కాలం మింగేసిన బాల్యం
(04)
Illustration by :Baby Aanya , California.
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
మాష్టారు తాళం చెవుల గుత్తి దెబ్బలకి పరుగెత్తి ఇంటికి పారిపోయి వచ్చిన మాకు అప్పటివరకు ఎల్లావు దూడతో ఆడుకుంటున్న రాధమ్మ పరుగున వీధి లోకి వచ్చి 'బే ...బే ...బెబ్బె .. బే ' అని వచ్చీ రాని మాటలతో కేరింతలు వేస్తూ ఎదురు వచ్చింది .ఆ పళాన నిదానంగా వీధిలో చూస్తే మా ఇంటికి కాస్త అసింటా మోటారు కారు ఆగి ఉంది . ఇంటి లోనికి వెళ్ళగానే ' బ్ .. బే .. బెబ్బే .. బే ' లకు సమాధానం దొరికింది . మండువాలో అమ్మమ్మ (రంగనాయకమ్మ ) తాత సత్యం( బోడపాటి సత్యనారాయణ ), అమ్మా , నాన్న తో మాటలాడుతూ కనిపించారు . అమ్మమ్మని చూడగానే పరుగెత్తి వాటేసుకున్నాం నేనూ, రాజప్ప. ఆ తర్వాత 'బేర్... బేర్ ' అన్నాం ఇద్దరమూ .
'ఏంటమ్మా ! ఏమి జరిగింది ! ' అని అడిగింది అమ్మమ్మ . మమ్మల్ని ఇద్దరినీ చెరో వైపున చేరదీసి ఆప్యాయంగా నిమురుతూ . మా చేతులు మండ్ర గబ్బల్లా వాచి పోయి ఉన్నాయి.
"ఏం జరిగిందిరా ? ' అంది అమ్మమ్మ .
మాష్టారు కొట్టిన సంగతి చెప్పాం .
ఆవకాయ ముక్కల విషయం దాచేసి .
ఈ సంఘటన మా బాల్యాన్ని ఊహించని మలుపు తిప్పింది .
తాత సత్యం గారికి ఆంధ్రా ఇన్సూరెన్స్ కంపినిలో బరంపురం పట్టణంలో బ్రాంచ్ మేనేజెర్ గా ఉద్యోగం . ఆయన ఉద్యోగ పరిధి అటు కటకం నుండి ఇటు అనకాపల్లి దాకా విస్తరించి ఉండేది .
అనకాపల్లి ఉద్యోగ రీత్యా క్యాంపు వచ్చిన తాత సత్యం గారు దగ్గేరే కదా అని కూతుర్నీ , అల్లుడిని చూసిపోదామని అమ్మమ్మ తో కలిసి వంటిమామిడి వచ్చారు . తాత, అమ్మమ్మ వచ్చేసరికి మా అవతారం అలా ఉంది . పల్లెటూర్లో మా చదువులు వానాకాలం చదువులు అని గ్రహించిన తాత సత్యం గారు నన్నూ ,రాజప్పని తన కూడా తీసుకొని వెళ్తానన్నాడు .
అమ్మా నాన్నా సరే అన్నారు .
దూడలతో పాటు ఇల్లంతా ' బే ... బే .. బెబ్బే .. బే ' అని తిరుగుతూ తమతో రాధమ్మ సందడిగా ఉంటుందన్న ధైర్యం తో.
అమ్మమ్మ రంగనాయకమ్మ ఉన్నవ
...
అనకాపల్లి ఉద్యోగ రీత్యా క్యాంపు వచ్చిన తాత సత్యం గారు దగ్గేరే కదా అని కూతుర్నీ , అల్లుడిని చూసిపోదామని అమ్మమ్మ తో కలిసి వంటిమామిడి వచ్చారు . తాత, అమ్మమ్మ వచ్చేసరికి మా అవతారం అలా ఉంది . పల్లెటూర్లో మా చదువులు వానాకాలం చదువులు అని గ్రహించిన తాత సత్యం గారు నన్నూ ,రాజప్పని తన కూడా తీసుకొని వెళ్తానన్నాడు .
అమ్మా నాన్నా సరే అన్నారు .
దూడలతో పాటు ఇల్లంతా ' బే ... బే .. బెబ్బే .. బే ' అని తిరుగుతూ తమతో రాధమ్మ సందడిగా ఉంటుందన్న ధైర్యం తో.
...
మర్నాడే మా ప్రయాణం .
ఉదయాన్నే లేచిపోయి తయారైపోయాం .
నేనూ, రాజప్ప .
కారులో ప్రయాణం అంటే భలే సరదా వేసింది.
నేను రాజప్ప గౌను వేసుకొని ముందుగా రెడీ అయిపోయాను .
రాజప్ప పరికీణీ మీద నా పొట్టి చొక్కా వేసేసుకుంది .
కారు ఎక్కేముందు నన్ను దగ్గరగా తీసుకొని అమ్మమ్మ తో అంది అమ్మ
ఇలా ...
ఇలా ...
'నిండా ఏడేళ్ళు వీడికి . బెంగ పెట్టుకుంటాడేమో నే '.
ఈ మాట తో ఆలోచనలో పడిన అమ్మమ్మ 'సరేలే ! ఈసారికి వీడిని ఉంచేద్దాం ' అని రాజప్పని కారులో తీసుకొని వెళిపోయింది .
దుమ్ము రేపుతూ వెళుతున్న కారు కేసి
చూస్తూ నిలబడిపోయాను ఒంటరిగా .
అమ్మ అన్న మాట నా బెంగ విషయం ముమ్మాటికీ సత్యం .
అయితే బెంగ అమ్మ గురించి కాదు .
మా ఊరి బడి లో మేష్టారి తాళం గుత్తి వడ్డన ఇక నే ఒక్కడినే భరించాలన్న బెంగ.
మరుచటేడు అమ్మమ్మ వచ్చి నన్ను కూడా తీసుకొని వెళ్ళింది .
నేను వెళ్ళేటప్పుడు శృంగారం అప్యాయం గా రెండు ఆవకాయ ముక్కలు బహుమతి గా ఇచ్చి వీడ్కోలు చెప్పింది .
...
అలా జరిగింది. మా చదువుల
ప్రస్థానం . పల్లెటూరు బడి నుంచి పట్నవాసం స్కూళ్ళ వైపు . మా తాత సత్యనారాయణ బోడపాటి వంశస్థుడు.ఆయన సహ ధర్మచారిణి రంగనాయకమ్మ.
అమ్మమ్మ రంగనాయకమ్మ ఉన్నవ
వారి ఆడ పడచు . మా తాత గారి అమ్మమ్మ ల వద్ద మా సాహచర్యం సాహిన్నిత్యం నా ఉనికికి గుర్తింపు. వారి వ్యక్తిత్వం , ప్రేమాభిమానాలకి నేను ప్రత్యక్ష సాక్షిని. చంద్రుడుగారు యశోదమ్మ జన్మ నిచ్చినా మా బాల్యాన్ని , జీవితాన్ని మధురంగా తీర్చిదిద్దినది తాత గారు సత్యం గారు , అమ్మమ్మ రంగనాయకమ్మ అని నేను భావిస్తూ ఉంటాను . వారి గురించి తెలుసుకోవాలంటే బోడపాటి మరియు ఉన్నవ వంశ పెద్దల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించడం చాలా ఆవశ్యకం. ముందు తరాలకి నాకు తెలిసిన వివరాలు తెలియచెప్పడం కూడా ఓ కారణం కనుక సంక్షిప్తంగా మీ ముందు ఉంచుతున్నాను .
చిత్తగించండి .
...
ఉప శీర్షిక : బోడపాటి మరియు ఉన్నవ సమ్మేళనం
మా తాత సత్యం గారి వంశం బోడపాటి వారు ఆరువేల నియోగి బ్రాహ్మణులు . కాశ్యప స గోత్రీకులు . వీరి పూర్వీకులు కృష్ణా జిల్లా మచిలీపట్నం
వాస్తవ్యులు . పూర్వం మచిలీపట్నం వాణిజ్య పరం గా ప్రసిద్ధి పొందిన ఓడ రేవు . బోడపాటి వారు చాలా మంది అప్పట్లో మచిలీపట్నం లో ఫ్రెంచ్ సైన్యం లో వివిధ హోదాల్లో పని చేస్తూ ఉండేవారు . చాలా ఏళ్ల క్రితం సంభవించిన పెను తుఫాను మచిలీపట్నం లో కోలుకోలేని విధంగా విధ్వంసం సృష్టించింది . ప్రజల ఇళ్ళు , ఆస్తులు తుఫాను తాకిడికి సముద్రంలో కొట్టుకు పోయాయి . ప్రజలు నిర్వాసితులు అయ్యారు. వేరే గత్యంతరం లేక చాలా కుటుంబాలు దూర ప్రాంతాలకు వలస పోవటం జరిగింది . బోడపాటి వారి కుటుంబంలో కొంత మంది శ్రీకాకుళం ప్రాంతానికి వలస పోవటం జరిగింది. వారిలో బోడపాటి వెంకటాచలం గారి కుటుంబం ఒకటి. (యర్రమిల్లి వారి మూల పురు షులు మరియు ఇక్కడ పేర్కొనబడిన బోడపాటి వారి మూల పురుషుల నామధేయం ఒకటే కావటం కాకతాళీయమే గాని మరోటి కాదు ).
బోడపాటి వెంకటాచలం గారు శ్రీకాకుళం వాస్తవ్యులు తాడేపల్లి ఈశ్వరప్ప గారి ప్రాపకంతో అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీ లో ఉన్న గంజాం జిల్లా లోని బరంపురం పట్టణం కోర్టులో దుబాసీ (Translator ) గా ఉద్యోగం లో స్థిరపడ్డారు . ఆ తర్వాత కాలంలో జిల్లా కేంద్రమైన చత్రపురం వారి కుటుంబం మారింది .
వెంకటాచలం గారి మెదటి భార్య సంతానం రంగారావు గారు . ప్రధమ కళత్రం కాలం చేయడంతో ఆయన రెండవ వివాహం చేసుకోవటం జరిగింది . ద్వితీయ వివాహం ద్వారా ఆయనకు ముగ్గురు కుమారులు , కుమార్తె కలిగారు .కుమారులు రామలింగేశ్వరప్ప, రాజన్న ,కుటుంబరావు. కుమార్తె సీత .
వెంకటాచలం గారు కాలం చేసిన తర్వాత ఆయన భార్య సవతి కుమారుడు రంగారావు తో పాటు పిల్లలు అందరినీ ప్రేమ తో పెంచి పైకి తెచ్చింది . కుమారులు అందరూ వృద్ధిలోకి వచ్చారు .
...
ఉన్నవ రామలింగంగారు ఆ రోజుల్లో ఛత్రపురం లో ఆరువేల నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సంపన్నులు . మంచి వ్యవహార దక్షత ,పరిపాలనా కార్య శూర్యుడు . సుమారు ముప్పై ఐదేళ్ళ ప్రాయంలోనే కళ్ళికోట జమిందారీ దివాను గా ఎంపిక అయి జమిందారీ వ్యవహారాలు చక్క పెట్టేవారు . ఆయన దివానుగా ఉన్న సమయంలో ధారకోట ఎస్టేటు ని కళ్ళికోట జమిందారీ సంస్తానంలో విలీనం చేసారు. ఛత్రపురం నుండి రోజూ పల్లకీ లో ఎస్టేట్ కార్యాలయానికి వెళ్లి విధులు నిర్వర్తించేవారు .
ఉన్నవ రామలింగం గారి కి ముగ్గురు సంతానం . కుమారులు రంగారావు , నరసింహస్వామి, కుమార్తె బాల త్రిపుర సుందరి .
తాడేపల్లి శివరామయ్య గారు చత్రపురంలో సంపన్నులు . పలుకుబడి గల కుటుంబం. ఉన్నవ రామలింగం గారి ఇంటి పక్కనే నివసించేవారు. తాడేపల్లి శివరామయ్య గారు అప్పట్లో డిప్యూటీ కలెక్టర్ గా పని చేసే వారు. రామలింగం గారికి అత్యంత ఆప్తులు , ప్రియ స్నేహితులు. స్నేహితుని సూచన , సలహా మేరకు ఉన్నవ రామలింగం గారు తన ఏకైక కుమార్తె బాల త్రిపుర సుందరిని బోడపాటి రామలింగేశ్వరప్ప గారికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు . వీరికి నలుగురు కుమారులు కలిగారు . వారి పేర్లు రామలింగం , సత్యనారాయణ ,శివరామయ్య (శివరామ కవి) మరియు నరసింహం .
...
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు . ఒక రోజు ఉన్నవ రామలింగం గారు ఎస్టేట్ కార్యాలయం నుండి విధులు ముగించుకొని పల్లకీ లో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ప్రత్యర్ధులు దారి కాసి ఆయనని కత్తులతో నరికి దారుణంగా హత్య చేసారు . అలా ముగిసిపోయింది ఆయన దివాన్ గిరీ .
...
బోడపాటి వెంకటాచలం మొదటి భార్య కుమారుడైన రంగారావు గారికి సంతానం లేకపోవటంతో ఆయన తమ్ముడు రామలింగేశ్వరప్ప ద్వితీయ పుత్రుడు సత్యనారాయణ ని దత్తత తీసుకోవటం జరిగింది . రంగారావు గారి భార్య చాలా ఆస్తి పరురాలు . ఆమె తర్వాత ఆ ఆస్తి సత్యనారాయణ కి వారసత్వంగా సంక్రమించింది .
కాల మాన పరిస్థితులని బట్టి బోడపాటి వారి కుటుంబం రాజమహేంద్రవరం తరలి వెళ్ళిపోయింది. అక్కడ గోదావరి గట్టుకి సమీపంలో గల ఆర్యాపురం లో గృహం నిర్మించుకొని స్థిరపడటం జరిగింది . ఇప్పటికీ ఆర్యాపురం లో బోడపాటి వారు నివసించిన ప్రాంతము ' బోడపాటి వారి వీధి ' గా పిలవబడుతోంది .
సత్యనారాయణ మద్రాస్ లో బి . ఎ లిటరేచర్ డిగ్రీ పట్టా తీసుకొని కొన్నాళ్ళు స్వాతంత్ర ఉద్యమం లో కాంగ్రెస్ కార్య కర్తగా చురుకుగా పాల్గొన్నారు . ఆ సమయంలో ఆయనకి ప్రముఖ రాజకీయ నాయకులు అయిన పట్టాభి సీతా రామయ్యగారు , టంగుటూరి ప్రకాశం పంతులు గారు , వావిలాల గోపాల క్రిష్ణయ్య గారు , కళా వెంకట రావు గారు , పుచ్చలపల్లి సుందరయ్య గారు, కోలవెన్ను రామ కోటేశ్వర రావు గారు (ప్రముఖ పత్రిక త్రివేణి సంపాదకులు ), కాశీనాధుని ,శివలెంక వారు(ఆంద్ర పత్రిక యాజమాన్యం) మరియు ఇతర ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి .
...
ఉన్నవ రామలింగం గారి రెండవ కుమారుడు నరసింహ స్వామి . రంగనాయకమ్మ , సుబ్బమ్మ, సీతాయమ్మ , వెంకయ్య గార్లు నరసింహ స్వామి గారి సంతానం .
బోడపాటి వారు , ఉన్నవ వారు ముందు తరం లోనే బంధుత్వం కలుపుకోవటం తో పెద్దలు అందరూ కలిసి సత్యనారాయణ కి రంగనాయకమ్మని ఇచ్చి కల్యాణం జరిపించారు . ఈ పుణ్య దంపతులే మా తాత సత్యం గారు అమ్మమ్మ రంగనాయకమ్మ .
...
పట్టాభి సీతారామయ్య గారు స్వాతంత్ర ఉద్యమంలో జైళ్ళ లో నిర్భంధ కాలంలో రెండు కంపినీల స్థాపనకు రూప కల్పన చేశి మెమొరాండం అఫ్ ఆర్టికల్స్ (Memorandum of Articles) సిద్ధం చేసుకున్నారు. జైలు నుంచి విడుదల కాగానే వాటిని మచిలీపట్నం ప్రధాన కార్యాలయం గా స్థాపించారు . అవే ..........
ఆంధ్ర బ్యాంకు .
ఆంధ్ర ఇన్సురన్స్ కంపెనీ .
తాత సత్యం గారిని పట్టాభి వారు బరంపురం బ్రాంచ్ కి మేనేజర్ గా నియమించారు . మా తాత సత్యం గారు భార్యా బిడ్డలతో రాజమండ్రి నుండి బరంపురం మకాం మార్చాల్సి వచ్చింది .
( అయి పోలేదు . బోలెడంత బాల్యం ముందుంది .)
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
ఈ రచనలో బోడపాటి వారి గురించి మరియు ఉన్నవ వారి గురించి వ్రాసిన సారాంశం
మా మావయ్య (బోడపాటి రామం ) చెప్పగా కొంత సమాచారం , మరికొంత ఆయన వ్రాసి ఉంచి భద్రపరచిన దస్త్రాల లో లభించినది ..
ఈ దస్త్రాల లో భద్రపరచిన వివరములు నాకు అందజేసిన మావయ్య పుత్రులకు ధన్యవాదాలు.
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
No comments:
Post a Comment