Friday, 28 October 2016

ఎరుపు  అంచు ....

                               నీలం రంగు జరీ చీర . 

                                   ****************

                   

సూర్యోదయం అయి రెండుగంటలు  కావస్తోంది . 
ఉదయాన్నే  ఏదో  మీటింగ్  ఉందని  హడావుడిగా  బయలుదేరి  వెళిపోయాడు  రఘురాం . భర్తను  పంపించి పక్క మీద వాలిపోయిన  విశాలాక్షి కి తెలియకుండానే రెప్పలు మూతపడ్డాయి . నిద్ర కమ్ముకొచ్చేసింది . కిటికీ లోంచి   పడుతున్న  ఉదయపు వేళ ఎండ చురుక్కు అన్పించి  నిద్ర తేలి పోయింది విశాలాక్షికి .
 ఇంకా బద్దకం  వీడలేదు . వంటిల్లు  , డైనింగ్ టేబుల్,   అంట్ల  గిన్నెలు ,ప్లేట్లతో నిండిపోయి ఉన్నాయి  . శుభ్రం  చేసుకోవాలి అన్న  తలంపు రాగానే శరీరమంతా  నిస్సత్తువ , నీరసం  ఆవహించింది . 
'రఘురాం  ఎప్పుడూ ఇంతే !  ఏ  పనిలోనూ  కాస్త సాయం  చెయ్యడు . అయినా  తనకు ఇదేం  కొత్తా ! పెళ్లి అయిన  దగ్గిర నుంచీ ఇదే  వరస ' అనుకొంది  విశాలాక్షి . 
వొళ్ళు విరుచుకొని  బద్దకాన్ని  వదిలించుకొన్న
 విశాలాక్షి  రోజువారీ  ఇంటి పనిలో పడింది . 
రఘురాం  లంచ్ కి   రానని  చెప్పి వెళ్ళాడు . ఇక మిగిలింది తను ఒక్కర్తే .  వంటకి పెద్ద ప్రయత్నం అక్కరలేదు . రాత్రి మిగిలిన  పదార్ధాలు  రెఫ్రిజిరేటరు  లో  ఎలానూ  ఉన్నాయి . వాటితో కానిచ్చేయొచ్చు అని  మిగతా పనులలో పడిపోయింది . ఇల్లంతా  శుభ్రం  చేసేసరికి  సూరీడు  నడి నెత్తి  మీద ఉన్నాడు .  స్నానం ముగించి  తనకి ఇష్టమైన  ఎరుపు  అంచు ఉన్న నీలం  రంగు   చీర కట్టుకొని   సోఫా లో కూలబడింది .
                                        ... 

ఈ చీర అంటే  తనకి చాలా ఇష్టం . బజారు  నుంచి కొనుక్కొని  వచ్చీ రాగానే కట్టుకొని  కుచ్చిళ్ళు సర్దుకుంటూ   ' ఎలా వుంది కట్టుకొంటే  ఈ చీర  ' అని రఘురాం  ని అడిగితే  నిరాశే  ఎదురయ్యింది . కంప్యూటర్  ముందు కూర్చొని  పని చేసుకుంటున్న రఘురాం  ఒకసారి ఎగా దిగా చూసి  తిరిగి  పనిలో మునిగి పోయాడు . మెచ్చుకుంటాడని  ఆశించిన  విశాలాక్షి భర్త  స్పందనకి  విసురుగా వెళ్లిపోయింది.   
                                           ... 

సోఫాలో  కూలబడిన  విశాలాక్షి  టీవీ  రిమోట్  చేతిలోకి తీసుకొని  స్విచ్ ఆన్  చేసింది అప్రయత్నంగా .  టీవీ  లో షాపింగ్  జోన్ ఛానల్ లో  అందమయిన  అమ్మాయి  అదేపనిగా వారి  వస్తువుల గురించి అదర గొట్టేస్తోంది . బోర్  అనిపించి  టీవీ  కట్టేసింది  విశాలాక్షి . 
                                                 ... 

సోఫాలో  వాలిపోయిన విశాలాక్షి  సాలెగూడులా మనసునిండా  అల్లుకున్న గత  స్మృతులను  నెమరు వేసుకుంది .  అసంతృప్తి తప్పించి  ఏ  భావమూ  
కలుగలేదు . చిన్నతనంలో  భావి జీవితం గురించి తాను ఎన్ని తీపి కలలు  కంది .  ఆ క్రమంలో బాల్యం గుర్తుకు  వచ్చింది . తాను ఒక్కర్తే  సంతానం కావటం వల్ల ఎంతో  మురిపెంగా పెంచారు  తల్లితండ్రులు , తాను ఆడిందే ఆట. పాడిందే పాట . చలాకీగా ఊరంతా తిరిగేది  స్నేహితురాళ్ళతో  కలిసి .   తాను కోరకుండానే  ఏ  వయసులో  కావలసిన   సంప్రదాయ  వస్త్రాలు , వస్తువులు ఆ వయసుకి తగ్గట్టు   అమర్చి పెట్టేవారు  తల్లితండ్రులు .  ఓణీ  లంగాల వయసు వచ్చేక  బామ్మ తో  కలిసి  శ్రావణ , ఆశ్వీయుజ ,కార్తీకమాసాల లో    ఊర్లో గుడిలో లో జరిగే  కార్యక్రమాలకు  విధిగా  వెళ్ళేది .  గుళ్లో  సాయంత్రం వేళ జరిగే  పురాణ ప్రవచనాలలో " రుక్మిణీ కళ్యాణం " , "సత్యభామా  పరిణయం ",  " శ్రీ కృష్ణ తులాభారం " అంటే తనకు చాలా ఇష్టం .  అవి వింటూ  ఉంటే మనసు పరవశించి  పోయేది .  ఎదో ఒకనాడు  శ్రీ కృష్ణ పరమాత్ముని  వంటి వాడు  అకస్మాత్తు గా వచ్చి తనను  ఎత్తుకొనిపోయి  పరిణయమాడుతాడని  కలలు కనేది . మనసులో మాట  బామ్మకి చెపితే  ' నీకేమి  తక్కువే ! మేలిమి బంగారం ఛాయ.  చిదిమి దీపం పెట్టుకోవచ్చు . '  అని బుగ్గలు పుణికి పుచ్చుకొని  నుదిటి మీద  ముద్దు పెట్టేది .  ఇలా కలలు  కంటూ ఉండగానే  కాలం   తెలియకుండా   డిగ్రీ  చదువు  పూర్తి  అయిపొయింది .  ఈ మధ్య కాలంలో  తన స్నేహితురాళ్లు  చాలా మంది  వివాహాలు చేసుకొని స్థిర పడిపోయారు . ఒకసారి తన ప్రియ మిత్రురాలు  ఉమ కలిస్తే   ' ఉమా ! ఎలా వుందే  వివాహ  జీవితం  ? '  అని  అడిగింది . 
' నువ్వూ  త్వరగా  మూడు ముళ్ళూ  వేయించుకో ! అప్పుడు  నీకే  తెలుస్తుంది ' అంది ఉమ మహా సిగ్గు పడిపోయి . 
' మీ ఆయన  నిన్ను బాగా చూసుకుంటాడా ! ' అడిగింది విశాలాక్షి . 
' నన్ను వదిలి ఉండలేడనుకో ! రెండ్రోజులు  అయ్యింది అమ్మా వాళ్ళ వద్దకు వచ్చి . అప్పుడే కబురు .  తిరిగి రమ్మని .' అంది  వయ్యారాలు ఒలికిస్తూ . అలా అని తుర్రుమని పారిపోయింది ఉమ  పని ఉందంటూ . 
ఉమ తో సంభాషణ  అనంతరం  విశాలాక్షి  మనసు  వివాహం మీదికి  మళ్లింది . ఊహల్లో  మన్మధుడి లాంటి వరుడు మెదిలాడు .  ఇంటిలో ఎవ్వరూ  పెళ్లి మాట  ప్రసక్తి  తేవటం లేదు .  ఈ మధ్యన ఎల్లప్పుడూ  ఆలోచనలతో పరాకుగా ఉన్న మనమరాలిని  చూశి  ప్రశ్నించించింది బామ్మ . 
' ఏమి టే  ! అమ్మడూ !  పెళ్లి కొడుకుని  చూడమంటావా ! అని .
' ఫో ! బామ్మా ! ' అని తుర్రున పారిపోయింది  తను . 
లోకాన్ని తరచి చూసిన అనుభవం బామ్మది .  మనవరాలి మనసు గ్రహించిన బామ్మ  కొడుకు తో అంది ఇలా ' పెళ్లీడు కొచ్చిన  కూతురి గురించి  ఆలోచించావా ! మంచి సంబంధం  చూడు .  వివాహం  జరిపిద్దాం . ' 
' అలాగే  అమ్మా ! ' అన్న తండ్రి మాట విన్న విశాలాక్షి  గదిలో  గంతులేసింది . 
అటుగా  పని మీద వచ్చిన  తల్లి  '  దీనికి ఇంకా అల్లరీ , చిన్నతనం  పోలేదు ' అనుకొంది  మనసులో
బామ్మ పట్టుదలో  లేక తండ్రి ప్రయత్నాలో తెలియదు   గాని త్వరగానే  మంచి సంభంధం  కుదిరింది  విశాలాక్షికి .బాగా ఆస్తిపాస్తులు  పెద్ద చదువు , ఉద్యోగం  ఉన్న  సంబంధం   నిశ్చయమైంది . వరుడు రఘురాం  రంగు కాస్త  నలుపు అయినా మంచి  కళ గల మొహం , నిండైన విగ్రహం .   అట్టహాసంగా వివాహం  జరిగింది . తల వంచి  మూడు ముళ్ళు వేయించుకున్న విశాలాక్షి  గెండెల మీద  గిలిగింతలుపెడుతున్న మంగళ సూత్రాలు  చూసి మురిసిపోయింది . 
బామ్మ  ' అదేమిటే ! అమ్మడూ ..  మీ ఆయన  మరీ ఛాయ తక్కువగా  ఉన్నాడు ' అంది చిలిపిగా . 
' నీలి మేఘ శ్యాముడు ' అంది తను గర్వంగా . 
' అలాగా ' అంది బామ్మ .  
' అవును . వెంకట రమణ మూర్తి . వేంకటేశ్వరస్వామి  విగ్రహం  నలుపు  అయినా చూడు ఎంత  కళ కళ  లాడిపోతూ వుంటాడో  స్వామీ ' అంది తను సమర్ధించుకొంటూ . 
'ఆసి  భడవా ! మాడు ముళ్ళూ  పడగానే  ఎంత ఎదిగిపోయావే ' అంది  బామ్మ . 
                                               ... 
అందరిలానే  తనూ కాపురానికి వెళ్ళింది . అందరికీ  వివాహ జీవితం  స్వర్గం లా అనిపిస్తే  తనకు కొన్ని రోజుల తర్వాత  ఎందుకో భిన్నంగా అనిపించింది  . ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా  త్రుళ్ళి పడే తన మనస్తత్వానికి  పూర్తిగా భిన్నం  రఘురాం . 
రఘురాం  మిత భాషి .  అందరితో కలిసిపోయే తత్త్వం కాదు . ఎప్పుడూ తన లోకంలో ఉంటాడు . అలాగని చెడ్డవాడేమీ కాదు . తను  ఏది కోరితే అది  సమకూర్చేవాడు . సంపదకు లోటు లేదు . సౌకర్యాలకు కొదవ లేదు . లేనిదల్లా కలివిడి . కొంతకాలానికి విశాలాక్షి కి   తామిద్దరం విభిన్న ధృవాలమని అర్థమైపోయింది . ఉత్తర ధృవం , దక్షిణ ధృవం  కలవడం అసాధ్యమని తేలిపోయింది .  జీవితంలో చాలా మాధుర్యాన్ని ఊహించుకున్న విశాలాక్షి కి అది ఎండమావిలా  అనిపించ సాగింది . 
ఒకసారి  పుట్టింటికి  వెళ్ళినపుడు  కళ  కోల్పోయిన తనని చూసి బామ్మ  అడిగింది . ' అమ్మడూ ! ఏమంటాడే మీ ఆయన .  బాగా చూసుకుంటాడా !'. అని .
' బాగానే చూసుకుంటాడు బామ్మా ! ' అంది తను  నిర్లిప్తంగా.
'మరి ' అంది బామ్మ . 
' ఓ సరదా లేదూ ! పాడూ లేదూ ! బంధువుల ఇళ్లకు గాని  స్నేహితులను  కలుద్దామని గాని , పెళ్లిళ్లకు ,రిసెప్షన్  లకు గాని వెళ్లి వద్దామంటే   " నువ్వు వెళ్లి వచ్చ్చేయ్యి . డ్రైవర్ తో చెప్తాను కారులో తీసుకువెళ్లి రమ్మని " అంటాడు . ఎప్పుడైనా  బలవంతం  చేస్తే  కూడా వచ్చి  ఓమూలన చింతపండు  మూట లా కూర్చుండి పోతాడు . ఎవరైనా పలకరిస్తే క్లుప్త సరి జవాబు చెప్పి అసౌకర్యంగా  ఫీల్ అవుతాడు . అలాటి సందర్భాలలో ముళ్ళ మీద  కూర్చున్నట్లు ఉంటుంది నాకు.మన ఇంటిలో అటక మీద మూలన  నువ్వు పారేసిన మొద్దు రాచ్చిప్ప  గుర్తుకు వస్తుంది . ' అంది విశాలాక్షి . 
'  నలుగురిలో మొహమాటం  ఏమోనే! ' అని సమర్ధించింది బామ్మ . 
                                           ... 
నిస్సారంగా కాలం గడిచిపోతోంది . యాంత్రికంగా జరిగిపోతోంది . ఇద్దరు ఆడ పిల్లలు కలిగారు . వారి పాలన , పెంపకం, చదువులు  అన్నే తన మీదే వేసుకొంది విశాలాక్షి . రఘురాం  ఏ నాడు కలుగచేసుకోలేదు . పిల్లలు పెరిగి  పెళ్లి ఈడు రాగానే వారి వివాహాలు కూడా తానే జరిపించి  అత్తవారింటికి  పంపింది విశాలాక్షి .  భార్యా భర్తల మధ్య బాధ్యతల సంయమన లోపం ఎంత అసంతృప్తికి గురి చేస్తుందో  అనుభవం లోకి వచ్చింది  విశాలాక్షికి . 
                                               ... 
పిల్లలు వెళ్లిపోయిన తర్వాత ' ఇద్దరమే మిగిలాం  శొంఠి కొమ్ముల్లా " అనుకొంది విశాలాక్షి .
ఒక రోజు నిలువు టద్దంలో చూసుకుంటే  తల ముగ్గు బుట్టలా కనిపించింది .
'అబ్బా ! ఎంత  కాలం గడిచి పోయింది . ఏ  అనుభూతులు లేకుండా ! ' అనిపించింది .  బాధ్యతలు     తీరిన తర్వాత తన జీవితంలో ఇన్నాళ్లూ   కోల్పోయిన  సంతోషాన్ని  పాత స్నేహాలని   పునరుద్ధరించుకొని  వెదుక్కోవాలనుకొంది  విశాలాక్షి . ఇంటర్నెట్  లో సెర్చ్  చేస్తే   చిన్నతనం  కాలం నాటి  స్నేహితురాళ్ళు  కొంతమంది  దొరికారు .  
ఇప్పుడు  విశాలాక్షి కి   రెక్కలు వచ్చినట్లు  అనిపించింది . వారితో  కాలక్షేపం బాగానే జరిగిపోతోంది .  రఘురాం  కి లంచ్   అమర్చి  టేబుల్ మీద పెట్టి   నెల నెలా  స్నేహితురాళ్ళతో కలిసి  కిట్టీ  పార్టీలకు  వెడుతోంది . రఘురాం  ఎటువంటి  అభ్యంతరమూ  చెప్పలేదు . ఎప్పిటి లాగానే .  అలా కాలక్షేపం జరిగిపోతోంది . 
                                                  ... 
గత స్మృతుల నుండి  బయటపడిన విశాలాక్షి  దృష్టి  ఎదర గోడమీద ఉన్న గడియారం మీద పడింది . టైం  రెండు గంటలు  చూపిస్తోంది గడియారం .  ' ఆమ్మో ' అని లేచిన విశాలాక్షి  లంచ్  చేసి కాస్త కునుకు తీద్దామని  పడక గదిలోకి వెళుతూ ఉండగా  సెల్ ఫోన్  మ్రోగింది . 
ఎవరూ ! ఈ టైం లో  అని చూస్తే  రఘురాం . 
' హలొ ' అంది విశాలాక్షి . 
'నేనే ' అన్నాడు రఘురాం అటువైపునుండి . 
 ' పొద్దున్న హడావుడిలో  ముఖ్యమైన  ఫైల్ మర్చిపోయాను.ఆఫీస్ బాయ్  వస్తాడు . ఇచ్చి పంపించు ' అని గోడతో మాట్లాడినట్లు  మాట్లాడి  ఫోన్ పెట్టేసాడు రఘురాం . 
కాసేపట్లో ఆఫీస్ బాయ్  వస్తే ఫైల్ ఇచ్చి  పంపించింది విశాలాక్షి  . అప్పుడు ఫైల్ తీస్తూ ఉండగా  రఘురాం డైరీ జారి క్రింద నేల  మీద పడింది .  ఆ డైరీ  తాను ఎప్పుడూ చూడలేదు .  తిరిగి అల్మారాలో పెడదామని  నేల  మీద నుండి  డైరీ తీస్తూ  ఉండగా  డైరీ లోని కొన్ని పేజీలు  దృష్టి లో పడ్డాయి అసంకల్పితంగా . అందులో  కొన్ని చోట్ల తన  పేరు చూసి విస్మయం  చెందింది విశాలాక్షి .  ఎంత  భర్త అయినా  పర్సనల్   డైరీ చదవడం  సంస్కారం  కాదని  అనిపించినా ఉత్కంఠ  ఆపుకోలేక పోయింది విశాలాక్షి . 
పక్క మీద వాలి   రఘురాం డైరీ చదవటం మొదలుపెట్టింది.
ఆసాంతం  డైరీ  చదివాక  విశాలాక్షి కి కన్నీరు ఆగలేదు . గుండెల మీద  ఆచ్చాదనగా  పరుచుకున్న  చీర  కన్నీటికి తడిసి ముద్దయి పోయింది . రఘురాం  తన మీద  హృదయంలో పదిలపరచుకొన్న  ప్రేమ , అనురాగం,  తెలుసుకొన్న విశాలాక్షి  విస్తుపోయింది . ఇన్నాళ్లూ  ఈ విషయం  ఎలా గుర్తించలేకపోయిందో  అర్థం కాలేదు . 
లోపం  ఎక్కడ ఉందొ  తెలుసుందామని గతం తరచి స్మరించుకుంటే అప్పుడు స్ఫురించింది . 
అహం  ,మనసులు విప్పి మాట్లాడుకోకపోవడమే 
 కారణం అని . 
పొద్దు  పోయింది ' రఘురాం  ఇంకా ఇంటికి రాలేదేమిటీ ' అని కంగారు పడుతూ ఉండగా  డోర్ బెల్ మ్రోగింది . 
తలుపు తెరిచి చూస్తే  రఘురాం .
ఇంట్లోకి వచ్చి సోఫాలో కూలబడ్డాడు రఘురాం అలసిపోయినట్లుగా . 
ఇన్నాళ్లూ ' కాఫీ కలిపి  టేబుల్ మీద పెట్టాను ' అని తన గదిలోకి వెళ్లిపోయే  విశాలాక్షి ఈసారి అలా చేయలేదు . 
కాఫీ  కప్పు  రఘురాం చేతికి అందించింది ఆప్యాయంగా . 
భార్య కళ్ళలోకి చూసాడు రఘురాం . 
'ఆలస్యమయింది దేనికి' అంది విశాలాక్షి . 
' ఆఫీస్ పని ముగిశాక  రవీంద్ర భారతి లో  " భారతీయ వివాహ  సంస్కృతీ - సీతా రాముల దాంపత్యం "  గురించి ప్రవచనం ఉందని  స్నేహితులు బలవంతం చేస్తే వెళ్లాను . ప్రవచనం విన్నాక ఇన్నాళ్లూ  ఏమి  కోల్పోయానో  తెలిసింది . నన్ను క్షమించు విశాలీ . నీ మనసు తెలిసికోలేక పోయినందుకు . ' అని  బ్రీఫ్ కేసు  నుండి ఒక గిఫ్ట్ ప్యాక్ చేసిన  అట్ట పెట్టి అందించాడు   రఘురాం విశాలాక్షికి . 
భర్త చర్యకి  ఆశ్చర్యపోయింది  విశాలాక్షి . 
ఆతృతగా  విప్పి చూసింది . 
ఎరుపు  అంచు  నీలం  రంగు  జరీ  చీర . 
అందలం  ఎక్కినంత  సంబరం కలిగింది   విశాలాక్షికి . 
క్షణంలో  చీర మార్చుకొని వచ్చింది  విశాలాక్షి . 
ఎరుపు అంచు  నీలం రంగు జరీ చీరలో  దేవతలా కనిపించింది  విశాలాక్షి  రఘురాం కళ్ళకి . 
ఆప్యాయంగా   భుజాల  మీద   చేయి  వేసి హత్తుకున్నాడు  విశాలాక్షిని . 
 హఠాత్తుగా   ఉమ  గుర్తుకొచ్చింది  విశాలాక్షి కి . 
వివాహబంధం లోని  మాధుర్యం  తెలిసి వస్తోంది నెమ్మదిగా . 
ఆ రాత్రి  విశాలాక్షి  జీవితంలో  అమృతం కురిసిన  రాత్రి . 
                                       ... 
మనుషుల లోని  అహం , ద్వేషం , అసూయ  అనే గుణాలే అసురులు . 
ఈ రోజు  నరక చతుర్దశి . 
నరకాసురుడు  వధింపబడిన రోజు .  
అందరి లోగిళ్ళలో  దీపాలు, దివ్వెల  కాంతులు  వెలిగే  దీపావళి  మరుసటి రోజే మరి. 
మిత్రులందరికీ  దీపావళి శుభాకాంక్షలు . 
                                                  ... 


*******************************************


ఎన్నోరోజులుగా  మదిలో మెదులుతున్న  ఈ  కధ అంశానికి  అక్షర రూపం  ఇన్నాళ్ళకి సాధ్యపడింది . 
చంద్రుడు గారి అబ్బాయి . 
29 th  october 2016. 
*******************************************