Saturday, 26 November 2016




మహాదేవ శంభో !
                                           tag line........ 
రాజుగారి  ట్రంక్ పెట్టి . 
*******************************


   సాయింత్రం  ఆరున్నర గంటలు .  నేను , కల్నల్  రంగారావు ఆఫీసర్స్  క్లబ్  లాంజ్  లో  బ్రిడ్జి  టేబుల్  వద్ద    కూర్చొని తతిమ్మా  మిత్రుల కోసం  అసహనంగా  ఎదురు చూస్తున్నాం.
 కల్నల్  రంగారావు ,  చలపతి  , రామలింగం  ,రమణమూర్తి  నా  ఆప్తమిత్రులు  .  ప్రభుత్వంలో  వివిధ శాఖలలో విధులు  నిర్వర్తించి  రిటైర్  అయిన విశ్రాంత  ఉద్యోగులం . బాధ్యతలు తీరిపోయాయి . అందువలన  కాలక్షేపానికి   కావలిసినంత  టైం  మా అందరికీ . 
 ప్రతి రోజూ  సాయింత్రం  ఆఫీసర్స్  క్లబ్  లో  కలుసుకొని కనీసం  ఓ రెండు  రబ్బర్లు   బ్రిడ్జి ఆట  ఆడటం మా  దైనందిక చర్య. 

రంగారావు  ఆర్మీ లో  ఆర్డినెన్సు  కోర్ ( AOC ) లో పనిచేశాడు .  ధైర్యసాహసాలు  ఎక్కువ . 'జీవితం అనుభవించాలి గాని  దాచుకోవడానికి కాదోయ్ " అంటాడు ఎల్లప్పుడూ . స్నేహానికి  విలువని ఇచ్చే  మనిషి . 

చలపతి  ఆదాయపు పన్ను  శాఖలో  ఉన్నత ఉద్యోగిగా పనిచేసిన వ్యక్తి .  సాహిత్యం  అంటే మక్కువ . భావుకుడు.  గ్రంధాలయాలూ, పుస్తక ప్రదర్శనలు ఎక్కడ ఉంటే  అక్కడ తప్పనిసరిగా  కనిపిస్తాడు చలపతి.   సమాజంలో ఉన్న ప్రతి అరాచకం మీద  మితి మిక్కిలిగా స్పందించి , అక్రోధన , ఆవేశం చివరకు నిస్సాహాయత   పడే మనస్తత్వం . 

ఇక రామలింగం.  వాణిజ్య పన్నుల శాఖ  అధికారిగా  రిటైర్ అయిన  మిత్రుడు .  అధిక బరువు తగ్గించుకుంటే ఆరోగ్యానికి మంచిది అని సతీమణి  అస్తమానూ  సతాయిస్తూ ఉంటే , ఆమె  నస  తప్పించుకోవడానికి  '   యోగా శిక్షణ ' అన్న చిట్కా ఉపయోగించి , ఆ నెపంతో సాయింత్రం క్లబ్  లో హాజరు.   ఇంటికి చేరాక  ' పాపం ! బాగా అలిసిపోయి వచ్చారు ' అని భార్య విందు భోజనం వడ్డిస్తే  మహదానంద పడిపోయే  సరదా మనిషి.    

రమణమూర్తి  ప్రభుత్వ రంగ  బ్యాంక్  లో  దేశంలోని  వివిధ ప్రాంతాల్లో  పనిచేశి    జీవితం దిలాసాగా ఆనందించే  మనిషి . నిగర్వి  .   విమర్శలు లైట్  తీసుకొనే సహృదయుడు . స్నేహితులకి సకల మర్యాదలు  చేయటం అంటే మహా   సరదా.   

  ' అదిగో ! వస్తున్నారురా ! ' అన్నాడు  ఉషారుగా  కల్నల్  నన్ను ఉద్దేశించి . 
చలపతి ,రామలింగం, రమణమూర్తి  వచ్చి కూర్చొని  'సారీ ! కల్నల్ ! " అన్నారు ముక్త కంఠంతో . 
' ఇంకెందుకూ ఆలస్యం " అని పేక ముక్కలు  పంచడానికి  ఉపక్రమించాడు కల్నల్ .  నాది ఎప్పుడూ ప్రేక్షక  పాత్రే . వాళ్ళు నలుగురూ ఆటలో మునిగిపోయారు .  ఆటలో నిమగ్నమవడంతో  గమనించలేదు.  బయట వాతావరణం  అకస్మాత్తుగా క్షణాలలో  మారిపోయింది . ఒక్కసారిగా బలమైన  ఈదురు గాలులు వీచాయి . ముందు జాగ్రత్తగా  కరెంటు వాళ్ళు కరెంటు  తీసేసారు . అంతటా  అంధకారం . చిమ్మ చీకట్లు నగరాన్ని కమ్మేశాయి .  ఇంకొంత సేపటికి చినుకులు రాలడం మొదలయింది .  కాస్సేపటికి చినుకులు కాస్తా  హోరు వానగా మారింది .  క్లబ్ అటెండర్ వచ్చి  కొవ్వొత్తులు వెలిగించాడు , మా పేకాట అటకెక్కింది ఆ రోజుకి . మిగాతా టేబుల్స్ వద్ద మెంబెర్స్  బార్ అటెండర్ కి కావలసిన సరంజామా  ఆర్డర్ ఇస్తున్నారు , 
' ఇప్చ్ ! గ్రాండ్ స్లాం  తప్పింది' అన్నాడు  కల్నల్ . చేతిలోని పేక ముక్కలు విసురుగా పడవేస్తూ . 
'  గుర్రం ఎక్కుతానోయి ' అన్నాడు కల్నల్ రంగారావు రమణమూర్తి కేసి చూసి .
' నాకు రేసు  గుర్రం కావాలి . పూర్తిగా కిక్ ఎక్కీతేగాని మజా లేదు ' అన్నాడు రామలింగం  . 
రమణమూర్తి  సకల మర్యాదల ఏర్పాటుకై లోపలికి వెళ్లి కాస్సేపటికి  వచ్చి కూర్చున్నాడు . తన పని అయిపోయిందన్నట్లుగా. 
కొంతసేపటికి  గుర్రం , రేసుగుర్రం  , సోడా , మినరల్ వాటర్ , వేడి వేడి  మిరపకాయ బజ్జీలు , మసాలా జీడిపప్పు  మా టేబుల్  చేరాయి . 
కల్నల్  గుర్రాన్ని ఆస్వాదిస్తున్నాడు .  గొంతు లోంచి వెచ్చగా దిగుతోంది . 
రామలింగం  రేసు గుర్రం పని పట్టి   హడావుడిగా రెండు గళాసులు బిగించాడు .' ఈ రోజు మత్తులో మునిగి కింద పడి దొర్లేయాలి  ' అంటూ .  మిగతా జనం  బజ్జీలు , జీడిపప్పు మీద దాడి చేసాం .
రామలింగం  వాఖ్యలకి  కల్నల్  గాఠిగా  నవ్వాడు . కారణం  రామలింగం  రేసుగుర్రం  కోడ్ భాష " కోక్ " . 
అలా రాత్రి కరిగి పోతోంది . 
కాలక్షేపం కోసం నేను ' చలపతీ ! నీ  ఉద్యోగ  బాధ్యత  నిర్వహణలో  మరిచిపోలేని  సంఘటన  ఒహటి  చెబుదూ ! ' అని ప్రతిపాదించాను . 
చలపతికి  ఏ విషయమైనా  అందరినీ  ఆకట్టుకొనేలా చెప్పే ప్రావీణ్యం  ఉంది . నా ప్రతిపాదన మిగతావారు  ఏకగ్రీవంగా సమర్ధించటంతో  చలపతి  అంగీకరించక తప్పలేదు .   
చలపతి చెప్పటం ప్రారంభించాడు . 
                                                 ***
 " ఈ  సంఘటన  నేను  డైరెక్ట్  recruit  ఆదాయపు పన్ను అధికారిగా   (ITO)  చేరిన కొత్త లో జరిగింది . 
ఉడుకు రక్తం .  ఉత్సాహం . అప్పట్లో . నీతి ,నిజాయితీ ఎట్టి 
    పరిస్థితుల  లోనూ తాకట్టు పెట్టకూడదన్న  దృఢసంకల్పం .  కృషి తో ఉన్నతాధికారుల  మెప్పు పొందాలన్న పట్టుదల .  ఆశయాలు , లక్ష్యాలు   సహజంగా కొత్తగా ఉద్యోగం లో చేరే  యువతలందరిలోనూ ఉన్నట్లు   నా లోనూ బలంగా ఉన్నాయి . 

ఒకరోజు  ఆఫీస్ లో పెండింగ్  ఫైల్స్  చూసే   పనిలో ఉండగా కమీషనర్ గారి వద్ద నుండి పిలుపు  వచ్చింది .
 వెళ్లాను . 
రూంలోకి  వెళ్ళగానే ' రా ! చలపతీ " అని కుర్చీ చూపించారు. ఆ వెంటనే ఛాంబర్ బయట ఉన్న రెడ్ లైట్  ఆన్  చేశారు . రెడ్ లైట్  దీపం ఛాంబర్  బయట  వెలుగుతూ ఉందంటే కమీషనర్ గారు ముఖ్య మైన సమావేశం లో ఉన్నారు . ఇతరులు ఎవ్వరికీ ప్రవేశం లేదని సంకేతం . 
నేను కూర్చోగానే  టేబుల్ సొరుగు తెరిచి  ఓ కాగితం అందించారు కమీషనర్  నా చేతికి . చదవండి అన్నట్లుగా .  ఆశాంతం   చదివితే తేలిన సారాంశం ఇది . 
అది ఒక ఆకాశ రామన్న లేఖ.  గోదావరీ తీర ప్రాంతం  సఖినేటిపల్లి లో ఒక సంపన్న ఫలానా  రాజు గారి కుటుంబం ఉందనీ , వారి వద్ద వడ్డీ వ్యాపారం మరియు ఇతరత్రా లావాదేవీల  వల్ల   లెక్క  చూపని  సుమారు ఏభై లక్షల  నల్లధనం , లెక్కలేనంత  బంగారం ,వెండి  నిల్వలు ఉన్నాయని అందువలన చట్టపరంగా తగు  చర్యలు     ఆదాయ శాఖ  అధికారులు   తీసుకొన వలిసినది అని
 పిర్యాదు .  
 లేఖ చదివిన తర్వాత  'మీ ఆదేశం ఏమిటి '   అన్నట్లు  కమీషనర్ గారి వైపు చూసాను . 
'చలపతీ ! ఇటువంటి  ఆకాశ రామన్న ఉత్తరాలు  పెద్దగా పట్టించుకోనక్కరలేదు .  కానీ  మన దృష్టికి వచ్చింది కనుక " ఏ  పుట్టలో ఏ పాము ఉందో " అన్న సంశయం ఉంటుంది' అన్నారు సాలోచనగా . 
' సార్! ఇది కొంత  ఆలోచించ దగ్గ విషయం .పిర్యాదు లేఖలో వ్రాసినంత  ధనం , ఆభరణాలు  దొరకక పోవచ్చు . కనీసం ఒక ఇరవై  లక్షలు పట్టుబడినా  మన టార్గెట్  అందుకోగలం ' అన్నాను ఉత్సాహంగా . 
' సరే !  సెర్చ్  చేద్దాం .   కాకినాడ  ఐటిఓ (ITO) గారి   సహాయ సహకారం కూడా  తీసుకో ' అని సెర్చ్ అనుమతి ఇచ్చారు . 
  ఆకాశరామన్న లేఖ తీసుకొని కమీషనర్ గారి చాంబర్ నుంచి బయటకు వచ్చాను . 
ఎర్ర దీపం  బదులుగా ఆకుపచ్చని దీపం వెలిగింది ఛాంబర్ బయట .
 నాకు అది మొదటి సెర్చ్ రైడ్ జరపటం  మూలాన్న చాలా థ్రిల్లింగ్ గా  అనిపించింది .   
సెర్చ్ రైడ్  తేదీ  నిశ్చయమైంది . 
కాకినాడ    ఐటిఓ  (ITO)  నరసింహం కి ఫోన్ చేసి  'గురూ ! రేపు టిఫిన్ కి వచ్చెయ్యండి " అన్నాను . 
' ఎంతమంది ? ' అన్నాడు నరసింహం . 
' నలుగురు చాలు" అన్నా . 
' ఎక్కడ' అన్నాడు  నరసింహం . 
'సఖినేటిపల్లి ' . 
సెర్చ్ రైడ్ ఆపరేషన్ కోడ్ "టిఫిన్ ". 

                                                        ***
ఉదయమే మా బృందం    సఖినేటిపల్లి చేరుకుంది . ఆకాశ రామన్న లేఖలో ఇచ్చిన వివరం మేరకు  రాజు గారి  ఇల్లు చేరుకున్నాము . ఊరి  చివర్లో సుమారు ఎకరా విస్తీర్ణం గల  కొబ్బరి తోటలో  రాజు గారి డాబా . బయటికి సామాన్య మధ్య తరగతి    వారి ఇల్లులా అనిపించింది . 
 తలుపు తట్టాము . 
 ' ఎవరూ ! ' అంటూ  సుమారు ముప్పై ఐదేళ్లు మించని  స్త్రీ   తలుపు తెరిచింది . 
ఆమెను చూస్తూనే  మేము వచ్చిన పని  కొద్ధి క్షణాలు మరిచిపోయాం . ఈమె  మానవ స్త్రీ యా  లేక  దేవతా స్త్రీ యా  అని అనిపించింది . అద్భుతమైన సౌందర్యం . గంధర్వ , కిన్నెర  స్త్రీల అందం  ఆమె ముందు  దిగడుపే . ముల్లోకాలలోని   సౌందర్యం అంతా  ఒక రాశి గా పోస్తే  ఎలా వుంటుందో   అలా ఉంది ఆమె అందం . 
కార్తీక మాసం  అవటంవల్ల  తలస్నానం  చేసి వచ్చిన  ఆమె  నీళ్ళోడుతున్న జుట్టుని  తుండుతో  చుట్టుకుంది . 
సంబ్రమ ఆశ్చర్యం నుండి తేరుకున్న నేను   ' రాజు గారి తో పని ఉంది తల్లీ ! వారిని ఒహసారి పిలవండి .' అన్నాను . 
ఆమె మొహంలో కళ తప్పింది . నా మాట వినగానే . 
' రాజుగారు కాలం చేసి  ఆరు నెలలు దాటింది  బాబూ '  అంది ఆమె దీనంగా . 
ఆమె అందానికి ముగ్ధులైన మేము అప్పటి వరకు   ఆమె ముఖాన బొట్టు లేదన్న సంగతి గమనించలేదు . 
' మీరు రాజుగారికి ఏమవుతారు ? ' అని ప్రశ్నించా . 
' నేను రాజు గారి భార్యను ' అంది  ఆమె . 
మేము వచ్చిన పని ఆమెకు వివరంగా అర్ధమైనట్లు
 చెప్పాను .
 ' నేను పెద్దగా చదువుకోలేదు బాబూ ! ఇవన్నీ నాకేమి అర్థమవుతాయి' అంది ఆమె.
' ప్రభుత్వ ఉద్యోగులం .  మా డ్యూటీ మేము చేయాలి కదమ్మా! . మీ ఇల్లు పూర్తిగా సోదా చేయాలి .  పోనీ మీ బంధువులు గాని   సన్నిహితులు  గాని ఎవరైనా ఉంటే వారిని పిలవండి . వారి సమక్షం లో సోదా తనిఖీలు చేస్తాం ' అన్నాను నేను . 
   ' ఈ ఊర్లో  రామన్న పంతులుగారు  రాజు గారి  స్నేహితులు . వారికి రాజు గారి వ్యవహారాలూ అన్నీ  తెలుసు . పంతులు గారిని  రమ్మని కబురు అంపిస్తాను ' అంది  రాజు గారి భార్య.  
' అలాగే తల్లీ " అని పంతులు గారి రాక కోసం ఎదురు చూస్తున్నాము . 
రాజు గారి భార్య వచ్చి  ' పంతులుగారికి  కబురు పెట్టాను బాబూ.  వారు వచ్చేలోగా మీకు కాఫీ , ఫలహారం  ఏర్పాట్లు చేయిస్తాను ' అంది ఆప్యాయంగా . 
సున్నితంగా తిరస్కరించాను .  
కాస్సేపటికి  ఓ వ్యక్తి  వచ్చారు . ' బాబూ ! వీరే  రామన్న పంతులుగారు ' అని పరిచయం చేసింది  రాజుగారి భార్య .
పంతులుగారు  నమస్కరించారు . ప్రతివాదం చేశాం  బృంద సభ్యులం . 
రామన్న పంతులుగారు మేము ఊహించుకున్న దానికి భిన్నంగా ఉన్నాడు . పంతులు గారంటే పంచెకట్టు ధోవతి, అంగవస్త్రం,  నుదుటిన బొట్టు తో ఉంటారని మేము ఊహించాము . ఆయన సాధారణంగా మన అందరిలానే ఉన్నాడు . స్ఫురద్రూపి . ఆజానుబాహువు . దబ్బపండు ఛాయ . మన్మధ రూపం . అందగాడు . వయసు నలభై అయిదు సంవత్సరాలు ఉండవచ్చు . వయసుకి తగ్గ గాంభీర్యం . 
పంతులు గారికి  మేము వచ్చిన పని వివరించాము .  ఆయన రాజు గారి భార్యతో సంప్రదింపులు జరిపి  'మీ పని కానివ్వండి  ' అన్నాడు .
 రాజు గారి భార్య గదులు తెరిచి  బీరువాలు , అలమారాల  తాళాలు  అందించింది  తత్తరపాటు లేకుండా . 
మా బృందం పనిలో పడింది .  క్షుణ్ణంగా సోదాలు చేసి  దొరికిన దస్త్రాలు, నగలు , నగదు    నా ముందు పెట్టారు . రిపోర్ట్  వ్రాయటానికి .  దస్త్రాలలో కొన్ని ప్రామిసరీ  పత్రాలు ఉన్నాయి.  అవి లెక్క  చూస్తే అంతా కలిపి  అరవై వేలని  తేలింది . నగదు  పది వేలు . బంగారం వెండి  ఆభరణాలు సాధారణం గా ప్రతి గృహిణికి  ఉండే దానికి మించి లేవు . కంగు తిన్నాము . ఆశించిన  దానికి వాస్తవం  మరోలా ఉంది . 
ఇంతలో నరసింహం  వచ్చి నైరుతి దిశ గది  తాళం వేసి ఉంది అని ఉప్పు అందించాడు . 
రాజు గారి భార్యతో ' ఆ గది  కూడా తెరవండి  తల్లీ " అని ఆజ్ఞాపించాను .  
రాజు గారి భార్య   రామన్న పంతులు గారి వైపు చూసింది . సంశయంగా . 
'మా డ్యూటీ  మేము చేయాలి కదమ్మా ! ఆ గది లో  కూడా  తనిఖీ నిర్వహించి మా రిపోర్ట్ వ్రాసుకొని మీ వాంగ్మూలం  తీసుకొంటే మా పని ముగుస్తుంది " అన్నాను  ఆమెతో . 
' అది రాజు గారి గది . అక్కడ ఆయన వస్తువులు తప్ప మరేమీ లేవు  బాబూ ' అంది రాజు గారి భార్య దీనంగా  .  
' తెరవక తప్పదమ్మా " అన్నాను నేను . 
ఇక తప్పదన్నట్లు ఆమె గది తాళం తీసి తలుపులు తెరిచింది. 
ఆమె చెప్పినట్లు గానే గదిలో పెద్ద సామాను ఏమీలేదు . రాజు గారి మంచం , పడక కుర్చీ కనిపించాయి . ఇంకాస్త దృష్టి సారిస్తే ఓ మూలాన పెద్ద ట్రంక్ పెట్టె  కనిపించింది . దానికి తాళం వేసి ఉంది .  ట్రంక్ పెట్టె  చూడగానే నా కళ్ళు మిల మిలా మెరిసాయి . మా సెర్చ్ రైడ్ సఫల మవుతుందన్న ఆశ చిగురించింది నాలో .
' ఆ ట్రంక్ పెట్టె తాళం  తెరవండమ్మా ' అన్నా రాజు గారి భార్యతో . 
'ఆ పెట్టె లో రాజు గారి వస్తువులు తప్ప మరేమీ లేవు
 బాబూ ! ' అంది ఆమె. 
' తెరవాలమ్మా' అన్నా నేను . 
రాజుగారి భార్య  పెట్టె తెరిచి  అందులోని  వస్తువులన్నీ చాలా  విలువైనట్లుగా   ఒక్కొక్కటీ  బయటికి తీసి పరిచింది . 
ఆ దృశ్యం  చూసి విద్యుత్ షాక్ తగిలినట్లు అయింది నాకు . 
అవి రాజు గారి దుస్తులు . కంటి మెడ  బనీను , ఖద్దరు కమీజు , పొందూరు పంచె , కండువా ,  తుండు , జేబు రుమాలు , శీతాకాలంలో కప్పుకోడానికి వాడే షోలాపూర్ దుప్పటి, 
 శాలువా . ఆమె  రాజు గారి దుస్తులు   ఒక్కొక్కటే తీస్తూ ఆప్యాయంగా  గుండెల మీద పరచుకొని కన్నీరు కార్చింది.  రాజు గారి దుస్తులు స్పర్శిస్తూఉంటే ఆమెకు రాజు గారు పలకరించినట్లుగా ఉంది . ఓదార్చినట్లు అనిపించింది . రాజు గారు బతికే ఉన్నారు  అనిపించసాగింది .  పమిట చెంగుతో  కన్నీరు తుడుచు కొని  "  మహాదేవ  శంభో "   అని   భర్తను  మనసారా స్మరించి నమస్కరించింది . 
రాజు గారి పేరు   మహాదేవుని  రుద్రరాజు . 
ఆమె స్థితిని చూసిన నా  మనసు ద్రవించి మూగ పోయింది .  అప్పుడు ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి   రామాయణ  కావ్య రచనకు  కారణమైన  క్రౌంచ  పక్షుల  గాధ స్ఫురణకు  వచ్చింది .  వేటగాని లా  చాలా గిల్టీ గా ఫీల్ అయ్యాను . ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండ బుద్ధి కాలేదు . 
 ఆమె దీన స్థితిని  ఇక చూడలేక  "క్షమించమ్మా " అని నమస్కరించి  పంతులు గారి నుండి  , ఆమె నుండి  శలవు తీసుకున్నాము. 
                                                   ... 

  ఇది జరిగిన కొన్నాళ్ళకి  ఒక  ఫంక్షన్ లో రామన్న పంతులు గారు తారస పడ్డాడు .  నేను రాజు గారి భార్య కుశలం వాకబు చేసాను . అప్పుడు చెప్పాడు ఈ సంగతి  రామన్న పంతులు . ' రాజు గారు కాలం చేసిన తర్వాత  ఆయన బంధువు  కౌటిల్య రాజు ,  రాజు గారి భార్య ని   సానుభూతి నెపంతో  మోసగించబోతే  అది కుదరలేదు .   దాని పర్యవసానమే  మీకు  అందిన ఆకాశ రామన్న ఫిర్యాదు .
' అవును . అటువంటి సందేహం మాకూ కలిగింది   పంతులు గారూ ! ' అని శలవు తీసుకున్నాను .  
                                                 ...
చలపతి ముగించిన తర్వాత మా అందరి  గుండెలూ బరువెక్కిపోయాయి . 
                                                ... 
                                 

బయట వాన వెలిసింది . 
అప్పటివరకూ మబ్బుల మాటున దాగిని చంద్రుడు  
వెన్నెల అమృతంలా కురిపిస్తున్నాడు . 
 ఆకాశం   నక్షత్రాలు  పరచుకున్న దుప్పటిలా ఉంది .    
కల్నల్ రంగారావు  గుర్రం దిగిపోయాడు . 
రేసుగుర్రం ఎక్కి  బొక్కబోర్లా పడతానన్న రామలింగం  చతికిలపడిపోయాడు . 
అందరమూ మౌనంగా ఉండిపోయాము . 
మహాదేవ  శంభో ! అని  ఇళ్ళకి బయలు దేరాం . 

*******************************************



సీతాదేవి ని  అపహరించటానికి నిశ్చయమైన  రావణుడు  మారీచుని వద్దకు చేరుకొని  సీతాపహరణంలో సాయం  
కోరతాడు . అప్పటికే రామ బాణం ధాటికి  గురి అయి రామునికి దూరంగా అడవుల్లో తల దాచుకున్న మారీచుడు  రాముని గురించి ఇలా రావణునితో పలుకుతాడు . 



రామో  విగ్రహవాన్ ధర్మః 
సాధుః  సత్య పరాక్రమః 
రాజా సర్వస్య లోకస్య 
దేవానామివ  వాసవః


*******************************************