Saturday, 18 July 2015


తమ  సోమా  జ్యోతిర్గ  మయ

...  

రాత్రి  పదిగంటలు  దాటింది . 
అప్పటి  వరకు ఆలోచనల  ముసురులో  ఉన్న  ఆయన  పడక  కుర్చిలోంచి  లేస్తూ  ఉంటే  టెలిఫోను మ్రోగింది . 
రిసీవర్  తీసుకొని  'హలో ! ఎవరూ ? ' అన్నాడు . 
'నేనే  నాన్నా . పుష్కరాలకి  వస్తున్నా ! ' అని బదులిచ్చాడు కొడుకు . అ వార్త  విన్న తండ్రి  ఆనందానికి  అవధులు లేవు . 
'అమ్మ ఏం  చేస్తోంది  నాన్నా ' అడిగాడు కొడుకు . 
'ఇప్పుడే  పురాణ  ప్రవచనం  టీవీ లో విని  నిద్రపోతోందిరా ' అన్నాడు తను . 
'సరే ! అమ్మకి చెప్పు నాన్నా ' అన్నాడు  కొడుకు .
... 
గత  పుష్కరాల  కి  ముందు  విదేశాలకి  వెళ్లిన  కొడుకు    మళ్ళీ పుష్కరాలకి  స్వదేశం   వస్తున్నాడన్న సంతోషం  ఆ  తండ్రికి  ఆ రాత్రి   నిద్ర  పట్టనీయలేదు . రాత్రంతా  మేలుకొని  కొడుకు  గది  శుభ్ర పరిచి  ఎక్కడివి  అక్కడ  సర్దే సరికి  తూర్పున  తెల్లవారుతోంది. 

ఉదయాన్నే  లేచిన  భార్య  కొడుకు  గదిలో  అలికిడికి లోపలికి  తొంగి  చూశి  తెల్లబోయింది. కొడుకు  గది   అద్దంలా  ఉంది . ఎక్కడివి  అక్కడ  నీటుగా  సర్ది ఉన్నాయి . భర్త  అలసిపోయి  కుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్నాడు . ఆశ్చర్యపోయి  'ఏంటి  విశేషం ? 'అడిగింది  భర్తని. 
'అబ్బాయి  వస్తున్నాడే ' అన్నాడు భర్త. 
'ఎప్పుడూ ?' 
'పుష్కరాలకి ' అన్నాడు భర్త  పుత్రోత్సాహాన్ని ప్రదర్శిస్తూ .  
పుష్కరం  తర్వాత  ఇంటికి  వస్తున్న   కొడుకుని  కళ్ళ  నిండా  చూశుకోగల నన్న   తలంపు  ఆవిడ మనసుని  ఆనందంలో  గోదారి వరదలా   ముంచేసింది .
...
  
కొడుకు  వస్తున్నాడన్న  సందర్భంగా  బంధు  మిత్రులని  పిలిచి  విందు  ఏర్పాటు చేశాడు  తండ్రి . ఒకరూ  ఒకరూ  అతిథులు  రావటం  మొదలయ్యింది.  అందరినీ  స్వయంగా  వెళ్లి పలకరిస్తున్నాడు  ఆప్యాయంగా . పిల్లల్ని అయితే  మరీనూ .
 వాళ్లతో  నవ్వుతున్నాడు . ఆటలాడుతున్నాడు . మంచి మార్కులు  తెచ్చుకొని  పెద్ద  చదువులు  చదవాలని  అశీ ర్వదిస్తున్నాడు .
 అపరిచితుల్ని  ప్రేమగా  పలకరిస్తున్నాడు  . అంతా  తానై  సందడి  చేస్తున్నాడు . మర్యాదలు  చేస్తున్నాడు.  ఎప్పుడూ  గంభీరంగా  ఉండే  తండ్రి  ప్రవర్తన  వింతగా  అనిపించింది  కొడుకికి . పిలిచి  చెప్పాడు  తండ్రికి .  తండ్రి  చేష్టల్లో  మార్పు  ఏమి రాలేదు . ఈ సారి  మళ్ళీ  పిలిచి   తండ్రి మీద  కాసంత 
విసుక్కున్నాడు .
  కొడుకు  మాటలకు  మనసు  గాయ పడింది.     'ఒక్క  క్షణం' అని గదిలోకి  వెళ్లి  అయిదు  నిమిషాల  తర్వాత  వచ్చాడు చేతిలో  కాయితంతో . ఆ  కాగితం కొడుకు   చేతిలో  పెట్టి  నిశ్సబ్దంగా  కూర్చున్నాడు
తండ్రి .
 కొడుకు  తండ్రి  ఇచ్చిన కాగితం  చూశాడు . అది ఏడాది క్రితం తేదీ  వేశి  ఉన్న  తండ్రి  మెడికల్  రిపోర్ట్ . అందులో డయాగ్నోసిస్:   టెర్మినల్ డిసీస్........   అని  వ్రాసి ఉంది.పూర్తిగా  చదివి  నిర్ఘాంత పోయాడు  కొడుకు .నిశ్శబ్దాన్ని  చీల్చుతూ 
 పలికాడు  మనసు గాయ పడ్డ  తండ్రి .   
' నువ్వు విదేశం  వెళ్ళాక  నే   కోల్పోయిన  ఆనందాన్నీ  ,సంతోషాన్నీ  ఈ  చిన్నారుల  లో  వెతుక్కుంటూ  ఉన్నాను . త్వరలో  ముగిసిపోయే   జీవితాన్ని ఆనందంగా  గడపాలని .... ' అన్న  తండ్రి ని ఆప్యాయంగా  పొదివి  పట్టుకొని  ' నాకు ఎందుకు  తెలియ చేయలేదు  నాన్నా ' అన్నాడు  కొడుకు    కన్నీటిని  బలవంతంగా  ఆపుకుంటూ.    
'నువ్వు  తల్ల  డిల్లి  కుప్ప  కూలిపోతావని 'అన్నాడు  తండ్రి . 
'అమ్మకి  తెలుసా ' అన్నాడు కొడుకు . దూరంగా  అతిథులతో  కబుర్లు  చెబుతున్న తల్లిని  చూస్తూ . 
'లేదు  .అమాయకురాలు . నోములూ  వ్రతాలూ  అని  దేవుణ్ణి  నమ్ముకున్న  మీ అమ్మ కి  విషయం తెలిస్తే  గుండె  పగిలి  పోతుంది.' అన్నాడు  తండ్రి . కంట్లో  నీటి  చెలమలు  కొడుకికి  కనపడకుండా  ఉండటానికి  విశ్వ ప్రయత్నం చేస్తూ .

' బెంగ పడకు  నాన్నా ! ఈ  రోజుల్లో  మన  దేశం లో కూడా  అధునాతన  వైద్య సౌకర్యం  అందు బాటులో ఉంది . నేను  ఉన్నాను . నీ కేమీ  కాదు . ' అన్నాడు  కొడుకు . 
కొడుకు  అనునయం  రామ రక్షా  కవచంలా  అనిపించింది  తండ్రికి . 
నుదట  రూపాయి  కాసంత  కుంకుమ బొట్టుతో, పాదాలకి  పసుపు  రాసుకొని  అందరినీ  పలకరిస్తున్న తల్లి  జగజ్జననిలా  అనిపించింది  కొడుకికి . 
రెండు కుర్చీలు  తెచ్చి  హాలు మధ్యలో వేశాడు. తల్లినీ  ,తండ్రినీ  భుజాల  మీద చేతులు వేశి  పొదివి  పట్టుకొని   కుర్చీల లో  కూర్చో పెట్టాడు . 
పాదాభివందనం  చేశాడు . 
కొడుకు  గుండెల్లో  జ్యోతి  వెలిగింది . 
భక్తులు   గోదారిగంగ లో అరటి దొప్పలలో వెలిగించి   వదిలిన దీపాలు  నీటిలో  ప్రతిఫలించి  కోటి కాంతులు  విరజిమ్ముతూ   సాగిపోతున్నాయి . 
ఆ రోజు  జరిగిన  మహా హారతికి  గోదారమ్మ  పులకించి పోయింది .
Photo courtesy:  eenaadu daily.





 ........................................ 

             


                                   



  కధలు  జీవితం  నుంచి  పుట్టినవే  అన్నది  నా 
  ప్రగాఢ  విశ్వాసం .
 బాల్యంలో  అమ్మలూ , అమ్మమ్మలూ ,బామ్మలూ  రాత్రి  నిద్రపుచ్చే ముందు కధ  చెప్పి ' కధ  కంచికి  మనం  ఇంటికి ' అని  ముగించి  జో  కొట్టి  నిద్ర 
పుచ్చే వారు . కధలు  కంచికి  వెళ్ళవు . జీవితంలోనే  ఉంటాయి . దోబూచులాడతాయి . 
చంద్రుడు గారి  అబ్బాయి . 
.........................................


photo courtesy: ఈనాడు 



    
       

 


Monday, 13 July 2015

                      సైకిల్   వీరులు.

                                                      Tag line..మన మీదేనర్రోయ్...

రోజూ  ఉదయం  మళ్ళీ  సాయంత్రం స్కూళ్ళు వదలగానే మా కాలనీ  లో  సైకిల్  శొభా  యాత్ర  జరుగుతూ  ఉంటుంది . ఈ  యాత్ర  చేసేవాళ్ళంతా  ఐదేళ్ళ నుండి  పదకొండు  లోపు వయసు పిల్లలు .మొత్తం టీం  మెంబర్లు  డజను పైనే.   ఇంట్లో  పెద్దలు  ముసుగులు  తన్ని  పడుకుంటే  పిల్లలు  వీధిలో  సైకిల్  యాత్ర  సందడి . పుష్కరాలకి  స్కూళ్ళు   శెలవలు  ఇచ్చేసిన  మూలాన  ఈ  సైకిల్  యాత్ర టీం కి  టైమూ  దిబ్బా  ఉండటం  లేదు  . పిల్లల  తల్లులు  ఇంటి  వరండా నుండి , బాల్కనీ  సిట్  అవుట్  నుండి  'ఎండల్లో  ఆడకండిరా ' అని  పిలుస్తూ  ఉంటె 'ఒక్క నిమిషం అమ్మా ! ' అని తుర్రున  పారి పోతూ  ఉంటారు . 
... 
సదరు  సైకిల్  శోభా యాత్ర  లీడర్  మా వర్ష . డిప్యూటీ లీడర్  వర్ష  తమ్ముడు రుషి . వర్ష కి  పదేళ్ళు  నిండాయి .బుర్ర నిండా రకరకాల  ఇన్నోవేటివ్ ఇడియాలు  వర్షకి .   రుషి కి ఏడు  సంవత్సరాలు . రుషి  మెదడు నిండా  కూడా  బోల్డు ఇడియాలు  ఉన్నాయి .  కాని వాళ్ళ  అక్క  పెద్దరికం  చూపించి  కొట్టి పారేస్తుంది . 
... 
 రుషి  కి  పాపం  పెద్ద చిక్కు  వచ్చి పడింది . ఈ  సైకిల్  బృందంలో  ఆడపిల్లల దే  మెజారిటీ.  రుషి  వయసు  మగ పిల్లలు  ముగ్గురిని  మించి ఉండరు. మొదట్లో  కొంత యిబ్బంది  పడినా  తర్వాత  సర్దుకు పోయాడు . పెద్ద  మగాడినని  పోజులు కొట్టడానికి  వాళ్ళ  అమ్మని  కాకా  పట్టి  జీన్ పంట్లాలు  కోనేసుకొని  సైకిల్  తెగ  స్పీడ్ గా తొక్కేస్తున్నాడు . 
... 
ఈ  సైకిల్  శోభా యాత్ర  అంతగా మా కాలనీ లో   ఆదరణ పొందటానికి  పరోక్ష కారణం  వర్ష ,రుషి  వాళ్ళ  నాన్న రామకృష్ణ . రామకృష్ణ  అమెరికాలో  కొద్ది సంవత్సరాలు  నివశించి  స్వదేశం  వచ్చేసిన   తర్వాత  అక్కడి  అలవాటు  ప్రకారం  కాలుష్యరహిత    వాహనం  మీద  ప్రయాణం చేయాలనే  సదుద్దేశంతో  గేర్లు  ఉన్న  సైకిల్  కొనుక్కొన్నాడు. షార్ట్స్ (పొట్టి లాగులు ) సాండో  బనియన్  వేసుకొని  కండల వీరుడులా  ఓ  నాలుగు  రోజులు  కాలనీ లో  గేరు సైకిల్ మీద  తిరిగేసరకి  జనం  వింతగా  చూడటంతో  సైకిల్  మూల  పడేసాడు . అప్పటి నుంచి  రుషి  నాకూ  సైకిల్  తొక్కాలని  ఎందుకో  అనిపిస్తోందని  పేచీ  పెడుతూ ఉంటే  పొట్టి సైకిల్ కొన్నాడు . కొన్నాళ్ళు  ఈ  పొట్టి  సైకిల్  వంతుల వారీ  గా  వర్ష ,రుషీ  వాడుకున్నారు . ఈలోగా  వర్ష ఫ్రెండ్స్ అందరికీ  వాళ్ళ  నాన్నలు  సైకిళ్ళు  అమర్చారు . దాంతో  వర్ష  నాకూ  ప్రత్యేకంగా  సైకిల్  కావాలని  వాళ్ళ  అమ్మ  దగ్గర  పేచీ పెట్టి  నాన్న చేత  ఒక రోజు  బజారు వెళ్లి  కొని తెచ్చేసుకుంది.  రుషి  వంతులు  తప్పాయని తెగ సంబరపడ్డాడు . 

పిల్లలు ఇద్దరూ  ఎవరి  సైకిల్ వాళ్ళు  హాయిగా తొక్కు కుంటున్నారు . ఇలా ఓ రెండు నెలలు తగాదాలు లేకుండా  గడిచాయి . పొట్టి సైకిల్ మీద ప్రావీణ్యం  గడించిన రుషి  దృష్టి  వర్ష  సైకిల్  మీద పడింది. వర్ష దృష్టి వాళ్ళ నాన్న మూలాన పడేసిన  గేరు  సైకిల్ మీద పడింది  . సైకిళ్ళు మారాయి . ఇప్పుడు రుషి  గేరు  సైకిల్  మీద కూడా ప్రావీణ్యం  సంపాయించేసి వాళ్ళ అక్క కి  తెలియకుండా  స్వైర  విహారం  చేస్తున్నాడు . పిల్లల  సైకిల్  ప్రగతి మేడ మీద బాల్కనీ నుండి   రోజూ  గమనిస్తున్న  సంధ్య  మహా  ముచ్చట పడింది .  
                           ... 
ఒక రోజు రామకృష్ణ  డైనింగ్ టేబుల్  దగ్గర  కూర్చొని లాప్ టాప్  లో ఆఫీసు  పని  చేసుకుంటూ  ఉంటే  సంధ్య  వచ్చి భర్త వెనకాల నిలబడింది . రామకృష్ణ  తన పనిలో  తాను  ఉన్నాడు . సంధ్య  రామకృష్ణ  వీపు  గోకి  సుతారంగా  నిమిరింది . 
 నాకేం దురద లేదు  సంధ్యా ' అన్నాడు  రామకృష్ణ  ఎగా దిగా చూశి  . 
' ఇలా  వీపు గోకి  నిమిరితే  మొగుడు  గారు  భార్య  కోరిన  కోరికలు అన్నీ తీరుస్తారుట ' అంది సంధ్య . 
విషయం  ఇంటరెస్టింగ్  గా  ఉందని  లాప్ టాప్  పక్కన  పెట్టి ' ఏ  పురాణం  లో చెప్పారు అలా ' అడిగాడు  రామకృష్ణ . 
'పురాణంలో  కాదు . మా సునీత చెప్పింది . తను ఏవైనా కొనుక్కోవాలంటే  సతీష్  వీపు గోకి  నిమిరితే  వెంటనే  కోరిక తీరుస్తాడుట 'అని వంటింట్లోకి  వెళ్లి  గ్యాస్  పొయ్యి మీద ఉన్న కందికట్టు  లో తాలింపు పెట్టి  వచ్చింది . 
కందికట్టు  తాలింపు  ఘాటు కి రామకృష్ణ  గదిలోకి వెళిపోయాడు . 

పట్టు విడవని  విక్రమార్కుడిలా ఆ  మరునాడు కూడా  గోకుడు  కార్యక్రమం  జరుగుతూ  ఉండగా  సత్సంఘ్  ప్రార్ధనలు  ముగించుకొని  గది లోంచి బయటకు వచ్చిన  రామకృష్ణ  అమ్మగారు ' ఏమిటి రా ! బుజ్జీ ! సంధ్య అలా బరుకుతోంది .  గజ్జి గాని  అంటించుకొని వచ్చావా ! ' అన్నారు . 
రామకృష్ణ  సంధ్య వైపు  కొర  కొరా  చూసాడు .      
సంధ్య  మరుగుతున్న పెసర కట్టు లో  కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు  వేయాలన్న నెపం తో కిచెన్ లో దూరి పోయింది .

నెక్స్ట్  డే . 
'ఈ  రోజు శనగకట్టు చేస్తున్నా ' అంది సంధ్య  రామకృష్ణతో . 
అంతకు ముందు  ఇలాటి  కట్టు  పేరు వినని  రామకృష్ణ  దీనం గా  చూసాడు సంధ్య వైపు . 
'చాలా  బావుంటుంది ' అంది సంధ్య ధీమాగా . అని  
గోకుడు  షో  మొదలుపెడదామనుకోనేటప్పటికి  అప్రమత్తుడైన  రామకృష్ణ  గోడకి జారగిలి  పడ్డాడు.  సంధ్యకి  వీపు నిమిరే అవకాశం  దక్కలేదు. 

మర్నాడు . నెక్స్ట్ టు నెక్స్ట్  డే .
'అది కాదండీ ' అంటూ  రామకృష్ణ  గది లోకి  వచ్చింది  సంధ్య . 
ఏమిటన్నట్లు ? చూశాడు  రామకృష్ణ . 
'నాకూ  సైకిల్ కొనండి . తొక్కుతాను ' అంది సంధ్య . 
'యిలా  సైకిల్  తొక్కితే  బావుండదేమోనే ' అన్నాడు రామకృష్ణ  నైటీ  లో ఉన్న సంధ్య కేసి చూశి . 
అరచేత్తో  నుదురు బాదుకొని ' ట్రెడ్ మిల్  సైకిల్.డాక్టర్అమ్మ  చెప్పింది  ' అంది  సంధ్య . 
'బొద్దుగా  ఉన్నావ్ ! చిక్కిపోతావేమోనే ' అని బెంగ పడ్డాడు  రామకృష్ణ . 
'చక్కనమ్మ  చిక్కినా అందమే ' అంటూ ' ఈ రోజు మినప కట్టు  కాస్తాను ' అని  ఠీవిగా ప్రకటించి  కిచెన్ లోకి వెళిపోయింది  సంధ్య . 

సాయింత్రం . రామకృష్ణ  పాతిక వేల రూపాయలు ఖర్చు పెట్టి అదునాతన  ట్రెడ్  మిల్  సైకిల్  తెచ్చి  క్రింద  గెస్ట్ పోర్షన్  లో  ఆవిష్కరించాడు.  సంధ్య  'బుజ్జి ముండ ' బావుంది  అని మురిసిపోయింది . వెంటనే  ఓ పావు గంట సేపు తొక్కి  చెమటలు కారుతూ  వచ్చి 'రెండు వందల  కాలరీలు  బర్న్  చేశాను అత్తా ' అంది సీత తో . 
'రోజూ చెయ్యి ' అంది సీత  మేనకోడలితో .  
ఇప్పుడు  మా ఇంటిలో  ఆరు సైకిళ్ళు  ఉన్నాయి . రెండు పిల్లల  సైకిళ్ళు , ఒక గేరు సైకిల్ ,మోటార్ సైకిళ్ళు రెండు ,ట్రెడ్ మిల్  సైకిల్  ఒకటి . 

... 

వర్ష ,రుషి  సైకిల్  జోరు  నిర్విరామం గా 
సాగుతోంది . 
అడపా  తడపా  సంధ్య  ట్రెడ్ మిల్ సైకిల్ తొక్కుతోంది. 
ఇంతకీ ... 
చక్కనమ్మ చిక్కలేదు . 

..................................................  

         

  

Sunday, 12 July 2015



వక్రతుండ  మహాకాయ  కోటిసూర్య సమప్రభ 
నిర్విఘ్నం  కురుమేదేవ  సర్వ 
కార్యేషు  సర్వదా .  
.... 


     నమోస్తు  రామాయ  సలక్ష్మణాయ  దేవ్యై  చ  తస్మై  జనకాత్మజాయై  
                 నమోస్తు  రుద్రేంద్రయ మానిలేభ్యో  నమోస్తు  చంద్రార్క మరుద్గణేభ్యః 
... 

కాలం   మింగేసిన  బాల్యం .

                 (01) 

Aanya with her beautiful Mother.



Theme Art illustrations  in this blog serial are by Aanya. She is  six years old. A very talented child ,  lives in Fremont, California, United States of America. Aanya is one of the many grand daughters  I have in this life.Her parents are Meenakshi     Satyavolu and Kaushik Gopalan,both highly talented. 

                                       ఒక  కవి గారు  అన్నట్లు ... 
"కావాలనుకొన్న  బాల్యం  కాలం  మింగేసింది 
వద్దనుకొన్న  ముదిమి  మీద పడిపోతోంది 
ఈ  మధ్య  కాలంలో  జీవితమంతా 
అస్తవ్యస్తం ."
ఇక  చదవండి . 

 The Beginning: 
ముందుగా  నా  మూలాలు (Roots) గురించి  ప్రస్తావించడం  అవసరం గనుక  వాటిని  తెలియచేస్తున్నాను . 
మాది  తూర్పు  గోదావరి జిల్లా  వంటిమామిడి  అగ్రహారం . మా పూర్వీకులు సుమారు  రెండు వందల సంవత్సరాల  క్రితం  గోదావరీ  తీరం  పాశర్లపూడి  లంక  నుండి  దైవ నిర్దేశం వల్ల  వంటిమామిడి  గ్రామానికి  వలస వచ్చి  స్థిర పడటం జరిగింది . 
అలా  వంటిమామిడిలో  స్థిర పడిన  మా వంశ  మూల పురుషులు  యర్రమిల్లి  వేంకటాచలం  గారు.  వేంకటాచలం  గారు  వేద పండితులు . శివారాధకులు . వేదాల్లో చెప్పబడినది ప్రామాణికంగా  తీసుకొని   ,సనాతన ధర్మాన్నిపాటించి  బ్రాహ్మణ్య విధులను సర్వ కాల పరిస్థితులలోనూ నిర్వర్తించి   జీవించిన  మహానుభావుడు .  ఆరు  వేల నియోగి . వేంకటాచలం  గారు తాను  నమ్మిన జీవన సూత్రాన్నే తన సంతానానికి  నేర్పారు . వెంకటాచలం గారి కాలంలో  వంటిమామిడి బ్రాహ్మణ అగ్రహారం బ్రహ్మి ముహూర్తంలో  వేద మంత్రాలు , వేద ఘోష  తో  మార్మోగి పోయేదని  పెద్దలు నా  చిన్నప్పుడు  చెప్పుకొనేవారు . 

...    
  వేంకటాచలం  గారి  నాల్గవ   కుమారుడు
  నా ప్రపితామహ (ముత్తాత) రామచంద్రుడుగారు . రామచంద్రుడుగారి  భార్య  కామేశ్వరమ్మ (ముత్తబామ్మ ). వీరికి  పదిమంది  సంతానం . ఏడుగురు  కుమారులు. ముగ్గురు  కుమార్తెలు(సుందరమ్మ , శరభమ్మ ,సూరమ్మ ) .  కుమార్తెలు ముగ్గిరికీ  వివాహం  జరిపించి  తనకు  తండ్రిగారి  నుండి అనువంశీకం  గా  సంక్రమించిన  రెండు  వేల ఎకరాల   పై చిలుకు స్థిరాస్తిని  కుమారులకు , మరియు స్త్రీ  ధనంగా    తన వాటాగా మినహాయించు కున్న భూమిని వివాహితులైన కుమార్తెలకు  తన    జీవిత కాలంలో అనగా  1911 వ  సంవత్సరంలో పంచిపెట్టారు  రామచంద్రుడు గారు .

 అదే కాలంలో  ఎకరా  విస్తీర్ణం  గల  స్తలంలో   నిర్మించుకున్న  పెద్ద  మండువా  ఇల్లు  కూడా రామచంద్రుడు గారు    పంచారు . ఆ  పంపకాల  ప్రకారం  ఆ పెంకుటిల్లు  రామచంద్రుడుగారి  ఏడుగురు  కుమారులలో నలుగురికి ( సర్వశ్రీ  వెంకటాచలం , జగత్పతి , సూర్యనారాయణ మూర్తి  మరియు  నరసింహం గార్లకు) సంక్రమించింది . మిగతా కుమారులకు   వారు కోరిన విధంగా  ఇళ్లు  నిర్మించి యిచ్చారు .ఆ  విధంగా  రెండవ కుమారుడైన  జగన్నాధ రావు గారికి  వంటిమామిడిలోనూ , ఆఖరి కుమారుడైన  మంగయ్యగారికి  పాయకరావు పేటలోనూ గృహములు నిర్మించబడ్డాయి . తన  భాద్యతలు తీర్చుకున్న  రామచంద్రుడు గారు  విశ్రాంతి తీసుకున్నారు . 
... 

రామచంద్రుడుగారి  మూడవ కుమారుడు  జగత్పతి  గారు . నా  పితామహులు . పెంకుటిల్లు  లోని  మండువా  వాటా  మా  పితామహులైన  జగత్పతి గారికి వాటా పంపకాల్లో దక్కింది . ఈ  మండువా  ఇల్లే  నా  బాల్యం  లోని  జ్ఞాపకాలని అమూల్యంగా  భద్రపరచి  అనుక్షణం  గుర్తు చేస్తూ  ఉంటుంది .  
... 

జగత్పతి  గారి భార్య  లక్ష్మినరసమ్మ  మా బామ్మ . వీరి   మొదటి  సంతానం  కామేశ్వరమ్మ . రాజమండ్రీ  వాస్తవ్యులు  ఓలేటి  జమిందారు  వారి  కోడలు . అయితే  ఆమె  వివాహం అయిన  కొద్ది కాలంలోనే  పురిటిలో  మరణించింది . ఈవిడ  భర్తతో కలిశి  ఉన్న ఫోటో  మొన్న మొన్నటి వరకు  మా నాన్న  గదిలో  గోడకు  తగిలించి  ఉండేది .  జగత్పతి  లక్ష్మీనరసమ్మ దంపతులకు     తర్వాత  కలిగిన  సంతానం  సుబ్బారావు గారు.   మా పెదనాన్న . ఈయన్ని  సుబ్బులూ  అని పిలిచేవారు . 
... 

ఆ  తర్వాత  పదహారు సంవత్సరాలకి  జగత్పతి  లక్ష్మీనరసమ్మ    దంపతుల  జీవితంలో  అద్భుతం జరిగింది   . వారికి  ద్వితీయ పుత్రుడు  చంద్రుడు గారు  ఉదయించారు . అలా ఉదయించిన  చంద్రుడు  గారే  మా  నాన్న
... 
(అయి పోలేదు .. ఇది  ప్రారంభం మాత్రమే . ఇంకా బోల్డు ఉంది .) 
.................................................. 

  
మనిషి  జీవితంలో  బాల్యం  అపూర్వమైన  ఘట్టం . తెలియకుండా  గడిచి పోతుంది  అందమైన ,కల్లా కపటం ,చింతా చీకూ  ఎరగని  అమాయక బాల్యం .
'నా బాల్యం  నాకిచ్చేయి ! ' అని   ప్రతి రోజు ఉదయం   ఆ  సర్వేశ్వరుని  ప్రార్దిస్తూనే   ఉన్నాను . 
అంత  మధురమైనది  నా బాల్యం . 
దాన్ని  అంత  అందంగా తీర్చి దిద్దిన  ఎందఱో మహానుభావుల  గురించి ముందు  ముందు చెప్తాను .                                   
ప్రారంభం (The Beginning) ఎలా ఉందో  తెలియ చేస్తే  కధా  గమనాన్ని  మెరుగు పరచుకొనే  వెసులుబాటు  నాకు  ఉంటుందని  తప్పకుండా  స్పందించమని  మనవి  చేసుకుంటూ ...... 
చంద్రుడు గారి అబ్బాయి . 
..................................................