికి , ఇంటి  వైద్యుడు ( Family Doctor) ఒకరు ఉండేవారు. మా ఫ్యామిలీ డాక్టర్ గరిమెళ్ళ కృష్ణమూర్తి గారు. ప్రతి ఉదయం ఎనిమిది గంటలు దాటకుండా సూటు బూటు వేసుకొని  రాబిన్ హుడ్ (Robinhood) సైకిల్ మీద వచ్చేవారు. సైకిల్ ఆగగానే ట్రింగ్….ట్రింగ్ మని గంట వాయించేవారు.  “ నే వచ్చా” అన్నట్లుగా. ఆయన సైకిల్ కి స్టాండ్  ఉండేది కాదు. ఓ పెడల్ మెట్ల మీద ఆనిస్తే సైకిల్ ఓ పక్కకు ఒరిగి నిలబడేది. వస్తూనే అందర్నీ పలకరించి మా కెవరికైనా   దగ్గు, రొంప లాటివి ఏవైనా ఉంటే ఆసుపత్రికి వచ్చి మందు తీసుకెళ్లమనేవారు. అమ్మమ్మ  ' వీడు సరిగా తినటంలేదూ… ఈ పిల్ల ఎంత తిన్నా నీరసం గా ఉంటోంది .. వాడికి కడుపు నొప్పి .. ' అని మమ్మల్ని వరసగా నిలబెట్టి  పిల్లల గురించి చెబితే దగ్గరికి పిలిచి పల్స్ చూసి , ధర్మామీటరు నాలిక కింద పెట్టి టెంపరేచరు చూసి, ఓ సారి మెళ్ళో వెళ్లాడే స్టేతస్కోప్ తీసి ఛాతి,  గుండె చప్పళ్ళు విని నవ్వేసి “ఆసుపత్రికి వచ్చేయ్ !.. తియ్యటి మందు ఇస్తా.. “ అనేసి ఓ కప్పు ఆవిర్లు వస్తున్న కాఫీ సాసర్ లో పోసుకొని ..ఉఫ్...  ఉఫ్  అని ఊదుకొని ఆదరా బాదరా గా తాగేసి ఝామ్మని వెళిిపోయేవారు ఇంకో ఖాతా ఇంటికి.
ప్రతి ఇంటి ఖాతా చూసుకొని ఆసుపత్రిలో పదిన్నరకి ఉండాలి మరి.

సాంబడు  అని తాత సత్యంగారికి ఆఫీస్ మెస్సెంజర్ ఉండేవాడు. చాలా సౌమ్యుడు. పొద్దున్నే వచ్చి  ఇంటిలో పనులు బయట పనులు  అన్నీ చక్కపెట్టేవాడు . డాక్టర్ కృష్ణమూర్తి గారి ఆసుపత్రి ఎక్కడో పెద్దబజారు దాటాక. అది మున్సిపల్ ఆసుపత్రి. సాంబడు వెళ్లి  పొద్దున ఆయన రాసిన మందులు తెచ్చేవాడు. అన్ని రోగాలకీ ఒకటే అరకు. ఒక సీసాలో డోసులకు గుర్తుగా ఒక్కో  డోసుకు ఒక డైమండ్ ఆకారంలో ఒక కాగితం అంటించి ఉండేది. ఎన్ని డైమండ్ గుర్తులంటీ అన్ని డోసులన్నమాట. అరకు మందు ఎర్రగా , తియ్యగా పుల్ల  పుల్లగా భలే బావుండేది.

ఆరోజుల్లో అందరికీ శుభకార్యాలు చేయించడానికి  కుటుంబ పురోహితులు ( బ్రహ్మ గారు ),  పెళ్లిళ్ల లో వంటలు చేయడానికి వంట బ్రాహ్మణులు, ఇంటి చాకలి, మంగలి, కొత్త బట్టలు కుట్టడానికి దర్జీ (Tailor) ఉండేవారు. నరసింహం అని ఒకాయన శుభకార్యాలలో మడి కట్టుకొని పెద్ద వంటలు సునాయాసంగా వండే వాడు ఒంటి చేత్తో. గోవిందు ఇంటి మంగలి. తాతగారికి రోజూ వచ్చి గెడ్డం గీసేవాడు. పిల్లలం అయిన  మాకు తల మాసితే తాతగారు గోవిందుకు   అంట కత్తెర వేయమని ఆర్డర్ వేసేవారు. గోవిందు మా తలకాయలని కదలకుండా మోకాళ్ళ  మధ్య ఉడుం పట్టులా బిగించేసి కత్తెర ఆడించేవాడు.నానీ మాత్రం  గోవిందు చేత క్షవరం ససేమిరా చేయించుకొనేవాడు కాదు. కారణం. ఎంతో కష్టపడి దువ్వెన్నతో తిప్పులు తిప్పీ... తిప్పీ... ముందు భాగాన జుత్తు నాలుగు వంకీలు తెచ్చుకున్నాడు. క్షవరం చేయించుకుంటే ఆ వంకీలు గోవిందు కత్తిరించేస్తాడేమోనని వాడి భయం.

 అమ్మమ్మ ఊరు ఛత్రపురం నుండి  ఇంటి చాకలి వారానికి ఓ సారి  రేవు బట్టలు ఛత్రపురం లో ఉతికి  తీసుకొని వచ్చేది. ఉతికిన తెల్ల  బట్టలు  మల్లెపూవుల్లా ఉండేవి.  ఎప్పుడూ సాయింత్రం తెచ్చేది 
చాకి రేవు  బట్టలు ఛత్రపురం నుండి. ఇక ఆ రాత్రి మా ఇంట్లో  మకాం. ఆవిడికి రాత్రి భోజనం తర్వాత నల్లమందు వేసుకోవడం అలవాటు. శ్రమ  మరచిపోవటానికి  , హాయిగా రాత్రి నిద్ర పట్టడానికి కామోసు బహుశా .

మా దర్జీ  రామ్మూర్తి. మా అందరి కొత్త బట్టలూ అతనే కుట్టేవాడు. పండగల సమయంలో కొత్త బట్టలు సమయానికి  ఇస్తాడో లేదోనని మేము రోజూ అతనిని  ఆత్రుత కొద్దీ  బుర్ర  తినేసేవాళ్ళం.
పండగ ముందు రోజు రాత్రి కి  కానీ బట్టలు ఇచ్చేవాడు కాదు రామ్మూర్తి. అప్పుడు మా మొహాలు  చిచ్చుబుడ్డీ  లాగా వెలిగి పోయేవి.

పూర్వం యాయవార బ్రహ్మణత్వం అని ఒక వ్యవస్థ ఉండేది . ఆ బ్రాహ్మలు కాస్త కలిగిన  బ్రాహ్మణ కుటుంబాలు ఎంచుకొని యాయవార వృత్తి చేసుకొని కుటుంబాలను పోషించు కొనేవారు. మా ఇంటికి ప్రతి రోజూ ఒక యాయవార  బ్రాహ్మణ ఆయన వచ్చేవారు. పేరు గుర్తుకు రావడం లేదు.  తెల్లటి పంచకట్టు , అంగవస్త్రం, నుదుట విభూతి , కుంకుమ బొట్టు, చేతిలో తళ తళా 
మెరిసే నాలుగు  సేర్లు  పట్టే కంచు చెంబుతో  వచ్చి  ' సీతారామాభ్యాన్నమః '  అని  రోజు,  వార, తిధి నక్షత్రాలు, దుర్ముహూర్త  సమయం వివరాలు చెప్పేవారు. క్యాలెండర్ చూసుకోవడం పని ఉండేది కాదు. ఆయన తిధి , వార నక్షత్రాలు చెప్పడం ముగించాక పిల్లలం మా చేత ఓ సోలడు బియ్యం చెంబులో వేయించేది అమ్మమ్మ. ఆయన ఆశీర్వదించి  శెలవు తీసుకొనేవారు. తర్వాత కాలంలో యాయవార వృత్తి కనుమరుగు అయిపోయింది. వారికి భుక్తి దుర్లభం అయిపోయింది. సంప్రదాయ వ్యవస్థలు కూలిపోయాయి.

అమ్మమ్మ  సంతానం కలగటానికి
వివాహిత  స్త్రీలకు  ఉచితంగా అనువంశిక వైద్యం చేసేది . ఈ అనువంశిక వైద్యం అమ్మమ్మకి  మాత్రమే ఆమె తండ్రి ఉన్నవ నరసింహస్వామి ఉపదేశించారు.  చాలా మంది వివాహిత  స్త్రీలు  పొద్దున్నే  మా అమ్మమ్మ వద్దకు వచ్చేవారు వైద్యం కోసం.
తాతబాబాయి మా దగ్గర  ఉన్న  రోజుల్లో ఆయన  భార్య సుబ్బలక్ష్మి కి అమ్మమ్మ ఈ మందు ఇస్తే ఆవిడ  ఏడాది తిరిగేసరికి  పండంటి  ఆడపిల్లని కనింది.  ఆ పిల్ల  పేరు సుందరి. చిన్నప్పుడు సుందరిని నేను ఎత్తుకొని మోసా.. సుందరికి ఓ రెండేళ్లు దాటగానే తాత బాబాయి ,సుబ్బలక్ష్మి వాళ్ళు పసి పిల్లతో మిలటరీ లైన్స్ లో ఇల్లు అద్దెకు తీసుకుని  వెళ్లిపోయారు.

కస్తూరి సుబ్బారావు గారని కాకినాడలో హిందీ పండిట్. వారికీ మా అమ్మమ్మకి  ఉన్న చుట్టరికం నాకు తెలీదుగానీ వారి కుటుంబం కూడా మాతో చాలా రోజులు ఉన్నారు. కస్తూరి సుబ్బారావు గారి భార్యకి కూడా అమ్మమ్మ మందు ఇచ్చింది. ఆవిడ కూడా సంతాన సాఫల్యం పొంది కాకినాడ తిరిగి వెళ్లారు. 

 అమ్మమ్మ ఈ అనువంశిక వైద్యం మా జానకి  దొడ్డమ్మకి ఉపదేశించింది. జానకి దొడ్డమ్మ  తన తదనంతరం ఈ అనువంశిక వైద్యం కొనసాగించడానికి  ఎవ్వరికీ అప్పచెప్పలేదు. దానితో ఈ వైద్యానికి తెర పడింది. ఉన్నవ వశం వారి అనువంశిక సంతాన సాఫల్య కేంద్రం మూత పడింది.

ఆ ...ఇప్పుడు ఇంకొక కుటుంబం  గుర్తుకు వస్తోంది.. వారు యర్రమిల్లి వారు. కానీ మా వంటిమామిడి యర్రమిల్లి వారికి వారితో ఎటువంటి సంబంధం లేదు. ఆయన పేరు విశ్వనాధం. పశువుల డాక్టర్. బదిలీ మీద బరంపురం రావటం జరిగింది. విశ్వనాధం గారు బాగా కురచ. మంచి మనసున్న మనిషి. వారి మాట పాత సినిమాల్లో వేషాలు వేసిన డాక్టర్ శివరామకృష్ణ గారిలా ఉండేది వినటానికి  .వీరి కుటుంబం చాలా రోజులు మాతో పాటే ఉంది. వీళ్ళ అబ్బాయి శివరావు. బాబులు అన్న తో కలిసి చదివేవాడు శివరావు. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. కొంతకాలానికి పశువుల ఆసుపత్రి ప్రాంగణంలో గవర్నమెంట్  క్వార్టర్ ఖాళీ  అయితే అక్కడికి   మారిపోయారు.

ఉన్నవ  బలరాం  గారు  అమ్మమ్మకి దూరపు చుట్టం. టౌన్ స్కూల్ లో
 టీచర్ .   అడపా తడపా ఇంటికి  వస్తూ పోతూ ఉండేవారు.  తాత  సత్యంగారు 
నన్ను చూపించి  ' బలరాం ... వీడిని నీ స్కూల్లో పడెయ్యి ' అన్నారు ఓరోజు. 
' దానిదేముంది .  సత్యం బావా ! స్కూలికి రమ్మను ' అని చెప్పి వెళ్లారు బలరాం మేష్టారు.  మర్నాడు మావయ్య నన్ను టౌన్ స్కూలికి తీసుకొని వెళ్ళాడు. ఐదవ  తరగతిలో చేర్పించడానికి.   మీడియం స్కూలు కావటం మూలాన అప్పట్లో టౌన్ స్కూల్ లో ఫస్ట్ ఫారం వరకే ఉండేది.  బుచ్చయ్య  టాకీస్ కాస్త ఎదరగా ఉన్న వీధిలో స్కూలు.  అప్పటికి  ఐదవ తరగతి   అడ్మిషన్లు  పూర్తి  అయిపోయాయి . ఫస్ట్ ఫారం  లో మాత్రం సీట్లు ఉన్నాయి. బలరాం మేష్టారు నాకు ఫస్ట్ ఫారం లో సీట్ ఇస్తే  ఆ  క్లాస్ లో చేర్పించాడు  మావయ్య. అలా మొదలైంది నా స్కూల్ ప్రస్థానం  బరంపురంలో.  ఆ సంవత్సరం నా ఫస్ట్ ఫారం పరీక్ష డింకీ కొట్టింది.  నాకు ఆ వయసులో  పరీక్షలు  పాస్ , ఫెయిల్  గురించి తెలీదు.  ఇంటికి వచ్చి  నేను పరీక్ష  ఫెయిల్ అయ్యానని గర్వంగా చెబితే పార్వతి పిన్ని ఘొల్లున నవ్వింది.   తాత  సత్యం గారికి విషయం  తెలిసి '  పోనీలెండర్రా ... మళ్ళీ  అదే క్లాస్ ఇంకో సంవత్సరం చదువుతాడు . ఫౌండేషన్ బావుంటుంది . ' అని నవ్వేశారు. 

 మా అమ్మమ్మ చుట్టం  సొంకిళి మేష్టారు అని ఒకాయన ఉండేవారు. ఆయన అసలు పేరేమిటో ఇప్పటికీ నాకు తెలీదు. అందరూ ఆ పేరుతోనే పిలిచేవారు.  చిన్న పిల్లలకి ప్రైవేట్లు  చెప్పడం ఆయన జీవనోపాధి.  సత్యనారాయణ మూర్తి  కోవెల ఎదర ఉన్న అయ్యగారి వారి ఇంట్లో మేడ మీద ఒంటరిగా ఉండేవారు.  ఎప్పుడూ జరదా  కిళ్లీ బుగ్గన ఉండేది. మనిషి కోపిష్టి.  ఫౌండేషన్ మాట అమ్మమ్మ చెవిన పడటంతో  నన్ను , రాజప్పని  ఆయన దగ్గర ప్రైవేట్ కి కుదిర్చింది. మాతో పాటు గున్నక్క కూడా చేరింది .  రెండు రోజుల తర్వాత సొంకిళి తడాఖా మాకు తెలిసొచ్చింది.  ఎక్కాలు వెనకనుంచి అప్ప చెప్పమనేవాడు.  ఆవు  మీద వ్యాసాలు వ్రాయమనేవాడు.  ఎక్కాలు తప్పుగా  అప్పచెప్పినా..  వ్యాసాలలో తప్పులు దొర్లినా  మా భరతం పట్టేవాడు . ఆయన చేతిలో పేము  బెత్తం  ఉండేది. అరచేయి  చాపమని   బెత్తం తో ఘాట్టిగా కొట్టేవాడు.  సొంకిళి మేష్టారు వద్ద ఎప్పుడూ రెండు చిల్లు రాగి కానీలు  ఉండేవి  చొక్కా జేబులో . జరదా   బాగా బుర్ర కెక్కినప్పుడు రెండు కానీలు జేబులోనుండి తీసి  వాటితో మాకు తొడ పాశాలు పెట్టేవాడు.  లేత చర్మం.  మాకు విరీతమైన బాధ,  నొప్పి కలిగేది. చర్మం ఎరుపెక్కి అక్కడ రక్తం  గూడు కట్టుకునేది.  కళ్లంట  నీళ్లు గిర్రున తిరిగేవి . ఇంట్లో  పెద్దలకు చెబితే  చమడాలు ఊడ తీస్తానని బెదిరించేవాడు కళ్లెర్ర చేస్తూ. దసరా పండగ  ముందు మాత్రం ఎంతో ప్రేమగా మాట్లాడేవాడు . దసరా పద్యాలు నేర్పించి మమ్మల్ని విల్లు,  బాణం కొనుక్కొని ఉండమనేవాడు . మేము సరదాగా వెదురు బద్ద తో  చేసిన ధనుస్సు కొనుక్కొని దానికి రంగు రంగుల కాగితాలు అంటించేవాళ్ళం. బాణం కూడా సన్నటి వెదురు పుల్ల . ఈ పుల్లకి ముందు భాగాన చిన్న బుట్ట లాటిది ఉండేది. దానిని కూడా రంగుల కాయితాలు అంటించి అందంగా తీర్చిదిద్దే వాళ్ళం. విజయదశమి నాడు సొంకిళి మాస్టారు మమ్మల్ని అందరినీ బృందంగా ఇళ్లకు తీసుకొని  వెళ్ళేవాడు. ఏ ఇంటిలో పిల్లలు తన వద్ద చదువుతున్నారో  వాళ్ళే ఆ ఇంటిలో దసరా పద్యాలు పాడాలి. అదీ రూలు.
జయీభవ.. విజయీభవ అంటూ సొంకిళి మాస్టారు తో కలిసి ఇంట్లో ప్రవేశించేవాళ్ళం .అప్పట్లో నేను దసరా పద్యాలు బాగా పాడేవాడిని.
మా తాత ఇంటికి చేరగానే పద్యాలు  పాడటం నా వంతు. నా చేత  ఓ  పద్యం పాడించిన తర్వాత అందరితో ముక్త కంఠం తో ఇలా పాడించేవాడు.
 ' ఏదయా మీ దయ మా మీద లేదా
పావలా ఇస్తేను పట్టేది లేదు
అర్ధ రూపాయి ఇస్తే అంటేది లేదు
ముప్పావలా ఇస్తే ముట్టేది లేదు 
విచ్చు రూపాయి ఇస్తే 
పుచ్చుకుంటాము.
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు '
అని.
ఇది పాడిన తర్వాత బాణానికి  ముందున్న  బుట్టలో భుజానికి ఉన్న చేతి సంచీలో దాచి పెట్టుకున్న పువ్వులు వేసి , వింటి నారి లాగి బాణం సంధించి పెద్దల మీద పూల వర్షం కురిపించే వాళ్ళం. పూల వానకి అమ్మమ్మ తాతగారు మురిసిపోయేవారు.  సొంకిళి మాష్టారికి  అనుకున్న దానికన్నా ఎక్కువే  ముట్టచెప్పేవారు దసరా బహుమతిగా. దసరా పండగ తర్వాత సొంకిళి మాస్టారు హింస మామూలే. 
ఒకరోజు అన్నం పెడుతూ మా వంటిమీద కమిలిన చర్మం చూసిన అమ్మమ్మ విషయం అడిగింది. ఏడుస్తూ చెప్పాము. సొంకిళి మాస్టారు మమ్మల్ని కొట్టే దెబ్బలు ,పెట్టే తొడపాశాలు. అది విన్న అమ్మమ్మ ఇక ఆ ప్రైవేటు మాన్పించేసింది.
హమ్మయ్య అనుకున్నాం.
విజయీభవ అని ఆనంద పడి కేరింతలు వేశాము.
 జయీభవ...........  విజయీభవ.
ఈ క్రిందన ఫోటో నేను చదువుకున్న టౌన్ స్కూల్ .ఇప్పుడు హైస్కూల్ స్థాయికి ఎదిగి పోయింది.




నేను  చదువుకున్న  టౌన్ స్కూల్ 
Town School.

😐😎😜🤔😘🙂











   


Friday, 6 April 2018

Javvai Musings. ( 2)

Javvai Musings.

మనం మనం బరంపురం.
Series ( 02)
***********************************


                                                                             *

బరంపురం స్టేషన్ నుంచి బయటకు వచ్చి నాలుగు అడుగులు వేస్తే ఎదర ఉన్నవ వారి బంగళా. బ్రిటిష్ వారి హయాం లో    ఉన్నవ రామలింగం గారు కాంట్రాక్టర్ గా ప్ర సిద్ధులు. ఆయన కి రావు బహదూర్ బిరుదు ప్రదానం చేశారు. తన నివాసం కోసం అప్పట్లో  రావు బహదూర్ గారు నిర్మించు కున్న విలాస వంత మైన నిర్మాణం ఈ బంగళా. పూర్తిగా రాతి కట్టడం. అటువంటి రాతి తో కట్టబడిన భవంతి బరంపురం  లో నాకు తెలిసి బహుశా అది ఒక్కటే. రామలింగంగారు అప్పటి మద్రాసు ప్రసిడెన్సీ లో ఉన్న చాలా నగరాల్లో చాలా భవనాలు కాంట్రాక్టర్ గా నిర్మాణం చేశారు. కాకినాడ లోని మునిసిపల్ కార్యాలయం వాటిలో ఒకటి .  కాకినాడ పట్టణం కార్పొరేషన్ గా మారినా ఇప్పటి కీ కార్పొరేషన్ ఆఫీస్ అందు లోనే పని చేస్తోంది . ఉన్నవ వారి బంగళా గేట్ పక్కన ఇరువైపులా W.V.V. Ramalingam ,Contractor అని పేరు పాలరాతి పలక మీద ఒకవైపు తెలుగు లోను ఇంకొక వైపు ఇంగ్లీష్ లోను వ్రాసి ఉండేది. ఆ బంగాళా లో నాకు తెలిసి రామలింగం గారి కుమారులు సింహం గారు , శంకరం గారు నివసిస్తూ ఉండేవారు.
సింహంగారు ముందు భాగంలోనూ , శంకరం గారు వెనుక భాగం లోనూ ఉండేవారు . సింహం గారు మల్లెపూవు లాంటి తెల్లని దుస్తులు ధరించేవారు. డబ్బపండు లాంటి శరీర ఛాయ. కంటి మెడ జుబ్బా, లుంగీ ఆయన ఆహార్యం. గంభీరమైన ఆకారం. సింహంగారి  కుమారుడు నాగు ( నాగేశ్వరరావు ) నా సహ విద్యార్థి మరియు మిత్రుడు.ఇకపోతే శంకరం గారు, అన్నగారికి పూర్తిగా విరుద్ధం . శంంకరం గారిని శంకరం పంతులు అని పిలిచేవారు . కలుపుగోరు మనస్తత్వం. భోళా మనిషి. ఖద్దరు చొక్కా ,పంచె ఆయన ఆహార్యం. స్టేషన్ లో ప్రతి రోజూ పాస్సెంజర్ , మెయిల్ / ఎక్స్ప్రెస్ రైళ్లు వచ్చే టైముకి ఆయన తప్పక హాజరు కావలసిందే .అందరినీ పలకరిస్తూ దర్శనమిచ్చేవారు. ఆ రోజుల్లో బరంపురం మీంచి వెళ్లే రైలు మార్గాన్ని  BNR Railway అనేవారు. Bengal Nagpur Railways. శంకరం పంతులు గారికి BNR ఉద్యోగస్తులు అందరూ పరిచితులు. శంకరం పంతులు గారి కుమారుడు తంబి ( నరసింహరావు ) నా క్లాస్ మేట్.
స్టేషన్ దిగి బాబులు అన్న ఇంటికి వెళుతున్నప్పుడు బంగాళా కేసి చూశా. బంగళా లేదు . దాని ఆనవాళ్లు లేవు. ఆ స్థానంలో ఒక హోటల్ ఉంది ఇప్పుడు. ఉన్నవ వారి బంగళా కాల గర్భంలో కలిసిపోయింది.
తాత సత్యం  గారి ఇంట్లో   తరిణి అని పని మనిషి  ఉండేది . తాతగారు గాంధేయవాది. కాంగ్రెస్  కార్యకర్త. పండిట్ జవహర లాల్ నెహ్రూ అంటే అభిమానం . ఆ అభిమానం కొద్దీ ఆయన నాకు జవహర్ అని పేరు పెట్టారు.  అది జవ్వారు గా మారింది. తరిణికి ఇది నచ్చక ఆ పేరుని “ జవ్వాయి “ గా మార్చేసింది. జవ్వాయి నాకు తరిణి పెట్టిన పేరు. రాజప్పకి  “ రాజా “ అని పేరు పెట్టినది కూడా తరిణే .మేమిద్దరమూ అంటే చాలా ప్రేమగా చూసేది తరిణి. నేను మా ఊరు వంటిమామిడి అగ్రహారం వేసవి సెలవుల్లో వెళ్ళినప్పుడు అక్కడ నన్ను అందరూ “ జవ్వాయి….తువ్వాయి “ అని ఆట పట్టించేవారు .తాతగారు ,  అమ్మమ్మ, అమ్మ యశోదమ్మ, బాబులు అన్న , వీళ్ళందరికీ “ జవ్వారు “అనే పిలవడం అలవాటు. తతిమ్మా అందరూ నన్ను తరిణి పెట్టిన పేరు “జవ్వాయి “ అనే పిలవడం అలవాటు.
.మా తరిణి మొగుడు అప్పారావు. జట్కాబండి నడిపేవాడు. ఆ రోజుల్లో ఊర్లో ఎక్కడికైనా  ప్రయాణం చేయవలసి వస్తే జట్కాబండి మీదే. ఇంకా సైకిలు రిక్షాలు అప్పటికి బరంపురం లో రాలేదు.  అప్పరావు మమ్మల్ని జట్కాబండి ఎక్కించుకొని గుర్రం పరుగెడుతూ ఉంటే బండి చక్రంలో ఆనీ ఆననట్లుగా  ఛర్నాకోల్ కర్ర పెడితే “ టక్ .. టక... టక….టక్ మని శబ్దం వచ్చేది. ఆ శబ్దానికి గుఱ్ఱం మరింత హుషారుగా పరుగులు పెట్టేది. క్షణాల్లో గమ్యం చేరుకొనేది.
అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన “ ట్రంకు పెట్టి  మర్డర్ “ కేసు లో నిందితులు ఉపయోగించుకున్నది అప్పారావు జట్కాబండీ యే. అప్పారావుకి  ఏ సంబంధం  లేకున్నా  కేసు లో ఇరుక్కోవలసింది. 
  ఇంటి ఎదర ఒడిశా రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గా పని చేసిన విశ్వనాధ్ దాస్ గారి ఇల్లు.తర్వాత ఉత్తరాది రాష్ట్రానికి గవర్నర్ గా కూడా పని చేశారు వారు. ఆయన ఇంటి పక్కనే మలుపులో  “భబానీ “ అని ఒక టీ కొట్టు ఉండేది . మధ్యాన్నం మూడు నాలుగు గంటల వేళ పకోడీ , బఠానీ లతో “ గుగ్నీ“ అనే కమ్మని మసాలా తో కూర చేసేవాడు. ఆ కమ్మని మసాలా కూర వాసన చాలా దూరం వ్యాపించేది. నేను , రాజప్ప , గున్ను, నాని ఆ గుగునీ కూర మస్తుగా లాగించేసే వాళ్ళం . చిన్న విస్తారాకు దొప్పలో వేడి వేడి గా ఆవిర్లు వచ్చేటట్లు ఇచ్చేవాడు భబానీ.ఆవురు ఆవురు మని మూతి కాలుతున్నా  తినేసేవాళ్ళం. అప్పట్లో భబానీ బఠానీ మసాలా కూర అంటే అంత ఇష్టం. ఇప్పుడు అక్కడ పాన్ సిగరెట్లు కొట్లు వెలిశాయి.
మా ఇంట్లోే బాల గ్యాంగ్ తో ఆటలాడుకున్న బాల స్నేహితులంతా పక్క పక్కనే. మాకు ఒకవైపు పెండ్యాల వారి సీత  ఇల్లు , ఇంకోవైపు ఎర్రబాబు గారి జానీ, దేవి, సుందర్ వాళ్ళ ఇల్లు. . వాళ్లపక్కన నాభి వారి మణి, సుబ్బారావు వాళ్ళుండే ఇల్లు. వారింటికి కాస్త ఎదురుగా  బూర్ల టిక్కడు ( ప్రకాశరావు ) ఇల్లు , వాళ్ళ ఇల్లు దాటి ఇంకొంచం ముందుకు వెళితే సుందరేశన్ మాస్టారు రంగన్ వాళ్ళ ఇల్లు , వారి పక్కన యడవల్లి వారు.అన్నట్టు మార్చి పోయా. పెండ్యాల సీత వాళ్ళ ఇంటి మలుపు తిరిగి హాస్పిటల్ కేసి వెడుతూ ఉంటే చివుకుల సీత వాళ్ళుండే గృహం. ఇందాక సుందరేశన్ గారి రంగన్ ఇంటికి దారి చెప్పా కదా . ఆ దారిలోనే  చర్చ్ ఎదురుగా చిన్న భవనంలో పోస్టు ఆఫీస్ ఉండేది.
అన్నట్లు ఇందాక ఎంతవరకూ నడిచాం. యడవల్లి వారి ఇంటి వరకు కదూ….ఇది దాటగానే బారకాసు కూడలి. బరంపురం లో అత్యంత ప్రాధాన్యమైన కూడలి.
బారకాసు గురించి తర్వాత  Musings లో చెబుతా. ఈ లోగా భబానీ హోటల్ గుగ్నీ రుచి గుర్తుకు తెచ్చుకొని  లొట్టలు వేయండి.
                        క్రిందన ఫోటో నేటి బారకాసు కూడలి. 
                     


******

Thursday, 5 April 2018

Javvai Musings (1)

Javvai Musings.
మనం మనం బరంపురం.
Series ( 1 )

          


బాబులు అన్న అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిసి మార్చి నెల చివరి వారంలో బరంపురం వెళ్ళాను.
నా బాల్యం అంతా బరంపురం పట్టణంలో మాతామహుల వద్ద గడిచింది. 1947లో ఏడేళ్ల వయసులో బరంపురంలో అడుగుపెట్టిన నేను 1958 వ సంవత్సరం లో ఇంజనీరింగ్ చదువు కోసం బరంపురం పట్టణానికి వీడ్కోలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత బరంపురం నేను వెళ్లడం చాలా అరుదు.  

చాలా ఏళ్ల  విరామం  తర్వాత  బరంపురం స్టేషన్లో  అడుగుపెట్టి  బయటకు రాగానే నా కళ్ళు  నాకు బాగా పరిచయమైన పరిసరాలను కలయ చూశాయి . వ్యక్తీకరించలేని   నిరుత్సాహం కలిగింది . పట్టణం  గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. విస్తరణ, ఆధునీకరణ , సుందరీకరణ  పేరున నగరం చవకబారు అలంకరణ  చేసుకున్నట్లు అనిపించింది . రణగొణ ధ్వనులు , ఎందుకో తెలియని కోలాహలం , ఉరుకులూ పరుగులూ . మునుపటి ప్రశాంతత  మచ్చుకైనా  కనిపించలేదు. 


బరంపురం లో అప్పట్లో మా తాత సత్యంగారు , కుటుంబంతో సహా , పోతాప్రగడ ( ఎర్రబాబు) గారి ఇంట్లో నెలకి ఒక రూపాయి అద్దె చెల్లిస్తూ  నివసిస్తూ ఉండేవారు. ( ఈ అద్దె విషయం నాకు ఈ మధ్యన నా చిన్ననాటి స్నేహితురాలు ఎర్రబాబు గారి అమ్మాయి జానకీ శాస్త్రి చెబితే తెలిసింది).మా తాత సత్యం గారి కుటుంబం పెద్ద కుటుంబమే .ఆరుగురు  కూతుర్లూ, మావయ్య, మనవలూ, మనవరాళ్ళూ, వంటావిడ , ఆవిడ కుమారుడు వెంకట్రావు , మా తాతగారి బంధువులూ , తాత బాబాయి , ఆయన భార్య , నౌకర్లూ, చాకర్లూ అంతా కలిస వెరసి పాతిక మంది జనం. మేము నివసించిన ఎర్రబాబు గారి ఇల్లు చాలా విశాలమైనది. ముందు ఖాళీ స్థలం , వరండా, హాలు, దానికి ఆనుకొని గది, హాలు దాటగానే వసారా , అక్కడనుంచి కిందకి దిగటానికి మెట్లు.ఈ వసారా  నుండి మేడ మీదకు చెక్క మెట్లు. మేడ మీద మూడు విశాలమైన గదులు, గదుల చుట్టూ బాల్కనీ. క్రిందన వసారా  దిగగానే పెద్ద అంగణం( open court yard). అది దాటగానే వరండా , ఆ వెనకన భోజనశాల, వంటిల్లు, పురుళ్ల గది, ఆ వెనకాల స్నానాల గదులు , ఇంకా వెనకాల బోలెడంత పెరడు. 
ఈ ఇంట్లో 1940 లో పురుళ్ల గదిలో నేను జన్మించాను.
 మా నాన్న ఇంటి అల్లుడిగా ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఆ తర్వాత నేను ,రాజప్ప మా అమ్మా నాన్నలతో కలిసి తుని తాలూకా తూర్పుగోదావరి జిల్లాలోని మా స్వగ్రామం వంటిమామిడి అగ్రహారం వెళ్లిపోయాం. కానీ మరి కొద్ది సంవత్సరాలకే  తాత సత్యంగారి వద్దకు వచ్చేసాం. చదువుల నిమిత్తం.
అప్పుడే మన దేశానికి బ్రిటిష్ వారి సంకెళ్ళు వీడి స్వాతంత్రం వచ్చింది. ఇంట్లో ముందు భాగాన ఉన్న ఖాళీ స్థలంలో కుటుంబ సభ్యులు అందరం కలిసి మొదటి స్వాతంత్ర దినోత్సవం అట్టహాసంగా జరుపుకొని జాతీయ పతాకం ఎగరవేసాం. 1948 జనవరి ముప్పై తారీఖున జాతి పిత మహాత్మాగాంధీ గారి హత్య వార్త మొత్తం దేశాన్నే దుఃఖంలో ముంచేసింది. సాయింత్రం  వచ్చి మావయ్య  ఈ  వార్త  తాత  సత్యంగారికి చెప్పాడు . ఆయన మొదట నమ్మలేదు . 
 ఆరోజుల్లో బాబులు అన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్  వలంటీర్. రోజూ ఉదయాన్నే ఆర్.యెస్.యెస్. డ్రెస్సు వేసుకొని ,చేతిలో లాఠీ తో సమావేశాలకు వెళ్ళేవాడు. గాంధీ గారి హత్య వార్త వెలువడగానే తాత సత్యంగారు ఆ డ్రెస్సులు, కర్రలు , లాఠీలు పెరట్లో కిరోసిన్ పోసి అగ్గిపుల్లతో అంటించేశారు.

ఈ ఇంటిలో నా బాల్యం బాబులు అన్న , తంబి, నాని, మోహన్ , పాపక్క, రాజప్ప, గున్ను, చిన సూర్యం ,పార్వతి పిన్ని, సీత పిన్ని, జానకి దొడ్డమ్మ, అక్కయ్య దొడ్డమ్మ, మావయ్య , ఇంటికి తరచూ వచ్చే పోయే బంధువుల సాంగత్యం తో మధురంగా గడిచింది.ఎర్రబాబు గారి ఇంటిలో ఉన్నప్పుడే నేను స్కూల్లో చేరా. ఆ ఇంట్లోనే ఆడుకున్నా. బాబులు అన్న పెరట్లో మా అందరిచేత కోతి -  కొమ్మచ్చి ఆడించేవాడు. ముందర ఉన్న స్థలంలో మేము బంతాట , దొంగ-పోలీసు, కళ్ళగంతలు. చాకలి రేవు  ఆటలు   పొరుగున ఉన్న ఎర్రబాబు గారి పిల్లలు జానీ , దేవికుమార్, సుందర్ తో కలసి ఆడుకొనేవాళ్ళం . పెద్దలు వారిస్తున్నా మా అల్లరికి అడ్డూ అదుపూ ఉండేదికాదు.  ఆటలు ముగియగానే అంగణంలో ఉన్న కుళాయి క్రింద స్నానం చేసి , ఆడవాళ్లు ఎవరైనా చూస్తారేమోనని తువ్వాలు మొలకు చుట్టుకొని పారిపోయేవాళ్ళం.రాత్రి భోజనం తర్వాత మా అమ్మమ్మ వెచ్చని వడిలో దూరి నిద్ర పోయేవాడిని . అందరిలోకీ అర్భకుడుని కావటం వల్ల అమ్మమ్మకి నా మీద చాలా ప్రేమ.

ఇదే ఇంటిలో మా తాత సత్యంగారు పక్షవాతం జబ్బుకి గురి అయ్యారు. ఈ ఇంట్లోనే మెడిసిన్ చదువుతున్న పార్వతి పిన్ని నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని అందర్నీ వదిలి పై లోకాలకు వెళ్లిపోయింది.

ఎర్రబాబు గారి ఇంటిలో ఉన్నప్పుడే  సీత పిన్ని పెళ్లిచూపులు లాంఛనంగా జరిగాయి. లాంఛనం అని ఎందుకు అంటున్నానంటే అంతకు ముందే మావయ్య పెద్దవాళ్లకు తెలియకుండా రామశాస్త్రి , సీత  పెళ్లిచూపులు కొమ్మాపల్లి టూరింగ్ టాకీస్ లో జరిపించేశాడు లోపాయకారీగా. ఈ లాంఛనం పెళ్లిచూపుల సందర్భంలో రామశాస్త్రి గారు సైగల్ పాటలు అత్యద్భుతంగా అచ్చు సైగల్ లా పాడతారని మా బాల గ్యాంగ్ కి తెలిసింది. ఓ పాట పాడమని కోరాం . కాదనలేక “ సోజా రాజకుమారీ “ పాట పాడారు రామశాస్త్రి. గానం అద్భుతం .ఇంకో అద్భుతం జరిగింది అప్పుడు. ఈ “ సోజా “ అన్నది తనని ఉద్దేశించి ఏమో అని  అనుకొని  గాఢంగా నిద్రపోయింది పెళ్లికూతురు సీత. పెళ్లి ఘనంగా జరిగింది అదే ఇంటిలో . 
తాత బాబాయి కి అన్నగారంటే భయం. ప్రతీదీ వదినగారైన మా అమ్మమ్మ తో చెప్పి అన్నగారికి ఆవిడ ద్వారా చేరవేసేవాడు. నిత్యం జలుబు , రొంప ఆయనకి. ఆ కారణం వల్ల వారానికి ఒకసారి మాత్రమే స్నానం చేసేవాడు. ఇది తాతగారికి నచ్చేది కాదు. ఇంట్లో అందరూ ఒకే సమయంలో పంక్తి భోజనం చేయాలన్నది మా తాత సత్యం గారి రూలు. తాత బాబాయి కూడా ఈ రూలు కి మినహాయింపు కాదు . భోజనానికి కూర్చున్నప్పుడు తాత బాబాయి పీట తిరగవేసి చూసుకొనేవాడు. ఆ పీట కింద వైపు వడియాలు వేసి ఎండబెట్టిన ఆనవాళ్లు ఉంటే పీట మార్చమనేవాడు. పిల్లలం  కావాలనే తాత బాబాయి కి వడియాల పీట రోజూ రెండు పూటలా వేసేవాళ్ళం. అదో అల్లరి సరదా.

నా బాల్యం లోని మధుర జ్ఞాపకాలకు కారణమైన మేము నివసించిన ఎర్రబాబుగారి ఇల్లు ఎలా ఉందో అని చూడటానికి  వెళ్ళాను ప్రసాద్ తో కలిసి.
నా గుండె జారిపోయింది.నిర్ఘాంతపోవడం నా వంతు అయింది. అక్కడ నే నెరిగిన ఎర్రబాబు గారి ఇల్లు లేదు. దాని స్థానే ఒక పెద్ద వ్యాపార మాల్ హుందాగా నిలబడివుంది. ఈ క్రింద ఫొటోలో ఉన్నదేి ఆ మాల్.



మేము నివసించిన ఎర్రబాబు గారి ఇల్లు ఈ మాల్ పునాదులు క్రింద శిథిలమైంది అన్న నిజం అర్థం చేసుకోవదానికి కొంత సమయం పట్టింది. అప్పుడు నాకు జ్ఞానోదయం కలిగింది.
సృష్టిలో  సృష్హించబడినది ఏదీ శాశ్వతం కాదు.  మనిషి , ప్రతి జీవి, వస్తువు ఏదీ కూడా ఈ ప్రకృతి ధర్మానికి మినహాయింపు కాదు. మట్టిలో కలిసిపోవలసిందే  ఎప్పుడూ అన్నది  కాలం నిర్ణయిస్తుంది. కాలాన్ని భగవంతుడు నిర్ణయిస్తాదు.
జ్ఞాపకాలు  మాత్రం  జీవితాంతం వరకూ వెంటాడుతూనే ఉంటాయి.

 👱👸👦👤🙇🙈🙉