Wednesday, 31 December 2014






శ్రీ వేంకటాచల వైభవం . 

                    తృతీయ భాగం -03
                      
జరిగిన కధ : బంధు మిత్రుల కోరిక మేరకు యర్రమిల్లి వంశస్తుల మూల పురుషులు వేంకటాచలం గారి గురించీ ,వంటిమామిడి అగ్రహారం లో ఉన్న పురాతన శివాలయ చరిత్ర గురించీ  చెప్పటం ప్రారంభిస్తాడు చంద్రుడు గారి అబ్బాయి . యర్రమిల్లి వేంకటాచలం గారి స్వస్థలం గోదావరి తీరం ఒడ్డున పాశర్లపూడి లంక . నిత్యం వేదపారాయణం ,ఈశ్వర భక్తి తో ,అనుకూలవతి అయిన సహధర్మచారిణితో ప్రశాంతంగా జీవనం గడుపుతున్న వేంకటాచలం గారికి ఓ పిడుగులాంటి తాఖీదు వస్తుంది . .......... ఇక చదవండి


ఆ రోజు వేంకటాచలం గారు గృహంలో క్రతువు నిర్వహించదలచి సమీప గ్రామాలూ,  లంకల్లోని  వేద పండితులు ,బ్రాహ్మణులు ,గౌరవ పెద్దలు అందరినీ ఆహ్వానించటం జరిగింది . వేంకటాచలం గారి సహ ధర్మచారిణి  సంబారాలన్నీ సమకూర్చి క్రతువు కార్యక్రమానికి మంటపం వగైరా సిద్దం చేసింది . ఏర్పాట్లు అన్నీ సరి చూసుకున్న  వేంకటాచలం గారు క్రతువు సంకల్పం విఘ్నేశ్వర పూజతో ఆరంభించారు . ఆ తర్వాత అగ్నిహోత్రం వెలిగించబడింది . అగ్నికీలలు  పైకి ఎగసి పడుతున్నాయి .  మంత్రోచ్చారణ మొదలు అయింది . 


ఓం ఇంద్రాయ స్వాహా    ఇంద్రాయ ఇదం నమః 

ఓం అగ్నియ స్వాహా      అగ్నియ ఇదం నమః      
ఓం యమాయ స్వాహా    యమాయ ఇదం నమః 
ఓం నిర్రుత్యేయ  స్వాహా   నిర్రుత్యేయ   ఇదం నమః
ఓం వరుణాయ  స్వాహా     వరుణాయ  ఇదం నమః 
ఓం వాయువేయ స్వాహా  వాయువేయ ఇదం నమః 
ఓం కుబేరాయ స్వాహా        కుబేరాయ ఇదం నమః 
ఓం ఈశానాయ స్వాహా       ఈశానాయ ఇదం నమః 
ఓం ఇంద్రాది సకల దిక్పాలక దేవాతాభ్యో నమః అని సకల దిక్పాలక మంత్రాలు ఉచ్చరించబడుతున్నాయి . వేద పండితుల ఘోషతో అన్ని దిక్కులు   ప్రతిధ్వనిస్తున్నాయి . పవిత్రమైన వాతావరణం .చిత్రమైన  పులకరింత. వేద మంత్రాలతో క్రతువు నిర్విఘ్నంగా ముగిసింది . 
క్రతువు నిర్వహించి విశ్రాంతి తీసుకుంటున్న వెంకటాచలం గారికి సర్కారు వారి నుండి  తాఖీదు తెచ్చి ఇచ్చాడు బిళ్ళ బంట్రోతు . అది తీసుకొని చదివిన వెంకటాచలం గారు నిర్ఘాంతపోయి నిర్వేదనంగా ఉండిపోయారు కాస్సేపు . భర్త స్థితి  చూసిన భార్య "ఏమిటీ విషయం .ఏమి జరిగింది."అని ప్రశ్నించింది .కాటన్ దొరగారు చేపట్టిన గోదావరి నది మీద ఆనకట్ట మరియు కాలువల నిర్మాణం కొరకు తమకు చెందిన పూర్వార్జితం అయిన  పంటభూమి  సర్కారు వారికి అవసరం అయినందున  సర్కారు వారు తీసుకొని నష్ట పరిహారముగా కొంత నగదు పంపించారన్న సారాంశాన్ని చెప్పారు వేంకటాచల గారు భార్యతో .
                                                            ... 
వంటిమామిడి అగ్రహారంలో శివాలయంలో కళ్యాణ  
ఉత్సవాల  ప్రారంభ సన్నాహాలు ఊపు అందుకొన్నాయి.  . హైదరాబాద్ నుండి వచ్చిన ఇవటూరి గౌరీపతిరావు దంపతులు  చంద్రుడు గారి యింట్లో సంప్రదాయ రీతిలో నిత్య  పూజ చేశి  శ్రీకారం చుట్టి సభ్యులలో కొత్త  ఉత్సాహం నింపి దేవాలయం వెళ్ళడానికి సిద్ధం అయి మిగతా వారిని తొందర చేస్తున్నారు .  
శివాలయంలో కళ్యాణ పండగ మొదటి రోజు . 
శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారికి లక్ష కుంకుమ పూజ . 
 "కుంకుమ పూజ మొదలు పెడుతున్నాము . అందరూ వస్తే గుళ్ళో గోత్ర నామాలతో సంకల్పం చేయిస్తాను " అన్నాడు శివాలయ పూజారి గోపాలం  చంద్రుడుగారి ఇంటికి  వచ్చి . సరే అని అందరూ గుడికి బయలుదేరి వెళ్లారు . 
 "పూజ తర్వాత మిగతా కధ చెప్పాలి మావయ్యా "అని ఆర్డర్ వేసింది విప్పగుంట పద్మావతి . "అలాగే తల్లీ !"అన్నాడు చంద్రుడు గారి అబ్బాయి గుడికి బయలుదేరుతూ . 
                                                                              ... 
శివాలయంలో అమ్మవారికి  కుంకుమార్చన ప్రారంభం అయింది . గర్భగుడిలో అమ్మవారి  పాదాల  చెంత  కూర్చొని  ఋత్వికులు నామాలు పారాయణం చేస్తున్నారు . ఆలయ మంటపం అంతా  భక్తులతో  నిండిపోయింది . స్త్రీలు అందరూ భక్తి శ్రద్ధలతో .. 
శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ  శ్రీమత్ సింహాసనేస్వరీ !
చిదగ్ని కుండసంభూతా దేవకార్యసముద్యతా !
ఉద్యద్భాను  సహస్రాభా  చతుర్బాహుసమన్వితా !
రాగాస్వరూపాశారాధ్యా   క్రోధాకారాంకుశోజ్వలా !........ 
అని చేస్తున్న శ్రీ లలితా నామ పారాయణం నలు దిక్కులా మార్మోగుతోంది . పూజలందుకొంటున్న శ్రీ రాజరాజేశ్వరీదేవి పక్కనే ఉన్న శ్రీ విశ్వేశ్వరస్వామి వారిని గర్వంగా చూసింది . అమ్మవారి చూపుకి  ముగ్ధుడు అయిపోయాడు  భోళా  శంకరుడు . పరబ్రహ్మ స్వరూపిణి  చూపులోని అర్థం ... 
""సర్వం ఖల్వినమే వాహం  నాన్యదస్తి  సనాతనం " అన్న భావం . ఇదంతా నేను . నాకన్నా సనాతనం లేదు . ఆది పరాశక్తి నేను . "ఏకమేవాద్వితీయం బ్రహ్మ " వేదం ,బ్రహ్మ ఎప్పుడూ ఏకమే . త్రిమూర్తులు నిత్యం నిర్విరామంగా శక్తిని ధ్యానిస్తారు . మునీశ్వర్లు త్రికాలాల్లోనూ  సంధ్యగా కొలుస్తారు . హోమాలు అన్నిటిలోనూ స్వాహారూపిణి గా  ఆహ్వానిస్తారు . పితృకార్యాలలో స్వాధాస్వరూపిణి గా నమస్కరిస్తారు . అన్న సూచన ఉంది అమ్మవారి చూపులో . 
కుంకుమార్చన ముగిసింది . పాదాల చెంత కుంకుమ రాశితో  శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి శిలారూపం అత్యంత సుందరంగా ,అద్భుతంగా ఉంది . నాగాభరణం  అలంకరణతో ఉన్న ఈశ్వరుడు దేదీప్యమానంగా  ప్రకాశిస్తున్నాడు . 
"రేపే నా వైభోగం "అన్నట్లుగా  మనోహరంగా   చూసేడు  అమ్మవారి కేసి లింగాకారంలో ఉన్న పరమశివుడు  . మరునాడు తెల్లవారు ఝామునే  కళ్యాణం 
                                                               ... 
ఇదీ శివాలయం లోని దృశ్యం . దేవతామూర్తులకు  నమస్కరించి ఇంటి దారి పట్టారు  అందరూ .   "వేంకటాచలం  గారు తాఖీదు అందుకొన్నాక  ఏమి జరిగింది చిననాన్నా !" అని ప్రశ్నించాడు  మల్లవరం వెంకటేశ్వర్లు గారి  పుత్రుడు నాగేశ్వర రావు  దారిలో . ఉత్కంట భరించలేక ."ఇంటికి వెళ్ళాక చెబుతానురా"  అన్నాడు చంద్రుడు గారి అబ్బాయి . 
(ఇంకా ఉంది . తరువాయి చతుర్థ భాగంలో చదవండి . వచ్చే వారం .)
 నా చిన్ననాటి మిత్రుడు   పోతాప్రగడ వేంకట భీమేశ్వర రామ కృష్ణ బ్రహ్మం ఛాయా చిత్రాలతో రూప కల్పన చేసిన అద్భుతమైన బ్లాగు " గోదావరి సొగసులు -కోనసీమ అందాలు " నుండి కొన్ని చిత్రాలు మీ కోసం ..వచ్చే వారం వరకూ .....
 గోదారి సొబగులూ  .. కోనసీమ సౌందర్యాలూ   ఆస్వాదించండి
 


 


 










----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------










Wednesday, 24 December 2014

  శ్రీ వేంకటాచల వైభవం .        
              ద్వితీయ భాగం -02         
                              

జరిగిన కధ :  వంటిమామిడి అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ విశ్వేశ్వర స్వామి వారల  కళ్యాణ ఉత్సవాలు తిలకించడానికి భార్య బిడ్డ తో వస్తాడు పవన్ . పవన్ చిన కృష్ణమూర్తి గారి మనవడు . కళ్యాణ ఉత్సవాలకి వచ్చిన బంధు మిత్రులు చంద్రుడుగారి యింట్లో చిన్న నాటి కబుర్లు చెప్పుకుంటూ ఉండగా యర్రమిల్లి వంశ మూల పురుషులు శ్రీ వేంకటాచలం గారి గురించీ ,శివాలయ చరిత్ర గురించీ వాళ్ళ తరానికి చెప్పమని చంద్రుడుగారి అబ్బాయిని అడుగుతాడు . అందరి కోరిక మేరకు చెప్పడం ప్రారంభిస్తాడు చంద్రుడుగారి అబ్బాయి . ......... 
ఇక చదవండి .       
పాశర్లపూడి లంక .                               
   చుట్టూ  గలగలా గోదారి .                                        లంక గ్రామాలు . పల్లె ప్రజలు . గోదాట్లో ఇసక మేటలు  . గోదారి మీంచి  వచ్చే గాలికి ఉత్సాహంగా తలలు ఊపుతున్నకొబ్బరిచెట్లు .  అంతా పచ్చదనం . ప్రకృతి తివాచీ పరచినట్లు . 

                                                                                                                                                                                 
   


   గోదారి అలల్లో వజ్రపు మెరుపులా తళుక్కు మంటున్న నీరెండ . అద్భుతమైన వాతావరణం .
గోదావరిలో తెరచాప నావల కదలికలు .జాలర్ల వేట. 






ప్రకృతి అందాన్ని కాస్సేపు ఆస్వాదించిన యర్రమిల్లి 

వేంకటాచలం గారు గోదాట్లోకి దిగి సాయంసంధ్య ఆచరించి నది నుండి గట్టు మీదకు వచ్చి దర్భాసనం వేసుకొని వేదం వల్లె వేసుకుంటున్నారు . ఆయన నిత్యం ఉదయం ,సాయింత్రం క్రమం తప్పకుండా ఆచరించే కార్యక్రమం ఇది. 
యర్రమిల్లి వేంకటాచలం గారి పూర్వీకులది పాసర్లపూడి లంక . తరతరాలుగా గ్రామ కరణీకం యర్రమిల్లి వంశస్తులదే . కుటుంబానికి చెందిన పూర్వార్జిత స్థిరాస్తులు పాసర్లపూడి లంక చుట్టు ప్రక్కల ఉన్నాయి . 
అప్పటికి గోదావరి నది మీద ఆనకట్ట కట్టబడలేదు . వరద వచ్చినప్పుడు గోదారి గంగ ఉగ్ర రూపం దాల్చి లంక గ్రామాలన్నీ ముంచెత్తేసేది . వరద తగ్గిన తర్వాత అందంగా హొయలు పోతూ ప్రశాంతంగా ప్రవహించేది . వరద నియంత్రణ లేక పోవటంతో పంట రాబడి అంతంత మాత్రమే . కాటన్ దొరగారు వేల మైళ్ళు సర్వే చేసి గోదావరికి అడ్డుగా ఆనకట్ట నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్న రోజులు అవి. 
                                                  ...  
"కాఫీ టిపిన్లకి రమ్మంటున్నారు పెదనాన్నా "అంటూ వచ్చింది యర్రమిల్లి ప్రకాశరావు గారి అమ్మాయి రాజా . "సరేనమ్మా !" అని బదులు యిచ్చి "పదండిరా .
తిరిగి వచ్చాక చెప్పుకుందాం ."అన్నాడు చంద్రుడుగారి అబ్బాయి . కాఫీ టిఫిన్లు ముగుంచుకొని వచ్చాక తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు చంద్రుడుగారి అబ్బాయి . 
                                                    ... 
వేంకటాచలం గారిది సనాతన సాంప్రదాయ కుటుంబం . వేదం లో చెప్పబడినది ప్రామాణికంగా నమ్మి తు . చ . ఆచరించే జీవనం ఆయనది . అప్పటికి ఆయన వయసు పాతిక ఏళ్ళ ఫై మాటే .  వేదశాస్త్రాలు క్షుణ్ణంగా అభ్యాసించి ,వేదాలని అనుష్టించి సనాతన ధర్మాన్ని నిష్టగా పాటించి జీవిస్తున్న వ్యక్తీ . వేద శాస్త్రాల్లో నిష్ణాతుడు . కంచు కంఠం లాంటి స్వరం . ఆయన వేదపఠనం   చేస్తూ ఉంటే ఆయన కంఠం నుండి వెలువడే వేద ప్రకంపనలకి ముక్కోటి దేవతలు ఆశ్వీరదిస్తున్నారా అన్నట్లు ఉండేది వాతావరణం . వేంకటాచలంగారు రుద్రం పారాయణ చేస్తే సాక్షాత్ పరమశివుడు కైలాసంలో  తాండవం  చేస్తున్నాడా అన్నట్లు అనిపించేది . అటువంటి అనుభవం చాలా మందికి కలిగేది అప్పట్లో . 
నిత్యం వేద పారాయణం ,గోదారి ఒడ్డున సంధ్యావందనం ,ఈశ్వర భక్తితో గడిచి పోతున్న జీవితం వేంకటాచలం గారిది . అందుకు తగ్గట్టు అనుకూలవతి ,సనాతన ధర్మాన్ని గౌరవించే భార్య సహకారంతో ఏ ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా జీవితం గడిచిపోతున్న సమయంలో వచ్చి పడింది ఓ పిడుగు లాటి తాఖీదు . 

(ఇంకా ఉంది . తరువాయి తృతీయ భాగం లో . వచ్చే వారం .వేచి చూడండి . )

               
                               
           

Friday, 19 December 2014



శ్రీ వేంకటాచల  వైభవం
         


                                         ప్రధమ భాగం -01

మాఘమాసం .... చలి కొంచం తగ్గుముఖం పడుతున్న రొజులు. 
అప్పటివరకూ నిస్తేజంగా మత్తులో జోగుతున్న వంటిమామిడి అగ్రహారం ఒక్కసారిగా నిద్ర లేచింది . సింహం జూలు విదిల్చినట్లుగా . కారణం . ప్రతి సంవత్సరం మాఘ శుద్ధః  ఏకాదశి నుండి మాఘ శుద్ధః పౌర్ణమి వరకూ అగ్రహారంలో వేంచేసి ఉన్న 
శ్రీ రాజరాజేశ్వరీ విశ్వేశ్వర స్వామి వారల కళ్యాణ ఉత్సవాలు . 

బ్రాహ్మణ వీధి . శివాలయానికి దారి . అంతా బంధు మిత్రుల సందడి . కోలాహలం . అగ్రహారం అంతటా పండగ వాతావరణం .

     

       


చంద్రుడు గారి  ఇల్లు  కళ్యాణ ఉత్సవాలకి వచ్చిన బంధుమిత్రులతో నిండిపోయి పూర్ణ గర్భిణిలా నిండు గోదారిలా ఉంది . చాన్నాళ్ళ తర్వాత కలుసుకున్న కుటుంబ పరివారం పలకరింతలు ,చిన్ననాటి ముచ్చట్లు ,అలనాటి వైభావాలు గుర్తు చేసుకుంటున్న వేళ ..... 
"ప్రతిష్ట బ్యాచీ వేరూ ! కల్యాణం బ్యాచీ వేరూ అన్న మాట " అంది   మాగాపు కామేశ్వరి యాదాలాపంగా.  ఇంటికి వచ్చిన చుట్టాలకి కాఫీ ,పలహారాలు "శివాలిక్ హోం " నుండి అటుగా తీసుకొని వెడుతూ . 
హైదరాబాదు నుండి వచ్చిన  చిన కృష్ణమూర్తి  గారి అమ్మాయి మహాలక్ష్మి మరుసటిరోజు అమ్మవారికి జరిగే లక్ష కుంకుమార్చన కోసం పట్నం నుండి తెచ్చిన బంతి ,చామంతి పూలు దారంతో  గుచ్చుతూ పూల మాలలు చేస్తున్నదల్లా మాగాపు కామేశ్వరి అన్న మాట విని "అదేంటిరా ! తమ్ముడూ !అలా అంటుంది కామేశ్వరీ "అంది చంద్రుడుగారి అబ్బాయితో తెగ బాధపడిపోతూ .  
"పోనీ లెద్దూ "అన్న చంద్రుడు గారి అబ్బాయి సమాధానం విన్న తర్వాత మాలలు 
గుచ్చటంలో మునిగిపోయింది మహాలక్ష్మి . 
                                                        ...... 
ఈ మధ్యనే వివాహం చేసుకొని బిడ్డకు తండ్రి అయిన చిన కృష్ణమూర్తి గారి  మనవడు పవన్  దేవుని కళ్యాణ వైభోగం చూపించడానికి భార్య బిడ్డతో వచ్చాడు ఈసారి . 
చంద్రుడుగారింట్లో  ఆరుబయట వాకలి . అందరూ వాకిట్లో కూర్చొని కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ ఉండగా .... 

"మన వంశ కూటస్థులు వేంకటాచలం గారి గురించీ   , మన శివాలయం చరిత్ర గురించీ  నీకు బాగా  తెలుసు అని వీరంతా అంటున్నారు . మాకు కూడా తెలుసుకోవాలని ఉంది . చెబుతావా పెదనాన్నా "అన్నాడు పవన్ చంద్రుడుగారి అబ్బాయితో . 
"అలాగే !తప్పకుండా !. ఇది తెలుసుకోవాలంటే చరిత్ర పుటల్ని  రెండు  వందల సంవత్సరాలు వెనక్కి తిరగ వెయ్యాలి .ఆసక్తిగా వింటారా మరి" అన్నాడుచంద్రుడుగారి అబ్బాయి . 
"భేషుగ్గా వింటాం " అన్నారు అందరూ ముక్త కంఠంతో . 
 అమ్మవారినీ , స్వామివారిని , పిత్రుదేవతలని మనస్సులో తలచుకొని చెప్పడం ప్రారంభించాడు చంద్రుడుగారి అబ్బాయి .  
                                 (  ఇంకా ఉంది .తరువాయి ద్వితీయ భాగంలో. వచ్చే వారం )