Tuesday, 16 August 2016

దేవ దేవం  భజే  దివ్య  ప్రభావం 

రావణాసుర వైరి  రఘు పుంగవం

రామం ...  

వాగ్గేయకారుడు  శ్రీ తాళ్లపాక అన్నమాచార్య (1408 -1503 ) రచించిన ముప్పది రెండు వేల  కీర్తనలలో  పై కీర్తన  అంటే నాకు అత్యంత  ఇష్టం . ఈ కీర్తన విన్నప్పుడల్లా మనసు పులకరిస్తుంది .  గుండెల్లో చెప్పలేని ఆనందం  కలుగుతుంది . అది మాటల్లో వర్ణించలేనిది .  రామాయణ గాధ  కళ్ళముందు కదలాడుతున్నట్లే ఉంటుంది .
దేవ దేవం భజే  దివ్య ప్రభావం 
రావణాసుర వైరి  రఘు పుంగవం రామం 
దేవ దేవం  భజే దివ్య ప్రభావం 
రాజవర శేఖరం  రవికుల సుధాకరం 
ఆజానుబాహుం  నీలాద్రికాయం 
రాజారి కోదండ  రాజ దీక్షా గురుం 
రాజీవలోచనం  రామచంద్రం  రామం 
దేవదేవం భజే దివ్య ప్రభావం ..... 
ఇలా   సాగిపోతుంది ఈకీర్తన . 
 అనిర్వచనీయమైన  ఆనందం  మనస్సుని  ఎక్కెడెక్కడకో తీసుకొని పోతుంది ..  ఆ  ఆధ్యాత్మిక  భావన  లోంచి బయట పడటము  అంత  సులభం కాదు .  
నేటి  కాలంలో  మనిషి  ఎదుర్కొనే అన్ని ఒత్తిడులను  కాస్సేపు  మరిచిపోవటానికి ప్రశాంత వాతావరణంలో   ఈ కీర్తన  శ్రవణం ఒక దివ్య  ఔషధం .  నా మాట  విశ్వసనీయంగా లేకుంటే ఒకసారి ప్రయత్నించి చూడండి . 
... 
యర్రమిల్లి  వారి  ఇష్ట  దైవం  దశరథాత్మజుడు  శ్రీరామచంద్రుడు .  
అందుకే వారి వంశంలో  రామచంద్ర  నామధేయులు మిక్కిలి ఎక్కువగానే ఉన్నారు .  నా ప్రపితామహులు  రామచంద్రుడు . నా తండ్రి గారు  రామచంద్రుడు.  ప్రతి ఉదయం  ధ్యానం  చేసుకుంటున్న వేళ లో  " మత్పితా  రామచంద్ర : " అన్న స్మరణ  నా  దైనిక చర్య .   
... 
ఈ మధ్యన , కారణం స్పష్టంగా  తెలియదుగాని , కోదండరాముని గురించి   శ్రీ వాల్మీకి మహర్షి రచించిన  రామాయణం  లో ప్రస్తావించిన  కొన్ని విషయాలు  మీ తో పంచుకోవాలన్న కోరిక  నా మనస్సులో చాలా రోజుల నుంచీ  ఊడలు ఊని  బలపడింది . భగవద్ప్రేరణ  కావచ్చు  .
... 

 శ్రీరామాయణ గాధ  మీకు అందరికీ తెలిసినదే . బహుశా  విజ్ఞులు  అయిన  మీకే ఎక్కువ పరిజ్ఞానం , పరిశీలన, విశ్లేషణ  శక్తి  అని నా ప్రగాఢ విశ్వాసం . నేను ఈ క్రింద వ్రాశిన విషయములు  సూక్ష్మంగా  శ్రీ మద్రామాయణం నుండి  సంగ్రహించినవీ ,కొంత యధాతధంగా ఉటకించినవీ అని గమనించమని  మనవి  . 
... 

 చాలా విషయాలు మీకు తెలిసినప్పటికీ మరోసారి   సీతారాముని  మననం చేసుకోవటమే ఈ ప్రయత్నం .
అందుకే  ఈ  బ్లాగు  లో  రఘు వంశం  గురించి  మరో   సారి   స్మరించుకుందాము  .  
....
 తండ్రి  దశరధుడు  పినతల్లి  కైకేయి కి  ఇచ్చిన   మాట నిలబెట్టుటకు   శ్రీరామచంద్రుడు , సీత , లక్ష్మణస్వామి  తో  కలసి  వనవాసం  స్వీకరిసాడు .
 సీతా రామ లక్ష్మణులు గోమతీ  నదిని దాటి , స్యందికా నది ఆవలి తీరం  కోసలదేశ  పొలిమేరలను చేరి  అయోధ్యకు  నమస్కరించి  గంగాతీరమున గల శృంగబేరిపురం  చేరి నిషాదరాజు   అయిన గుహుని ఆతిధ్యం అందుకొంటారు .  శ్రీ రాముని సూచన పై  గుహుడు నావను  సిద్ధం  చేసి  వారిని గంగా నది ఆవలి తీరం    వత్సదేశం  చేరుస్తాడు  . నావను ఎక్కి గంగను దాటుతున్నప్పుడు  సీతాదేవి  గంగను పూజిస్తుంది . శ్రీరాముడు  సీతాలక్ష్మణ సమేతుడై  భరద్వాజాశ్రమమునకు చేరి , మహర్షి  వనవాస దీక్షకు చిత్రకూటము  అనువైనదిగా తెలియజేయుటచే  ఆయన సూచన మేరకు సీతారామలక్ష్మణులు యమునా నదిని దాటి  చిత్రకూటము చేరుకుంటారు .  చిత్ర కూటమున   లక్ష్మణుడు పర్ణశాలను  నిర్మిస్తాడు . అక్కడికి ఉత్తర దిక్కున  పవిత్ర జలాలతో కూడిన మందాకినీ నది ప్రవహిస్తూ ఉంటుంది .   వాస్తు పూజానంతరం  సీతారామలక్ష్మణులు  పర్ణశాలలో ప్రవేశిస్తారు . 
భరతుడు  శత్రుఘ్నుని తో  కైకేయ రాజ్యమున మేనమామ వద్ద  కైకేయ నగరములో   ఉండటంవల్ల  అయోధ్య లో జరిగిన పరిణామములు ,  అనగా   శ్రీరాముని వనవాసం,  దుఖంతో కృంగిపోయిన దశరధుని మరణ  వార్త ,  కోసలదేశానికి  రాజు లేకపోవుట  వంటి  ముఖ్య విషయములు ఏమియును  తెలియవు . అయోధ్య  పెద్దలు   పంపిన  దూతల  ద్వారా  తాను  అయోధ్యానగరానికి అత్యవసరంగా రావలసి ఉన్న  సమాచారం  తెలుసుకున్న  భరతుడు  సోదరుడు  శత్రుఘ్నుని  సమేతంగా  ఆగమేఘాల మీద  అయోధ్యా నగరం చేరుకుంటాడు .అయోధ్య చేరుకున్న భరతుడు  తల్లి కైకేయి అనుచిత కోరిక, అగ్రజుడు  శ్రీరాముని  వనవాస దీక్ష ,  రాముని ఎడబాటు తట్టుకోలేక  తండ్రి దశరధుని మరణం  తెలుసుకొని  మిక్కిలి  దుఃఖం  పొందుతాడు .  శ్రీరాముని వనవాస దీక్ష విరమించమని  , అయోధ్యా నగరానికి తిరిగి వచ్చి రాజ్య పాలన  చేపట్టమని  శ్రీరాముని వేడుకొనుటకై ,  కౌసల్య సుమిత్ర  కైకేయి మాతలు, మంత్రులు , గురువులు , బ్రాహ్మణోత్తములు , బంధువులు , ప్రజలతో కలిసి  చిత్రకూటము  చేరుకుంటాడు  భరతుడు .  అయోధ్యకు  తిరిగి వచ్చి  కోసల రాజ్య పాలన చేపట్టమని కోరిన  భరతుని  విన్నపం  మరియు బ్రాహ్మణోత్తముడు జాబాలి మాటలు  ధర్మ విరుద్ధమని  పలుకుతాడు రఘువరుడు . అప్పుడు  వశిష్ట  మహర్షి  కొసలరాజ్యపాలనను చేపట్టమని శ్రీరామచంద్ర ప్రభువునికి  హితవు  బోధిస్తాడు  . ఆ క్రమంలో  శ్రీరాముని వంశక్రమము వివరిస్తాడు  వశిష్ట మహర్షి . ఇది  శ్రీ వాల్మీకి మహర్షి  విరచిత  శ్రీమద్రామాయణంలో  అయోధ్యకాండ  
నూట పదవ  సర్గ  లో వివరించబడినది . 
అదే  రఘు వంశం  . 
ఇక చదవండి. 
.... 
  సృష్టి  ప్రారంభంలో లోకమంతా జలమయమై  ఉండెను . అందుండియే  భూమండలం  ఏర్పడెను . ఆకాశస్వరూపుడైన  పరబ్రహ్మపరమాత్మనుండి బ్రహ్మదేవుడు ప్రాదుర్భవించెను.  ఆయన నుండి  మరీచి జన్మించెను .  మరీచి కుమారుడు  కశ్యపుడు . 
కశ్యపుని నుండి  వివస్వంతుడు  (సూర్యుడు) ఆవిర్భవించెను . ఆయన  కుమారుడు  వైవస్వతమనువు  . అతడే మొదటి ప్రజాపతి . ఆ మనువు  సుతుడు  ఇక్ష్వాకు ప్రభువు
సర్వసంపదలతో  నిండిన ఈ  భూమండలమును  వైవస్వతమనువు  ఇక్ష్వాకునకు  అప్పగించెను . ఆ విధముగా అతడు అయోధ్యకు మొదటి ప్రభువు . 
ఇక్ష్వాకు కుమారుడు  కుక్షి . సర్వశుభలక్షణ 
సంపన్నుడు . కుక్షి  పుత్రుడు  వికుక్షి  మహావీరుడు . 
వికుక్షి  కుమారుడు  బాణుడు  మహాతేజస్వి ,ప్రతిభాశాలి ,
ఆ బాణుని  సుతుడు అనరణ్యుడు అతడు  మహాయశస్వి .సత్పురుషులలో శ్రేష్ఠుడు . అనరణ్యుడు పరిపాలించునపుడు  అనావృష్టి గాని ,కరువుకాటకములు గాని, చోర భయములు  గాని  లేకుండెను . 
అనరణ్యుడి పుత్రుడు మహాబాహువైన పృథుమహారాజు
పృథుమహారాజు  కుమారుడు  త్రిశంకుడు .  త్రిశంకమహారాజు  సత్య వచనుడు . వీరుడు . విశ్వామిత్రుని  తపః  ప్రభావమున త్రిశంకప్రభువు  సశరీరంగా స్వర్గమునకు వెళ్లెను .
 త్రిశంకుని సుతుడు ధుంధుమారుడు . అతడు మిక్కిలి ప్రసిద్దుడు . ధుంధుమారుని  కుమారుడు  యువనాశ్వుడు . 

సర్వశుభలక్షణ సంపన్నుడైన  మాంధాత  ఈ యువనాశ్వుని  కుమారుడు . 
మాంధాత  కుమారుడు  సుసంధి . అతడు  మహాతేజస్వి . ధ్రువసంధి , ప్రసేనజిత్తు  అనువారు సుసంధి తనయులు . యశస్విఐన  ధ్రువసంధి  యొక్క    కుమారుడు  భరతుడు .  అతడు శత్రుభయంకరుడు . 
మహాబాహువైన  భరతుని వలన  ఆసితుడు  అనువాడు జన్మించెను . అతనికి  సూరులైన  హైహయులు , తాలజంఘులు ,  శశిబిందువులు అయిన  సామంతరాజులు  శత్రువులైరి . వారినందరిని  ఎదుర్కొనుటకు  సేనావ్యూహమును  రచించి  ,యుద్ధమున  స్థిరముగా నిలిచినను శత్రువు ధాటికి  తట్టుకొనలేక  యుద్ధమున  ఆసితుడు  పరాజితుడయ్యెను .  పిమ్మట అతడు  హిమవత్పర్వతము  చేరి  ఏకాగ్రచిత్తుడై  భగవధ్యానమున  మునింగెను .  అప్పటికే అతని  ఇరువురు భార్యలు గర్భవతులై ఉండిరి .  వారిలో ఒకామె  సవతి అయిన  కాళింది  గర్భవిచ్ఛిత్తికై  ఆమెకు  గరళమును  ఇచ్చెను . భృగు వంశపు వాడైన చ్యవన మహర్షి హిమవత్పర్వతము మీద నివసించుచుండెను . ఆసితుని  భార్య ఐన కాళింది  ఆమహర్షి కడకేగి  ఆయనకు నమస్కరించెను . అప్పుడాయన  పుత్రసంతానం  కోరుకొనుచున్న ఆమెతో  "  ఓ  దేవీ ! నీకు పుత్రుడు కలుగును . అతడు  ధర్మాత్ముడు , సుశీలుడు ,మహాత్ముడై  లోకమున వాసి కెక్కును . అతడు శత్రువులను రూపుమాపి వంశకర్త అగును " అని ఆశీర్వదించెను . అంతట ఆమె సంతసించి  ఆ మునికి ప్రదక్షణా పూర్వకముగా  నమస్కారము చేసి  తన భవనము  చేరి  కొన్నాళ్ల పిదప  ఒక పుత్రుని గనెను .  అతడు తామరరేకులవంటి కనులు కలిగి  బ్రహ్మతేజస్సుతో  వెలుగొందుచుండెను . కాళిందీదేవి  గర్భవిచ్చిత్తికి  ఆమెకు గరళ  ప్రయోగము  చేసినను ఆమెకు కలిగిన బాలుడు గరళముతోనే  జన్మించినందున అతనికి  సగరుడు  అని పేరు ఏర్పడెను . 
అసమంజుడు  సగరమహారాజు పుత్రుడు . అతడు పాపకర్మల చేయుచుండట వల్ల  సగరుడు అతనిని దేశము నుండి బహిష్కరించెను . 
అసమంజుని కుమారుడు   అంశుమంతుడు . పరాక్రమశాలి . అసుమంతుని తనయుడు దిలీపుడు . అతనికుమారుడు  భగీరథుడు . 
భగీరథునికి  కకుత్ స్థుడు  జన్మించెను . అందుచే  అతని తరువాత ఆ వంశం  వారికి  కాకుత్ స్థులు  అని పేరు వచ్చెను . 
కాకుత్ స్థుని  కుమారుడు  రఘుమహారాజు . ఆ  మహాపురుషుని వలన ఈ వంశము వారు  " రాఘవులు " అని  వ్యవహరింపబడిరి . రఘు మహారాజు  సుతుడు కల్మాషపాదుడు .  అతడు పెరిగి పెద్దవాడై  శాపవశమున   నరమాంస  భక్షకుడయ్యెను . అతడే సౌదాసుడనే  పేరుతో  ప్రసిద్ధికెక్కెను . 
కల్మాష పాదుని  కుమారుడు  శంఖణుడు .  అతడు గొప్ప పరాక్రమశాలి అయినను  యుద్ధమున అతడు ,అతని సైనికులు నశించిరి . 
శంఖణుని  పుత్రుడు  సుదర్శనుడు . అతనికుమారుడు  
అగ్నివర్ణుడు . అతనివలన  శీఘ్రగుడు  జన్మించెను . శ్రీఘ్రగుడు  సుతుడు   మరువు .  అతని  కుమారుడు ప్రశుశ్రుకుడు . అతని పుత్రుడు మహాతేజస్వి  అయిన  అంబరీషుడు .  
అంబరీషుని కుమారుడు  నహుషుడు . అతడు  సత్య పరాక్రముడు . నహషుని  పుత్రుడు నాభాగుడు . పరమధార్మికుడు .  నాభాగునకు  అజుడు , సువ్రతుడు  అను కుమారులు కల్గిరి . 
అజుని కుమారుడే   దశరధ మహారాజు . అతడు ధర్మాత్ముడు .  దశరథమహారాజు  జ్యేష్ఠపుత్రుడు  శ్రీరాముడు . 
.......... 

పెద్ద  బాలశిక్ష  చదినట్లు  ఉంది కదూ ... 
అయితే  పసిపిల్లలు  అయిపోయారన్నమాటే !
పసిపిల్లలు  పరమాత్మునితో సమానం 
స్వస్తి .



 శ్రీ  అన్నమాచార్యుల వారి ఈ అద్భుత కీర్తన  క్రింద ఇచ్చిన లింక్  పై క్లిక్ చేశి  ఆధ్యాత్మికానందాన్ని 
 పొందండి . 

Deva Devam Bhaje




****************************************


శ్రీరాఘవం  దశరాద్మజమప్రమేయం 
సీతాపతిం  రఘుకులాన్వయరత్నదీపం 
ఆజానుబాహుం  అరవిందదళాయతాక్షం  రామం నిశాచరవినాశకరం  నమామి  . 
**************************************** 






  


Sunday, 7 August 2016





తర్పణం .  

గోదారమ్మ తల్లి  అంత్య  పుష్కరాలు  క్రిందటి నెల  31 వ  తేదీ నుండి  మొదలు అవడంతో  రాజమహేంద్రవరం  నగరం  పుష్కర  శోభ  సంతరించుకొంది . గోదావరి నది కి  వడ్డాణాలుగా   ఉన్న వంతెనలు   రంగు  రంగుల  విద్యుత్ దీప కాంతులతో  అలంకరించబడి  దేదీపమాన్యంగా  వెలిగి పోతున్నాయి . వాటి కాంతులు నదీ  జలాల్లో  ప్రతిఫలించి  వింత శోభని  కలిగిస్తున్నాయి .   కృష్ణా నది  పుష్కరాలు  దగ్గిర పడటంతో  అధికారులు  ఆశించినంత  భక్తసంద్రం   లేదు . దాదాపు అన్ని ఘాట్ల వద్ద  జనం  పల్చగా ఉన్నారు .  ఈ నెల  11 వ తేదీన  అంత్య పుష్కరాలు  పరి సమాప్తం . చివరి రెండు రోజులు  ఒడిశా , రాజస్థాన్ , ఉత్తర రాష్ట్రాల నుండి  పుణ్య స్నానాలు  ఆచరించే  భక్తుల తాకిడి  అధికంగా ఉండవచ్చని  అంచనా . 
.... 
సూర్యోదయానికి  ముందరే నిద్ర లేచి  దంతావధానం కానిచ్చి  పొగలు  కమ్మే  ఫిల్టర్  కాఫీ  లానులో  పచార్లు చేస్తూ గాని , పై డాబా  మీద  తిరుగుతూ గాని  ఆస్వాదించడం  నా దైనిక చర్య .
 నాలుగు  రోజులనుండీ  నా దైనిక చర్య  ఆస్వాదించడం  కష్టం గా మారింది . 
కారణం . 
నే  కాఫీ  కప్పు పట్టుకు బయటికి  రాగానే  అంతవరకూ చుట్టుపక్కల ఎక్కడా  కనిపించని  కాకులు  ' కావ్ ... కావ్ ' అని అరుచుకొంటూ  నాకు సమీపంగా గోడల మీద రివ్వుమని  వాలడం మొదలైంది .
 మా ఇంటి ప్రహారీ  చుట్టూ  నీడ కోసమని నేను ఎప్పుడో నాటిన మొక్కలు పెరిగి  వృక్షాలు గా ఎదిగాయి . వాటి కొమ్మలు  విశాలంగా  పరచుకొని  చల్లటి నీడని పరుస్తున్నాయి .   చెట్టు కొమ్మల్లో  పక్షులు  గూళ్ళు  కట్టుకున్నాయేమోనన్న  అనుమానం కలిగింది .  ప్రతి వృక్షం  పరిశీలనగా చూసాను . ఒక్క పక్షి గూడు  కూడా  కాన రాలేదు .
 ఆశ్చర్యం  వేసింది .    
 కాకి గోలకి   నా  కాఫీ  ఆస్వాదించే  చర్యకి  ఆటంకం   కలిగింది . 
సాయంత్రం పూట  పోనీ  డాబా మీదకి  వెళ్లి  కాఫీ త్రాగుదామని  ప్రయత్నిస్తే  అప్పుడూ  కాకులు  ప్రత్యక్షం .
...  
రెండ్రోజుల క్రితం మాటల సందర్భంలో  వేదం చదువుకున్న  మిత్రునితో నా అనుభవం చెపితే  చిన్న నవ్వు నవ్వాడు . 
'నీ నవ్వు కాదు నాకు కావలిసిన  జవాబు . దీనికి తర్కం ఏమిటి ?' అని నిలదీసాను . 
భుజం మీద ఉత్తరీయం సర్దుకొని ' వాయస రూపం ' అన్నాడు ముక్త సరిగా . 
'అంటే ' అన్నాను  అర్థంకాక. 
'పుష్కరకాలం . పితృదేవతలు  నీ ధర్మాన్ని గుర్తు  చేస్తున్నారు ' అన్నాడు తాపీగా . 
అప్పుడు నాకు అర్థమైంది . 
... 
మా  కుటుంబ  బ్రహ్మ గారికి   ఫోన్   చేశి  కార్యక్రమం  నిశ్చయం  చేసాను .  మా అమ్మ గారు కాలం చేసిన  తిథి షష్టి  అవటంతో  ఈ రోజున  గోదావరీ తీరం  వద్ద  ఏర్పాట్లు చేయమని  చెప్పాను   బ్రహ్మ గారికి   . ఉదయం  ఆరు గంటలకి గోదావరి గట్టు వద్ద   ఉండాలని వారి  ఆదేశం . 
... 
ఉదయం  ఆరు గంటలు . 
తూర్పున తెల్ల వారింది . 
బ్రహ్మ గారు   చెప్పిన  సమయానికి   శ్రీ మార్కండేయస్వామి  ఆలయానికి  ఎదురుగా ఉన్న శ్రీ పద్మావతి  ఘాటు వద్దకు చేరుకున్నాను .
ప్రభాత వేళ .  సోమవారం కావటం మూలాన 
 శివాలయంలోంచి  లౌడ్ స్పీకర్ల  నుండి   ఓం కార నాదం  మంద్రంగా  వినిపిస్తోంది .  పరిసరాలు అన్నీ భక్తి  భావం తో  నిండుగా ఉన్నాయి . 
... 
నదీ పరివాహాక   ఎగువ ప్రాంతాల్లో  ఈ మధ్యన బాగా వర్షాలు కురియడంతో  గోదావరిలో  వరద  చేరి  నీరు  ఎరుపు వర్ణంగా మారింది .    ఎరుపు  రంగు చీర కట్టుకున్న పల్లె పడచులా  గోదారమ్మ తల్లి  తుళ్ళి తుళ్ళి పడుతోంది . సాగర సంగమం  కోసం  ఆతృతగా  ముందుకు ప్రవహిస్తోంది  గోదారమ్మ . 
... 
పుణ్య స్నానం చేయటానికి  గోదావరి లోకి  దిగాను . ప్రవాహ వేగానికి  పట్టు దొరకటం కష్టం గా ఉంది . సమీపంలో  యువ దంపతులు  స్నానం చేస్తున్నారు . ఆమె  తన్మయత్వం తో   గోదాట్లో మునకలు వేస్తోంది . ఆమె భర్త   మెట్ల మీద   చిరు  ప్రాయంలో ఉన్న కుమారుడిని  వడిలో  ఉంచుకొని  వాడి  చిన్ని చిన్ని చేతులతో  భార్య మీద  నీళ్లు  చిలకరిస్తూ  ఆటలాడిస్తున్నాడు .  ప్రవాహ వేగం  తట్టుకోలేక  పోతున్న నన్ను చూశి  ఆమెని నాకు చేయి అందించమని చెప్పి మందహాసం చేశాడు .  పుణ్యాత్మురాలు . హస్తం అందించి  గోదాట్లో నేను  మూడు మునకలు వేయడానికి సహాయ పడింది . మూడు మునకలూ   వేశాక   నదిలో  కుదురుగా నించోడానికి  పట్టు  దొరికింది .
 బ్రహ్మ గారు  మంత్రాలు చదువుతూ కార్యక్రమం ప్రారంభించారు . ముందుగా నదీ స్మరణ . ఆ తర్వాత పుష్కరుని కి  భక్త్యాఅంజలి . తూర్పు అభిముఖంగా  నించొని  ఆదిత్యుని  ద్వాదశ నామాలు  వల్లిస్తూ  అంజలి ఘటిస్తూ  తర్పణం . దాని తర్వాత  ఉత్తర దిక్కునకు తిరిగి సప్త మహాఋషులకూ తర్పణం . ఇక పితృ దేవతలకు  తిలా తర్పణం  కావించడానికి  గట్టున  కూచోబెట్టి  దర్భలతో  తయారు చేసిన  పవిత్రం  ఉంగరం వేలుకి  ధరింపచేసి  తూర్పు అభిముఖంగా  కూర్చోమని  సంకల్పం చేయించారు  బ్రహ్మ గారు . తర్వాత  దక్షిణం  దిక్కుకి  తిరిగి  బ్రహ్మ గారు మంత్రం చెబుతూ ఉంటే  పేరు  గోత్రనామం  చెబుతూ పితృ దేవతలందరికీ  తిలా తర్పణం  చేయటం జరిగింది . అలా సంకల్పించిన కార్యక్రమం  నియమ నిష్టలతో ముగిసి సంతోషాన్ని కలిగించింది  . బ్రహ్మ గారి  ఆశీర్వచనం పొంది కృతజ్ఞతలు  తెలిపాను .  రోడ్డు మీదకు చేరడానికి   బ్రహ్మ గారు  చేయూత  ఇస్తానంటే  .... కాస్సేపు  ఒడ్డునుండి  గోదారమ్మ తల్లి అందాలు  చూస్తానని
 ఆగిపోయాను . 
 అప్పుడు అనిపించింది . 
పుణ్య జీవ నదులు   అయిన   గోదారమ్మ , కృష్ణవేణి  అఖండ రూపంలో  ప్రవహిస్తున్న  తెలుగు   నేల తల్లి   మీద జీవించడం  పూర్వ జన్మ సుకృతం అని .  త్రేతా యుగంలో  కోందండ రాముడు  , సీతమ్మతల్లి , లక్ష్మణ స్వామి తో కలిసి  నడయాడిన నదీ తీరం గోదావరి  అని  జ్ఞప్తికి    వచ్చి అనిర్వచనీయమైన  ఆనందం   కలిగింది  .  
... 
 మామూలు  దుస్తులు  ధరించి  ,రాగి చెంబూ , ఉద్దరిణి ,తతిమ్మా సామాగ్రీ  సర్దుకొని బయలు దేరబోతూ ఉంటే  గట్టు మీద కూర్చొన్న ఓ వ్యక్తి  ' మీదే ఊరు ? ' అని పలకరించాడు .  " ఈ ఊరే ! ' అన్నా . 
'బ్రాహ్మలా ! ' అన్నాడు ఆయన . 
 "అవును " అన్నా . 
నమస్కరించాడు . ఆయన చర్యకి విస్తు పోయాను . 
ఇంకా ముందుకి వెళుతూ ఉంటే  బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న  పండితుడు వేదమంత్రాలు వల్లె వేసుకుంటూ  దర్శన మయ్యాడు . నన్ను చూసి  మందస్మితం  చేసి ' శివోహం ' అని సాగిపోయాడు . 
'శివోహం ' అన్నా నేను . 
ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటే  బాగా గెడ్డం పెరిగి  మాసిన  దుస్తులతో ఉన్న యువకుడు ఎదురయ్యాడు . 
' సార్ ' అని పలకరించాడు . 
'ఏమి  చేశారు సార్ ! గోదారొడ్డున ' అన్నాడు . 
' తర్పణం '  అని జవాబు ఇచ్చా . 
 'అంటే '
' పితృదేవతలని  స్మరించుకొని  దోసిలితో వారికి నీళ్లు గోదారమ్మ వడిలో వదలటం   లాంటి  కార్యక్రమం .'
ఆ యువకుని కళ్ళల్లో  నీళ్లు చిమ్ముకొచ్చాయి . 
' సార్ . నేను చాలా పాపిష్టిని . వ్యసనాలకు బానిసని అయి  తల్లి తండ్రులను పట్టించుకోలేదు . ఈ నాడు నాకు వారు కావాలని వస్తే  ఈ లోకంలో లేరు .  తర్పణం ఇస్తే  వారు నన్ను క్షమిస్తారా  !' అన్నాడు . 
'తప్పకుండా ' అన్నా . 
అది వినగానే ఆ యువకుడు చర చరా గోదావరి లోకి  దిగి  మూడు మునకలు  వేసి  దోసిలి తో  " తర్పణం " కావించడం కనిపించింది  .  
అది గమనించిన గోదారమ్మ  మరింత ఉత్సాహంగా ఉరకలు వేసింది . 
ఇంటికి చేరుకునేసరికి  రమారమి  ఉదయం ఎనిమిది గంటలు అయ్యింది . 
కాఫీ  త్రాగుతూ పై డాబా మీదకు వెడితే  'వాయసాలు ' కనిపించలేదు . 
 జీవితంలో  కొన్ని  అనుభవాలు  ఊహకు  అందవు . 

ధర్మో  రక్షతి రక్షతః 

*********************************************************************************



ఆపద్ధర్మం  ఆపనిమ్మిత్తంగా వచ్చింది.  ఆ ఆపద తొలగగానే  మానవుడు సాధారణ  ధర్మాచరణను  స్వీకరిస్తాడు. 
                                           శ్రీ శ్రీ  శ్రీ  చంద్రశేఖరేంద్ర  సరస్వతీ  శంకరాచార్య  స్వామి.  

******************************************** 




   












Saturday, 6 August 2016






స్నేహమేరా   జీవితం .

... 


ఫ్రెండ్ షిప్  డే  సందర్భంగా  మిత్రులు  అందరికీ  శుభాకాంక్షలు  తెలుపుతూ  మనసులోని  కొన్ని మాటలు .  
మనిషి  తన జీవితం లోతుల్లోకి  తొంగి చూసుకొని  ఆలోచనా సరళిని  విశ్లేషించుకుంటే    ఒక ఆశ్చర్యకరమైన  విషయం  గోచరిస్తుంది .. తన  ఆలోచనల లో  మనిషికి    శత్రువు  ఎక్కువగా  గుర్తుకు  వస్తాడు   గాని  మిత్రులు, సన్నిహితులు   తక్కువగా  గుర్తుకొస్తారు . ఇది మన  ఆలోచనా బలహీనత  అని  నా  మనో భావన .  .  
... 
లక్మీనారాయణ , నేను  ఇంజనీరింగ్  కలిసి చదువుకున్నాం .   నాకు చాలా మంచి  మిత్రుడు .  లక్మీనారాయణ  సొంత ఊరు విజయనగరం . స్వచ్ఛమైన  పాల లాంటి  మనసు . అమాయకంగా  కనిపించే  
మొఖం . స్నేహానికి  విలువని  ఇచ్చే మనస్తత్వం . కలుపుగోరు  మనిషి . మా ఇద్దరి అభిప్రాయాలు  దాదాపు  ఒకేలా ఉండటంతో  మా స్నేహం వికసించింది . 
  ఇంజనీరింగ్  డిగ్రీ పూర్తి అయ్యాక  ఉద్యోగాల్లో 
చేరిపోయాం . వేర్వేరు చోట్ల ఉద్యోగ  విధులు  కావటం వల్ల  విడిపోవడం  తప్పలేదు. స్నేహబంధం  మాత్రం  పదిలంగానే  ఉంది . 
... 
అలా విడిపోయిన  మిత్రుడు  లక్మీనారాయణ  ఢిల్లీ  లో నేను  CWPC లో  ఉద్యోగంలో  చేరినపుడు  సహోద్యోగిగా కలిశాడు . అప్పుడు నా ఆనందానికి అవధులు  లేవు . నే ఢిల్లీ  వెళ్లిన కొత్తలో  లక్మీనారాయణ  నాకు  అద్దె ఇల్లు  వెతకటంలోనూ,  తతిమ్మా విషయాలలో అందించిన  సహాయ సహకారాలు  ఎన్నటికీ మరచి పోలేనివి . 
లక్మీనారాయణకి భార్యా  బిడ్డలంటే పంచప్రాణాలు . బిడ్డలు ఇద్దరూ కొడుకులే . చాలా చిన్న వయసు .  ఇద్దరు పిల్లల కీ .ఆర్ధికంగా  కొంచెం  ఇబ్బంది  అయినా  పిల్లలు  పైకి రావాలని  మంచి  స్కూళ్లలో చేర్పించాడు . 
ఉద్యోగ బాధ్యతలతో  కాలం  సాఫీగా  గడిచిపోతూ ఉండగా  అకస్మాత్తుగా  అనారోగ్యం బారిన పడ్డాడు  లక్మీనారాయణ . స్నేహానికి విలువనిచ్చే లక్మీనారాయణ  జబ్బుకు గురి అవడం   మిత్రులందరినీ కలచివేసింది . 
... 
న్యూఢిల్లీ . 
వెల్లింగ్డన్  హాస్పిటల్ . 
మిత్రుడు లక్మీనారాయణ  నీరసంగా పడుకున్నాడు  ఆసుపత్రి బెడ్ మీద . 
పెద్ద ప్రేవుల్లో  బ్లాక్ ఉందని  అంతకు కొద్ది  గంటల క్రితమే పెద్ద ఆపరేషన్  చేశారు లక్మీనారాయణకి . సుమారు మూడు అడుగుల ప్రేవు  తీసివేసి . నేను వెళ్లేసరికి లక్మీనారాయణ  ముక్కు లోంచి , నోట్లోంచి , కడుపులోనించి  రకరకాల  గొట్టాలు వ్రేళ్ళాడుతున్నాయి . ఇక చేతులకి  సెలైన్ , గ్లూకోస్  గొట్టాలు సరే !. బితుకూ  బితుకూ  మంటూ పక్కనే  కూర్చున్నారు  లక్మీనారాయణ  భార్యా పిల్లలూ.  పరిస్థితి  చూసి చలించిపోయాను . 
హాస్పిటల్ లో  లక్మీనారాయణ కి సహాయంగా ఉండటానికి  సహోద్యోగులమంతా  షిఫ్టుల  ప్రకారం  డ్యూటీలు  వేసుకున్నాం .  పగలు,  మధ్యాన్నం , రాత్రి డ్యూటీలు . ఒక్కొక్క రోజు ముగ్గురు చొప్పున . 
ఆపరేషన్ తర్వాత లక్మీనారాయణ  కొంచం  కోలుకుంటున్నట్లు  అనిపించింది . నేను డ్యూటీ కి వెళ్లేసరికి  లక్మీనారాయణ  బెడ్ మీద కూచొని  భార్యా పిల్లలతో మాట్లాడుతున్నాడు . నన్ను చూడగానే చిరు నవ్వు నవ్వుతూ  ' రా .. రా  గురూ ' అన్నాడు . 
' ఎలా ఉంది ? ఈ రోజు ' అని కుశలం  అడిగాను . 
'బానే ఉంది ' అన్నట్లుగా సౌజ్ఞ  చేశాడు . 
చాలా విషయాలు మాట్లాడుకున్నాం . ఆఫీస్ లో పని ,
రాజకీయాలు , హాస్పిటల్ సిబ్బంది  గురించి . అలా మాట్లాడుతూ ఉండగా నా డ్యూటీ  టైం  అయిపోయింది . తర్వాత నైట్  డ్యూటీ  లక్ష్మణరావు  ది . 
'వస్తా.. గురూ ' అన్నా లక్మీనారాయణ  తో . 
'అప్పుడేనా.. ' అన్నాడు లక్మీనారాయణ . 
చిరు నవ్వే జవాబుగా  ఇంటికి బయలుదేరాను . మర్నాడు ఉదయమే నాకు హాస్పిటల్ లో  పగలు షిఫ్ట్ . లక్ష్మణరావుని  రిలీవు  చేయాలి . ఇంటికి పోయి విశ్రమించాను . హాయిగా  నిద్ర పట్టింది . 
... 
ఉదయాన్నే ప్రక్క పోర్షన్ లో ఉండే  యూ .పి  (U.P) వాళ్ళనుండి ' మీకు ఫోను వచ్చిందని ' పిలుపు. వెళ్లి ఫోను అందుకున్నా . అటువైపు  గొంతు  లక్ష్మణరావుది.    ' గురూ .. నువ్వు  వెంటనే  హాస్పిటల్ కి వచ్చెయ్యి . రాత్రి  కండిషన్ సీరియస్ అయితే  లక్మీనారాయణ ని 
ఐ .సి .యూ (ICU ) కి  మార్చారు ' అని లక్ష్మణరావు  కంగారు  పడుతూ చెప్పాడు .  
'అలాగే ' అని ఫోను పెట్టేసి  ఆదరా బాదరా  బట్టలు వేసుకొని  విల్లింగ్డన్ హాస్పిటల్  కి  చేరుకున్నాను . 
లక్ష్మణరావు  ICU  వార్డ్ బయట గాభరాగా పచార్లు చేస్తున్నాడు . నన్ను చూడగానే  'హమ్మయ్య ! వచ్చావా ! గురూ .. రక్షించావ్ ' అన్నాడు లక్ష్మణరావు . 
'ఏమిటి ? ఏమయ్యింది ? ' ప్రశ్నించా . 
'రాత్రి పది గంటలకి  ఉన్నట్లు ఉండి  లక్మీనారాయణ  మూలుగుతూ ఉంటే  డాక్టర్ ని పిలుచుకొని వచ్చాను . డాక్టర్ చూసి  "ఎమర్జెన్సీ . ICU  కి  మార్చండి  అన్నాడు " అని చెప్పాడు లక్ష్మణరావు . 
'అదేమిటి ! నిన్నటి వరకు బాగానే కోలుకుంటున్నాడు కదా !' అన్నా . 
'  లోపల  బ్లీడింగ్ అవుతోందిట .. అది అరి కట్టకపోతే  ప్రాణానికే  ప్రమాదం అన్నారు' అని చెప్పాడు  లక్ష్మణరావు . 
విషయం తెలుసుకొని మిగతా మిత్ర బృందం హాస్పిటల్ చేరుకొంది . ఒకరి తర్వాత ఒకరు ICU  లోనికి వెళ్లి లక్మీనారాయణ ని   చూశి  వస్తున్నారు . నా వంతు 
 వచ్చింది . నేను వార్డు లోపలి కి  వెళ్లి లక్మీనారాయణ పడక వద్ద  నుంచున్నాను . 
నన్ను  చూసి నీరసంగా నవ్వాడు  లక్మీనారాయణ . 
'ఎలా ఉందీ ' అడిగా . 
'చాలా బాధగా  ఉంది గురూ ... ' బదులు చెప్పాడు .  
'నీతో  మాట్లాడాలి ..ఇలా  పక్కన  కూర్చో ' అన్నాడు   ఆ తర్వాత . 
'చాల్లే !   నీకు ఏ ప్రమాదం లేదు . ధైర్యంగా  ఉండు ' అన్నా. 
ఈలోగా  లక్మీనారాయణ  భార్య పండ్ల రసం తెచ్చింది . 'వద్దు ' అన్నట్లుగా  చేయి  ఊపాడు  లక్మీనారాయణ . 
బలవంతంగా తాగించాం . వెంటనే  పండ్ల రసం తో  పాటు రెండు  గళాసుల  రక్తం  బయటికి  వచ్చేసింది . లక్మీనారాయణ  కళ్ళ  లో నీరు సుడులు  తిరుగుతోంది . చూసి తట్టుకోలేక బయటికి వెళ్లిపోయింది లక్మీనారాయణ  భార్య . 
అప్పుడు నా చేయి గాఠిగా పట్టుకున్నాడు
 లక్మీనారాయణ . 
పట్టుకొని ' చాలా అధైర్యంగా  ఉంది గురూ ... బతకనని . మా వాళ్ళని  చూసినప్పుడల్లా గుండె తరుక్కుపోతోంది . నా తర్వాత వాళ్ళ బతుకు చిందర వందర అయిపోతుందేమో  అన్న భయం నన్ను తొలిచేస్తోంది ' అన్నాడు . 
'ఛ ... ఇప్పుడు  అవేం  మాటలు . ఊర్కో ...' అని సర్ది చెప్పాను . 
కాస్సేపు  మౌనం . 
నిశ్శబ్దాన్ని  చీలుస్తూ ' నువ్వో  మాట నాకు ఇవ్వాలి గురూ .. 'అన్నాడు లక్మీనారాయణ . 
ఏమిటన్నట్లు  చూశాను . 
'నేను  బతికి  బట్ట కట్టే నమ్మకం లేదు . నా మరణాన్ని మా వాళ్ళు తట్టుకోలేరు . వారిని ఓదార్చ గలవా ! ' అన్నాడు  లక్మీనారాయణ . 
నాకు బదులు ఇవ్వడానికి మాటలు రాలేదు . లక్మీనారాయణ  నా కేసి  తదేకంగా చూస్తున్నాడు . తర్వాత మళ్ళీ ఇలా అన్నాడు .' వాళ్లకు ఏదైనా సహాయం , సహకారం  అవసరమైతే  అందచేస్తావా ! '
'తప్పకుండా ' అన్నా . 
చేయి చాపాడు . చేతిలో చేయి వెయ్యి అన్నట్లుగా . 
చేయి వేసాను . 
ఆ తర్వాత కొన్ని  నిమిషాలకే  భాధ  భరించలేక కోమా  స్థితికి  జారిపోయాడు  లక్మీనారాయణ . మరి కాసేపట్లో
  మృత్యువు  ఒడిలోకి  ఒరిగి పోయాడు లక్మీనారాయణ .
మిత్రులమంతా  భోరుమన్నాం . 
లక్మీనారాయణ  భార్య  స్పృహ  తప్పి పడిపోయింది . 
పిల్లలు  యిద్దరూ  బితుకూ  బితుకూ  చూస్తున్నారు . జరిగినది ఏమిటో అర్థం కాక . 
... 
మిత్రులు, సహోద్యోగులు  అందరినీ  కూడగట్టుకొని  గూడు చెదిరిన  లక్మీనారాయణ  కుటుంబానికి  సహాయ  సహకారాలు అందజేసాను . 
మిత్రునికి ఇచ్చిన  మాట నిలబెట్టుకున్నాను . 
అప్పుడు నా వయసు  మూడు పదులు దాటి నాలుగు సంవత్సరాలు . 



****************************************
 ఈ  దీర్ఘ  జీవితంలో  నేను సంపాదించుకున్నది  ఏమైనా  ఉందీ  అంటే  అది   వెల  కట్టలేని  లెక్కలేనంత  మంది  మంచి      మనసున్న మిత్రులు . వారందరినీ  ఆ   సీతారాముడు  దయతో చూడాలని  కోరుకుంటూ ........ 
 మిత్రుడు
యర్రమిల్లి  జగత్పతి .
*******************************************