Saturday, 4 June 2016


కాలం  మింగేసిన  బాల్యం . 

                     (05)                             


                                                       



          Illustration  by Baby Aanya , California, USA.




అలా వంటిమామిడి  నుండి  రాజప్ప , నేను  విశాల  ప్రపంచం లోకి  అడుగులు  వేశి   బరంపురం  లోని    మాతామహుల  ఇంటికి   చేరాం . బంధువులు  మా తాతని  సత్యం బాబయ్య అని అమ్మమ్మని పెద్ద అక్కయ్య  అని పిలిచేవారు .  

 తాత  సత్యం గారు  అప్పట్లో  పోతాప్రగడ నరసింహారావు  గారి  ఇంట్లో  అద్దెకు ఉండేవారు . అది  లంకంత ఇల్లు . ముందు విశాలమైన  ఖాళీ  స్థలం .  అది దాటగానే అరుగు.   ఇంటి  ముఖద్వారం.  లోపల  పెద్ద హాలు .  ఈ హాలు ని  రెండు గా విభజించింది   అమ్మమ్మ రంగనాయకమ్మ .   మద్యలో  టేకు   బీరువాలు  అడ్డంగా   అమర్చి .  దీనికి ఆనుకొని ఒక గది. ఇది తాత సత్యం గారు  దుస్తులు మార్చుకోవటానికి  ఉపయోగించేవారు . తర్వాత వసారా . ఈ వసారా నుండి మేడ మీదకి వెళ్ళడానికి  విశాలమైన  చెక్క మెట్లు.  మెట్ల లాండింగ్  క్రింద   మా వంటావిడ  చిట్టెమ్మ గారు , ఆమె  కుమారుడు  వెంకట్రావ్  మకాం    .  ఇక  మేడ  మీద  మూడు గదులు .   మెట్లు ఎక్కిన తర్వాత మూలగా  ఒక గది  . దీన్ని  కొట్టు గదిగా  వాడేవారు . మేడ మీద మద్యలో  రెండు  గదులు . మధ్యగా ఉండే గది మావయ్య  గది . దానికి అనుకొని ఉన్న గది తాత  సత్యం గారి పడక గది . తాత సత్యం గారు ఎప్పుడో గాని ఈ గదిని వాడే వారు  కాదు .   బాబులు అన్న ఈ గదిని తన గదిగా ప్రకటించేసుకొని ఆక్రమించుకున్నాడు .    ఈ గదుల చుట్టూ  పెంకుటింటి వసారా . ఈ వసారా లో రాత్రి పాపక్క తో సహా  పిల్లలం అందరమూ పక్కలు వేసు కొని పడుకొనే వాళ్ళం

ఇందాక  క్రింద వసారా గురించి చెప్పాను   కదా . వసారా నుంచి క్రిందకు ఎత్తు అరుగులు ఉండేవి . అరుగులు దిగగానే   టెన్నిస్ కోర్ట్  అంత  విశాలమైన అంగణం . ఈ అంగణం లో  రోజూ   పొద్దున్నే తాత  సత్యం గారు  పేము  కుర్చీ వేసుకొని  కాఫీ  త్రాగి సావధానంగా  డైలీ న్యూస్  పేపరు చదువుకొనేవాడు . ఆయన  చదవటం ముగియగానే  మంగలి  గోవిందు  హాజరయ్యేవాడు  గెడ్డం గీయడానికి . ఆ కార్యక్రమం  అయ్యాక  తాత సత్యం గారు  ఆఫీసు  కి వెళ్ళడానికి ఉపక్రమించేవాడు .

 ఇదీ మా తాత ఉదయపు దిన చర్య . 
అంగణం దాటిన  తర్వాత  ఎత్తులో వసారా . దాని వెనుక ఎడమవైపు  డైనింగ్  రూం . దాని వెనక  వంట గది . కుడివైపు పురుళ్ళ గది . అది దాటి వెడితే  వెనుకవైపు స్నానాల గదులు  వగైరా.   మైదానమంత పెరడు . పెరట్లో జామ , మారేడు , వేప  మొదలగు రకరకాల  చెట్లు. మా పెరటి గోడ వెనకాల  ప్రభుత్వ  ఆసుపత్రి   ఎమర్జెన్సీవార్డ్  ,శవాలు భద్ర పరిచే  గదులు . 
అంగణం  మూలన  ఎడమవైపు  ద్వారం .   ఈ ద్వారం నుంచి బయటకు వెడితే  సందు . ఈ సందు లోంచి  పెరట్లోని  నూతి వైపుకు  మరియు  ఇంటి ముందు ఖాళీ స్థలానికి దారి . 
  అన్నపూర్ణ (అక్కయ్య ), సరోజిని  (జానకి ), యశోద (అన్నపూర్ణ ), అనసూయ (వెంకటి) , పార్వతి , సీత , బోడపాటి  సత్యనారాయణ  రంగానాయకమ్మల సంతానం .  మా అమ్మ యశోద . ఈ కధా  కాలం నాటికి  మెదటి నలుగురు కుమార్తెల వివాహాలు  జరిపించారు తల్లితండ్రులు .పిన్ని పార్వతి ఇంటర్ తరగతి ,సీత  స్కూల్ ఫైనల్  చదువులు చదువుతూ  ఉండేవారు .   మొదటి నలుగురు కూతుర్లకి వివాహాలు కావటంతో పురుళ్ళ గది  సంవత్సరం  పొడవునా   పురిటి తల్లులతో   నిండి ఉండేది .  
మగ సంతానం లేక పోవడంతో  మా తాత సత్యం గారు  రాజమండ్రీ  లో నివసిస్తున్న తన తమ్ముడు  శివరామకవి  కుమారుడు  రామలింగేశ్వరప్పని   (రామం)  అక్కున చేర్చుకొని  అభిమాన పుత్రుడిగా   పెంచి పెద్ద చేశారు . ఈ  రామలింగేశ్వరప్పే   మా మావయ్య.  మా అమ్మ కన్నా  ఒకటి రెండేళ్ళు వయసులో చిన్న . మావయ్య సాంగత్యం మా అందరి జీవితాలని తర్వాత కాలంలో చాలా  ప్రభావితం చేసింది .  
ప్రతి ఏడాది  కనీసం  ఇద్దరు  కూతుర్లు  పురిటికి  రావడంతో  మా తాత ఇల్లు   మనవలు , మనవరాళ్ళ  తో నిండిపోయింది . వీరితో   ప్రేమ బంధాలు  గట్టిగా బలపడటంతో  కొంత మందిని  తమ వద్దే ఉంచేసుకుని  అక్కున చేర్చుకున్నారు  సత్యం గారు ,  రంగనాయకమ్మ  దంపతులు .  
పెద్దలు , పిన్నలు , చంటి పిల్లలు ,  బంధువులు ,  ఆప్తులు  , నౌకర్లు  చాకర్ల తో కలిపి  కనీసం పాతికమంది కలిశి  ఉండేవాళ్ళం తాత ఇంటిలో . భలే సందడి . బాబులు అన్న ,పాపక్క, గున్ను , తంబి , నాని , మోహన్ , నేను , రాజప్ప, సూర్యం  మా తాత  బాల సైన్యం .  పార్వతి , సీత   మా  అందరి  మంచి చెడ్డలు  చూసేవారు   . పురిటి  తల్లుల   చంటి  బిడ్డలు  కాస్త పెరిగి  పెద్ద అయ్యాక   బాల  సైన్యంలో  చేరి పోయారు .      

మా    పొరుగున  ఒక వైపు  ఉన్నవ రామలింగంగారి   కుటుంబం .  కుమార్తె  కోమలం , అల్లుడు నరసింహారావు ,వారి పిల్లలతో కలిసి ఉండేవారు .  . రామలింగం గారి  పూర్తి  పేరు  ఉన్నవ  వెంకట  వరహ  బుచ్చి రామలింగం .  మాథమాటిక్స్  ప్రొఫసర్ . స్వాతంత్ర ఉద్యమ  సమయంలో గాంధీ మహాత్ముని   పిలుపునకు   ప్రభావితుడై   స్వాతంత్ర  యోధుడి గా మారి  ఉప్పు సత్యాగ్రహం నడిపించిన   ప్రముఖులు . ఎల్లప్పుడూ  కాంగ్రెస్ పార్టీ  కార్యక్రమాలతో  బిజీ  గా ఉండేవారు . ఇంటి పట్టున ఉండే సమయం చాలా 

తక్కువ . వీరి వస్త్ర ధారణ  అతి సామాన్యం గా ఉండేది . 
ఖద్దరు పంచె , భుజాన  ఓ  ఖద్దరు చాపు .    గుడ్డ సంచీ.   మెడ క్రింది వరకు   తెల్లటి  గెడ్డం .   మేము  వారిని  గెడ్డం తాతగారు అని పిలిచేవాళ్ళం . రామలింగంగారు  మా అమ్మమ్మకి  దగ్గిర  బంధువు . రామలింగం గారి భార్య  మహాలక్ష్మి  (పిల్లమ్మ ).  మాకు  ఇల్లు అద్దెకి  ఇచ్చిన    పోతాప్రగడ నరసింహా రావు  గారు  రామలింగం   గారి  అల్లుడు . 
 నరసింహం గారిని   'ఎర్రబాబు  గారు' అని పిలిచేవారు . మాకు కూడా అదే అలవాటు . ఆయన  తెల్లని ఖద్దరు వస్త్రాలు , నెహ్రూ టోపీ  ధరించేవారు . ఆయన భార్య  కోమలమ్మ . మమ్మల్ని ఆప్యాయంగా పలకరించేది . వారి పిల్లలు  వీర్రాజు , లక్ష్మణుడు, దేవికుమార్ , ఈశ్వర్ , శాంత ,మరియు జానకి (జాని ) . కోమ లం  గారి సోదరి  సుభద్ర . సోదరుడు  రామారావు .  రామారావు మా నాన్న సహచరుడు  మరియు  మిత్రుడు .  సుభద్రమ్మని  'సిస్టర్ ' అని పిలిచేవారు . మేమూ  అలానే  పిలిచేవాళ్ళం .  వీరి ఇంటిలో   మేము అంగణం  నుండి  వెలుపలికి   వెళ్ళే గుమ్మం  సందు ముందు  ఎదరగా ఉన్న ప్రహారీ గోడకి ఆనుకొని  నేరేడు చెట్టు  కాలంలో విపరీతంగా కాపు కాసేది.  దేవి, ఈశ్వర్  అటువైపు నుండి సైగ  చేస్తే  అపరాహ్నం  వేల పెద్దలు విశ్రమించే సమయంలో  నాని  సడి  సవ్వడీ  చేయకుండా చెట్టు ఎక్కి దులుపు దులిపేసేవాడు . పెద్దలు ' ఎవర్రా అది ' అని వచ్చేలోపుల నేల పడిన  నేరేడు పళ్ళు  నిక్కరు, చొక్కా జేబుల్లో కుక్కేసుకొని  పారిపోయేవాళ్ళం  గప్ చిప్ గా.     వీరందరి    స్నేహ బంధం   మరువలేని మాధుర్యం . నిర్మలాకాశమంత  విశాలమైనది ఆ స్నేహం 
 యింకొక  పొరుగు పెండ్యాల వారి కుటుంబం . వీరి ఇంటిలో  మనుషులు తక్కువ . పెద్దాయన  ఆరోగ్యం బాలేక పోవటంతో  ఇంటి ఇల్లాలు   తీరిక లేక ఎక్కువ బయట  కనిపించేది కాదు . వారికి ఇద్దరు కుమారులు ,ఒక కుమార్తె . పెద్ద కుమారుడి పేరు అచ్యుతం . రెండవ ఆయన పేరు  నాకు గుర్తు లేదు . కొడుకులు ఇద్దరూ ఉద్యోగాలనీ ,  చడువులనీ    దూర  ప్రాంతాల్లో  
ఉండేవారు .  కుమార్తె  సీత . సీత   మా  గున్నక్క   వయసు.    అప్పుడప్పుడు మాతో ఆడుకొనేది . 

మా వీధిలో  నాభి వారు , బూర్ల  వారు నివాసం ఉండేవారు . నాభి వారి పిల్లలకు  కూడా ఇంచుమించు  మా ఇంట్లో వాళ్ళ వయసే ఉండటంతో  మాకు  దోస్తీ బాగానే కుదిరింది.  బూర్ల  వారి అబ్బాయి  ప్రకాశరావు (టిక్కడు )  నాకు  బాల్య మిత్రుడు . వారి ఇంటిని దాటి  ఇంకా ముందుకు వెడితే  చర్చి,  చర్చి తర్వాత  సుందరేసన్ మాస్టారు , యడవల్లి వారు ,  బారకాసు మైదానం , బస్సు స్టాండ్, జ్యోతి  టాకీస్ , గురజాడ వారు , ధర్మారావు మేష్టారు . డాక్టర్ ప్రకాశరావు  గారు , మారెళ్ళ వారు , మామిడన్న వారు  ఇలా చాలా బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి . ఇంకాస్త  ముందుకు వెడితే  జగన్నాథ విలాస్, చిన్న బజార్,  తోట స్టూడియో , బులుసు వారు , అర్బన్ బ్యాంకు , సిరపాయి గారి ఇల్లు , జగ్గుల మేష్టారు ,  తుని  క్లాత్ షాప్ , మలుపు తిరిగితే అయ్యగారి వారి తెల్ల మేడ ,ఎదరగా  శ్రీ సత్యనారాయణ  స్వామి వారి ఆలయం ,  పాకనాటి వారి మేడ , ఆ పైన  రామలింగం ట్యాంక్ , ఎదరగా ఉన్నవ  వారి Lake View  బంగళా , టౌన్  స్కూల్ , బుచ్చయ్య టాకీస్  ( SSVT- శ్రీ సీతారామ  విలాస్  టాకీస్ ) , చిన్న గర్ల్స్ స్కూలు  ఇలా చెప్తూ పొతే ఎన్నో ఎన్నెన్నో అంతు  లేని  ల్యాండ్ మార్క్స్  కానవస్తాయి  జ్ఞాపకాల  పొరల్లో . 

... 
బ్రటిష్ వారి హయాంలో  బెంగాల్ , బీహార్ ,ఒరిస్సా  ప్రాంతాలు  కలిపి  బెంగాల్  ప్రావిన్స్ గా ఉండేది . 1911 వ సంవత్సరంలో బెంగాల్ ని విడ దీసి  బీహార్ ,ఒరిస్సా ప్రాంతాలను  కలిపి ఒక ప్రావిన్స్ గా  చేసారు . ఆ తర్వాత ప్రజల ఒత్తిడి కి , రాజకీయ ఉద్యమాలకి తల ఒగ్గి  బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సా ప్రావిన్స్ ఏర్పాటు చేసింది . 1936 వ సంవత్సరం   ఏప్రిల్  ఒకటవ తేదిన  ఒరిస్సా ( ప్రస్తుతం ఓడిశా ) ప్రావిన్స్ ఆవిర్భవించింది(ఉత్కల్  దివస్ ) . ఈ పరిణామంతో అప్పటివరకు  మద్రాస్ ప్రెసిడెన్సీ లోని   తెలుగువారు అధిక సంఖ్యలో ఉండే  బరంపురం , పర్లాఖిమిడి  ప్రాంతాలు  (గంజాం , పర్లాఖిమిడి  జిల్లాలు )  ఓడిశా  ప్రావిన్స్ లో  విలీనం కాబడ్డాయి . వీటిని  తిరిగి  మద్రాస్ ప్రెసిడెన్సీ లో  చేర్చాలని  స్థానిక కాంగ్రెస్ నాయకులు  దీర్ఘ పోరాటం చేసారు గాని అవి ఏమీ  ఫలించ లేదు .   ఆ తర్వాత  దేశానికి స్వాతంత్రం రావటం , ప్రాంత  ప్రజలు మాట్లాడే భాష  ని బట్టి రాష్ట్రాలు ఏర్పడటం , ఆంధ్ర  రాష్ట్ర  అవతరణ అంతా  ఒక చరిత్ర .

1947  వ సంవత్సరం  ఆగష్టు నెల  15 వ  తేదీ  దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు . దేశమంతటా  స్వాతంత్ర  వేడుకలు ఘనంగా జరిగాయి.    కాకతీళీయంగా  ఆ సమయంలో  ప్రముఖ కాంగ్రెస్ నాయకులు  డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు  మా తాత సత్యం గారి ఇంట్లో ఉండటం జరిగింది . మరునాడు  మా ఇంట్లో  జాతీయ జెండా ఎగరవేసి  , ఒక పెద్ద  గ్యాస్ బెలూన్  ఆకాశం లో  వదిలాం . అది  ఎగురుతూ  నక్షత్రాలలో కలిసిపోయింది .  ఈ కార్యక్రమం  మా మావయ్య పర్యవేక్షణలో  సీత రామయ్య గారు  ముఖ్య అతిధి  గా  జరపబడింది . మాకు ఆ చిన్న వయసులో  సందర్భం  ప్రాముఖ్యం  తెలియక పోయినా  జెండా వందనం చేసి  ఆనందించాం .  గట్టిగా  చప్పట్లు  చరిచాం . మా చప్పట్లకి  , ఆనందంతో వేసిన కేకలకి  ఇంటి ప్రాంగణం మార్మోగిపోయింది . 
...

 




( హింకా ఉంది )