భాద్రపద మాసే .......
శ్రావణ మాసం వచ్చిందీ అంటే తెలుగునాట పండగల హడావుడి మొదలు . పట్టు చీరల రెపరెపలు ,అప్పుడే లంగా ఓణీలు వేసుకొని జడ గంటలు అలంకరించుకొన్న జడలు ఎలా ఊగుతున్నాయో వెనకెనక్కి అస్తమానం చూసుకునే బా .మ్మ (బాపు బొమ్మ )ల హడావుడీ ,పేరంటాలూ ,వాయినాలూ ,మంగళ గౌరీ వ్రతాలూ ,మోచేతుల వరకు అలంకరించుకొన్న గాజులతో పాటు తోరం కట్టుకొన్న లక్ష్మీ సౌభాగ్యవతులూ... ఓహో .... అంతా సందడే సందడి . భాద్రపద మాసం లో వినాయకచవితితో పండగ వాతావరణం ఊపు అందుకుంటుంది . దేవీ నవరాత్రులు, దీపావళి ,సంకురాతిరి పండగలతో వాతావరణం పరాకాష్టకి చేరుతుంది .
....
యర్రమిల్లి సుబ్బారాయుడు గారు ధ్యానం , వేదపారాయణం ముగించుకొని పర్ణశాల లాంటి తాటాకుల పాకలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా , చిలికిన మజ్జిగ గళాసు నిండా అందిచింది సుబ్బమ్మ గారు . అప్పుడే కొత్తగా నేసిన పాక మూలాన తాటియాకుల పచ్చి వాసన అదో విధమైన పరిమళం నింపుతోంది గాలి వాటున .
యర్రమిల్లి సుబ్బారాయుడు గారు ధ్యానం , వేదపారాయణం ముగించుకొని పర్ణశాల లాంటి తాటాకుల పాకలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా , చిలికిన మజ్జిగ గళాసు నిండా అందిచింది సుబ్బమ్మ గారు . అప్పుడే కొత్తగా నేసిన పాక మూలాన తాటియాకుల పచ్చి వాసన అదో విధమైన పరిమళం నింపుతోంది గాలి వాటున .
...
సుబ్బమ్మ గారి అప్పగారు లక్ష్మీనరసమ్మ . సుబ్బారాయుడుగారి ఇంటికి అసింటా తూర్పున దక్షిణ ముఖద్వారం గల మండువా లోగిలి లక్ష్మీనరసమ్మ గారి భర్త జగత్పతిగారిది . సుబ్బమ్మ, లక్ష్మీనరసమ్మగారికి స్వయానా చెల్లెలు . సుబ్బారాయుడి గారి తండ్రి సహోదరుని కుమారుడు జగత్పతి గారు . జగత్పతి,లక్ష్మీనరసమ్మ గార్లకు పదహారు సంవత్సరాల కాలం తర్వాత కలిగిన మూడవ సంతానం చంద్రుడు గారు .
చంద్రుడు గారిని ఊర్లో అందరూ "చిన చంద్రుడు " అంటారు . తునిలో కాపురం పెట్టుకొని స్థిరపడిన యర్రమిల్లి జగన్నాధరావు గారి అబ్బాయి పేరూ చంద్రుడే కనుక ఆయన్ని "పెద చంద్రుడు " లేక "తుని చంద్రుడు" అని పిలిచేవారు బంధువర్గం . చిన చంద్రుడు గారిని బి . కాం . చంద్రుడు అని కూడా చదూకున్నవారు వ్యవహరించడం ఆ తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చింది .
...
అల్లం ,మిరియం ,కరివేపాకు వగైరాలతో కలిపి సుబ్బమ్మ గారు ఇచ్చిన తేట మజ్జిగ సుబ్బారాయుడుగారు ఆస్వాదిస్తున్న ఆ సమయంలో కర్రకి కట్టిన గజ్జెలు చప్పుడు చేస్తూ ముంగిట నిలుచున్నాడు వార్తాహరుడు . ఈ కాలం మాటలో చెప్పాలంటే " కొరియర్ ". రొంటిన ఉన్న చీటీ సుబ్బారాయుడుగారికి అందించాడు వచ్చిన వార్తాహరుడు . అది చూసి అతనికి అర్థ ణా బహు మతిగా ఇచ్చి పంపించారు సుబ్బారాయుడు.
...
సుబ్బారాయుడుగారికి కుటుంబంలో సంభవించిన శుభకార్యాలు , శుభవేళలు , శుభవార్తలు , వంశస్తుల జనన వివరాలు చిట్టా పుస్తకంలో నమోదు చేసుకోవటం ఎప్పటినుంచో ఉన్న అలవాటు . వార్తాహరుడు అందించిన చీటి చూసుకొని సుబ్బమ్మగారికి అందులోని శుభవార్త తెలిపి తన చిట్టా పుస్తకంలో వివరం వ్రాసుకున్నారు ఇలా . "స్వస్తిశ్రీ విక్రమనామ సంవత్సరం భాద్రపద బహుళ షష్టి సోమవారం ది. 23. 9. 1940 సంవత్సరం మధ్యాహ్నం వంటి గంట యాభయి ఐదు నిమిషాలకు రోహిణి నక్షత్రమున జగత్పతిగారి కుమారుడు రామచంద్రరావుకు బరంపురంలో పుత్ర జననం . చిరాయుస్తూ . శ్రీ శ్రీ శ్రీ ".
సదరు జాతకుడు అయిన నాకు 65 సంవత్సరాల తర్వాత ఈ చిట్టా అనూహ్యంగా లభించింది. ఇది ఉపోద్ఘాతం .
...
వికృతి నామ సంవత్సరం . భాద్రపద మాసం . బహుళ షష్టి . ప్రతిరోజూలాగే ఆ రోజూ తెల్లారింది . వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు ఆ రోజు కురవలేదు . సూర్యుడు వెలిగిపోతున్నాడు . సూర్యుడిలాగే నేను కూడా వెలిగిపోతున్నాను. ఉదయం స్నానపానాదులు ముగించుకొని నూతన వస్త్రాలు వేసుకొందామంటే రెడీగా లేవు . "ఎలా" అని అనుకుంటూ ఉంటే గురుకొచ్చింది అప్పుడెప్పుడో మేనకోడలు శ్రీలక్ష్మి కొత్త బట్టలు ఇచ్చిన విషయం . సెంటిమెంట్ కి ప్రాధాన్యం ఇచ్చి మేనకోడలు తాతా శ్రీలక్ష్మి ఐదు ఏళ్ల క్రితం బహుమతిగా ఇచ్చిన కొత్తబట్టలు వేసుకొని జన్మదినం గడుపుకోవాలని నిర్ణించుకున్నా.
ఇదు ఏళ్ల క్రితం ఒక పంట్లాం శ్రీలక్ష్మి బహుమతిగా ఇచ్చింది . "మరి చొక్కా ఎదీ !" అని అడిగితే "రెండో విడతలో ఇస్తాలే "అని చెప్పి "యా ..... యా ..... "అంటూ సెల్ ఫొను చెవికి అతికించేసుకుంది . రెండో విడతకోసం ఎదురు చూస్తున్న నేను "ఆ విడత ఇంకా రాలేదేంటబ్బా "అని నిరుత్సాహపడకుండా పంట్లాం తో సరిపెట్టేసుకొని జన్మదినం కానిచ్చేశాను .
ఉదయం 7 గంటలు .
టెలిఫోను మ్రోగింది . అవతలవైపు రాజప్ప అలియాస్ ఇవటూరి లక్ష్మీరావ్. జన్మదిన శుభాసీస్సులు తెలుపుతూ నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అరగంట తనే మాట్లాడి ఫోను పెట్టేసింది .
ఉదయం 8 గంటలు .
ఈ సారి తాతా శ్రీలక్ష్మి ఫోను . "హ్యాప్పీ బర్త్ డే మావయ్యా !ఆఫిసు పనిలో మరచిపోతానని ఆఫీసుకి రాగానే చేస్తున్నా ఫోను . "అంది శ్రీలక్ష్మి . "థాంక్యూ "అని జవాబు ఇచ్చి శ్రీలక్ష్మి పెట్టిన బట్టలు వేసుకొని లానులో పచార్లు చెయ్యటం మొదలెట్టాను గర్వంగా ఛాతీ విరగదీసుకొని . అప్పుడే గేటు తీసుకొని పనికి వచ్చిన సింహాచెలం నా దర్జా ,ఠీవీ చూసి నివ్వెరపోయి లోపలికి వెళ్లి చెప్పింది చంద్రుడుగారి కోడలితో యిలా .
"అదేంటండీ అమ్మగారూ !పైన చొక్కా వేసుకోకుండా బయట అయ్యగారు తిరిగేస్తున్నారూ. ! అది వింటూనే చంద్రుడిగారి కోడలు వచ్చి ప్రశ్నించింది .
"ఇదేంటీ ఈ అవతారం. "
"ఇవి శ్రీలక్ష్మి ఇచ్చిన బట్టలు . "అని గర్వంగాబదులు చెప్పాను . " చొక్కా ఎదీ . "
"దంజెం పోగు ఉందిగా . ఎలా ఉంది నా స్టైల్ . "అని అడిగా .
"గోడకి కొట్టిన పిడకలా ఉంది . "అని నా గాలి తీసేసింది చంద్రుడుగారి కోడలు . అలా అని "ఇప్పుడు 8. 28 నిమిషాలు అయింది . సరిగ్గా 8. 30 నిమిషాలకి పాలు ఉన్న బర్నర్ ఆపేసి 8. 32 నిమిషాలకు స్టవ్వు పూర్తిగా ఆపేయండి . "అని ఆర్డర్ వేశి పూజ గదిలోకి దూరిపోయింది . అసలే పిదతలాంటి నా మొహం లక్క పిడతలా మారిపోయింది . పిడక కామెంట్ కి .
గం . 8. 32 నిమిషాలు . అప్పటివరకూ "ఆయతనాం భవతి "అన్న మంత్రాలు ఆగిపోయి "స్టవ్ పూర్తిగా ఆపేసారా "అని గావు కేక వినపడింది .ఇంకా కాస్సేపు ఇక్కడ ఉంటే పూర్తిగా వంట చేయవలసి వస్తుందేమోనన్న భయంతో మెట్లెక్కి డాబా ఎక్కేసాను .
అపరాహ్ణం . అంతవరకూ తాతా శ్రీలక్ష్మి ఇచ్చిన కొత్తబట్టలు వేసుకొని రాంప్ మీద మోడల్ లా ఇంటా బయటా తెగ తిరిగిన నేను "ఇక చాలు"విశ్రాంతి తీసుకుందాము అనుకుంటూ ఉంటే ఫోను మ్రోగింది . " హ్యాపీ బర్త్ డే మావయ్యా "అంటూ గ్రీటింగ్స్ చెప్పింది పెద్ద మేనకోడలు విప్పగుంట పద్మావతి . పంజాగుట్ట మీంచి శ్రీనగర్ కాలనీ మీదుగా పోయే సిటీ బస్సులంత స్పీడుగా . ఆ తర్వాత "ఉండు . పప్పా మాట్లాడుతారు "అని పప్పాకి ఫోను ఇచ్చింది . వరద వచ్చి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ప్రవహించే గోదావరిలా వడ్డాది శ్రీరామకృష్ణ గొంతు . "మీ దంపతులిద్దరికీ మా అందరి గ్రీటింగ్స్ . ఆయురారోగ్యాలతో సుఖ జీవనం గడపాలని ఆశీస్సులు . సర్వే జనా సుఖినో భవంతు "అన్నాడు శ్రీరామకృష్ణ . అలా చెప్పిన తర్వాత "వా ............."అని నాకు అర్థం కాని భాషలో మళ్లీ ఆశీర్వదించాడు . ఒకటి కొంటే రెండోది ఉచితం అన్న పండగల ఆఫర్ మాదిరిగా . రెండవ ఆశీర్వచనం భాష అర్థం కాకపోయినా "థాంక్యూ ... థాంక్యూ "చెప్పాను . ఫోను పెట్టెయ్యకుండా "ఉండు . మీ చెల్లాయి మాట్లాడుతుంది "అని చెల్లాయి వడ్డాది రంగనాయకమ్మకి ఇచ్చాడు . బర్త్ డే విషెస్ చెప్పి "వంటిమామిడి వెళ్లి పెద్ద శివాలయంలో దేవుని దర్శనం చేసుకో" అని నా సెంటిమెంట్ మీద తిరుగులేని దెబ్బ వేసింది రంగనాయకమ్మ .
రాత్రి భోజనం చేసి పడుకుందామన్న సమయంలో ఫోను మ్రోగింది . ఆఖరి మేనకోడలు విష్ణువర్జ్హ్హుల హిమబిందు ఫోను .
"వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మావయ్యా" అంది హిమబిందు .
"థాంక్స్ అమ్మా "
"పుట్టిన రోజు ఎలా జరుపుకున్నావ్ "అడిగింది హిమబిందు .
"పర్వాలే . బాగా జరిగింది ".
"కొత్త బట్టలు కొనుక్కున్నావా?""లేదమ్మా!శ్రీలక్ష్మి ఇచ్చిన కొత్త పంట్లాం వేసుకొని పుట్టిన రోజు జరుపుకున్నా !"అన్నాను .
"మరి చొక్కా "
"రెండో విడతలో ఇస్తానంది శ్రీలక్ష్మి "
"వచ్చే పుట్టిన రోజుకి చొక్కా నే కొనిపెడతాలే"అంది హిమబిందు .
ఈ ఆఫర్ కి నా గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి .
"వద్దులే అమ్మా "అన్నా .
"ఏం ! " అని ప్రశ్నించింది హిమబిందు .
"పర్వాలేదు . చొక్కా మాత్రం కొనద్దు " అని బతిమాలా .
"తాట తీస్తా !చొక్కా కొని తీరుతా ! " అని బెదిరించి ఫోను పెట్టేసింది హిమబిందు .
భాద్రపద మాసం వస్తోంది అంటే గుండెదడతో నిద్రపట్టటంలేదు .
ఇది జరిగి ఐదు సంవత్సరాలు గడచిపోయాయి . ఇప్పుడు జయనామ సంవత్సరం
భాద్రపద మాసం . ఇంతవరకూ చొక్కా జాడలేదు .
ఉపద్రవం తప్పింది అని ఆనందపడుతున్నాను .
భవితవ్యం ఎలా ఉంటుందో ?
.......
1 comment:
Very well written..I will present T shirt on your next b,day.
Post a Comment